Vitamin Pills : విటమిన్ మాత్రలు ఎవరికి అవసరమో తెలుసా?
విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేయొచ్చు.
- Guntupalli Ramakrishna
- Published On : December 21, 2021 / 04:17 PM IST
Vitamins
Vitamin Pills : ఇటీవలికాలంలో పోషకాల మాత్రల వినియోగం పెరిగింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ వీటిని వాడుతున్నారు. నిజానికి ఇలాంటి పోషక మాత్రలు అవసరమా అంటే…శరీరంలో ఇవి లోపించినప్పుడు మాత్రమే అవసరం అని వైద్యులు చెప్పే మాట..అయితే పోషకాల లోపం లేకుండానే చాలా మంది కరోనా నుండి రక్షణ కోసం అంటూ తమకుతాముగా మందుల దుకాణాల్లో కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ఇది ఏమాత్రం సరికాదంటున్నారు నిపుణులు.
వాస్తవానికి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పిండి పదార్థాలు, నూనెలు, కొవ్వులతో కూడిన పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. చాలామందికి దీంతోనే అవసరమైన పోషకాలు లభిస్తాయి. కానీ కొందరికి అదనంగా పోషకాల మాత్రలు అవసరమవుతాయి. ఇది ఆయా వ్యక్తుల ఆరోగ్యం, వయసు, ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అదికూడా ఏపోషకాలైతే లోపం ఉందో వాటిని మాత్రమే వైద్యుని సలహామేరకు తీసుకోవాలి. విటమిన్ మాత్రలతో జబ్బులు నయమవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఆహారం ద్వారా లభించని పోషకాలను భర్తీ చేయటినికి మాత్రమే విటమిన్ మాత్రలను వినియోగించాలి.
మన శరీరానికి పోషకాల అవసరం, వీటి మోతాదుల విషయంలో వయసు చాలా కీలకం. వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్ డి, విటమిన్ బి12, క్యాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తిననివారికీ ఇవి అవసరం. విటమిన్ బి12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరప్‌లు సూచిస్తుంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్నవారికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల సమస్యల నివారణకు తోడ్పడుతుంది. శిశువులకు తల్లిపాలతోనే తగినంత విటమిన్ డి లభించదు. అందువల్ల అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.
గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్, హెచ్‌ఐవీ, వంటి జబ్బులతో బాధపడేవారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. ఎవరికి ఎలాంటి పోషకాలు, ఎంత మోతాదులో కావాలనేది ఊహించటం కష్టం. అలాగని ఎవరికివారు కొనుక్కొని వేసుకోవటం శ్రేయస్కరం కాదు. డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పోషకాలను, తగు మోతాదులో తీసుకోవటం మంచిది. రక్త పరీక్షల ద్వారా ఏయే పోషకాలు లోపించాయో తెలుసుకోవాలి. తరువాత మాత్రమే వైద్యులు సిఫార్సు చేసిన మోతాదులో నిర్ణీత సమయం వరకు వాడుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ మాత్రలతో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నది చాలామంది నమ్మకం ఏమాత్రం నిజం కాదు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం, మెగ్నీషియం వంటివి రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి కీలకమే. కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోగనిరోధకశక్తి పుంజుకుంటుందని పరిశోధనల్లో ఎక్కడా బయట పడలేదు.
విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేయొచ్చు. మోతాదు ఎక్కువైతే కొన్ని పోషకాలు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. మూలికా ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటి ప్రభావం వివిధ రకాలుగా ఉంటుంది. అప్పటికే వాడుతున్న మందుల పనితీరునూ దెబ్బతీయ్యటమే కాకుండా, దుష్ప్రభావాలను చూపుతాయి.
