Foot Care : చలికాలంలో పాదాల సంరక్షణ కోసం…

బకెట్‌లో రెండు చెంబుల గోరువెచ్చని నీరుపోసి రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌, ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అందులో పాదాలను ఉంచాలి.

Foot Care

Foot Care : చలికాలంలో చాలామందికి చర్మ ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ప్రధానంగా ముఖం, పెదవుల విషయంలో చాలా మంది జాగ్రత్తలు పాటిస్తూ వాటి సంరక్షణకోసం అనేక చర్యలు తీసుకుంటుంటారు. అయితే పాదాల సంరక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోరు. దీని వల్ల పాదాలు చల్లటి గాలులకు పగిలిపోవటం ఇతర సమస్యలకు గురవ్వటాన్ని గుర్తించవచ్చు. శీతాకాలంలో పాదాల సంరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. చలికాలంలో పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాలి. పాదాలు ఆరోగ్యంగా కనిపించాలంటే కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముల్తానీ మట్టిలో గులాబీనీరు కలిపి పాదాలకు పూయాలి. పావుగంట తరువాత కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగి మృదువుగా ఉంటాయి. ఎత్తు మడమల చెప్పులు వాడకూడదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే మంచిది.

పాదాల మీద మురికి సులువుగా పోవాలంటే గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మసాజ్ చేయాలి. అనంతరం గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి కడిగితే మురికి మొత్తం తొలగిపోతుంది. రాత్రి పడుకొనే ముందు వ్యాజిలెన్‌ లేదా ఇతర చర్మక్రిములు పూసి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తం సరఫరా అయ్యి పగుళ్లు తగ్గుతాయి. గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.

బకెట్‌లో రెండు చెంబుల గోరువెచ్చని నీరుపోసి రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌, ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అందులో పాదాలను ఉంచాలి. నీళ్ల వెచ్చదనం తగ్గాక పాదాలను బయటకు తీసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలాగే ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచ వంటసోడా వేసి ఒక అరగంట పాటు కాళ్ళు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి.

ప్రతిరోజూ స్నానం చేసేసమయంలో ప్యూమిన్ రాయితో పాదాలను రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ తో పాదాల శుభ్రతకు బాగా పనిచేస్తాయి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. అదేసమయంలో మడమలు, పాదాల వేళ్ల మధ్య సందుల్లో ఇలా అన్నిచోట్ల మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల నిర్జీవ కణాలు తొలిగిపోతాయి. పెరుగు, వెనిగర్‌ కలిపి మసాజ్‌ చేస్తే ఫలితం ఉంటుంది. పాదాలు కూడా మెత్తగా మారుతాయి.

ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది. చర్మం, పాదాలు హెల్తీగా కాంతివంతంగా ఉంటాయి. పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరినూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరగటంతోపాటు పాదాలు మెత్తగా ఉంటాయి.