Malnutrition In Children : చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించటం ఎలా?

పిల్లల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే బ‌ల‌వ‌ర్ధ‌క స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌టం ఒక్క‌టే మార్గంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారాన్ని బట్టి పిల్లల మానసిక, భౌతిక వికాసం ఉంటుంది.

Malnutrition In Children

Malnutrition In Children : పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగటానికి పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరం పోషకాహార లోపం ఏర్పడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పోషకాహారంలో సమపాళ్లలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్‌, మినరల్స్‌ ఉండేలా చూడటం వల్ల చిన్నారుల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడతాయి. సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శారీరక పెరుగుదల, చురుకుదనం మందగించే పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందకపోవడమే ఇందుకు కారణమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల పౌష్టికాహారాన్ని అందించే విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇలా ఇవ్వటంవల్ల పిల్లల్లో పోషకాహార లోపం, శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు నివారించబడి శిశు మరణాలు అధికశాతం తగ్గించవచ్చు. గర్భిణిలు, బాలింతల ఆహారంలో నిత్యం ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, మాంసకృతులు ఉండే విధంగా చూసుకోవాలి. దీని వల్ల శిశువులకు పౌష్టికాహారం అందుతుంది.

పిల్లల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే బ‌ల‌వ‌ర్ధ‌క స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌టం ఒక్క‌టే మార్గంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారాన్ని బట్టి పిల్లల మానసిక, భౌతిక వికాసం ఉంటుంది. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారం ప్రధాన పాత్రపోషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆహార‌పు అల‌వాట్లు, జీవనశైలి స‌క్ర‌మంగా లేకుంటే రక్తహీనత లాంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి పిల్లల ఎదుగుదలకు అన్ని పోష‌క విలువ‌లు గ‌ల ఆహారం అంటే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విట‌మిన్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు,జింక్‌, కాల్షియం, పొటాషియం, సిలీనియం, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోష‌క ప‌దార్థాలు అధికంగా ఉండే ఆహార ప‌దార్థాలు ప్ర‌తి రోజూ తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.