Abdomen Fat : పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంటే!

పొట్ట చుట్టు కొవ్వులు చేరుతున్న విషయం గమనించిన వెంటనే మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Abdomen Fat

Abdomen Fat : ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా పొట్ట దగ్గర కొవ్వు మాత్రం చాలా మందిలో పెరుగుతుంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరగటాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. దీని వల్ల టైప్ 2 మధుమేహంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పుల కారణంగానే కొవ్వు పెరుగుతుందేమోనన్న విషయాన్ని ఆలోచించాలి. ముఖ్యంగా మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వులు అధికంగా చేరుతుంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాయామాలు లేకపోవటం, ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

పొట్ట చుట్టు కొవ్వులు చేరుతున్న విషయం గమనించిన వెంటనే మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెయ్యిూ , పీనట్ బటర్ వంటివి మితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. మెగ్నీషియం తక్కువగా ఉండే వారిలో ఇన్సులిన్ స్ధాయిలు పడిపోతాయి. గింజలు, చేపలు, బీన్స్, పెరుగు, అరటిపండ్లు, ఎండు ఫలాలు, చాక్లెట్లులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వాటిని తీసుకోవటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు.

తీసుకునే ఆహారంతోపాటు వ్యాయామాలపై దృష్టిపెట్టాలి. పొట్ట చుట్టూ కొవ్వులు కరిగేందుకు కొన్ని రకాల వ్యాయామాలు నిపుణుల సలహాతో చేయటం మంచిది. రోజూ ఏరోబిక్స్‌ సాధన చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వుల్ని సులభంగా కరిగించచ్చని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కొవ్వు పేరుకుపోయేందుకు మానసిక సమస్యలు కారణమౌతాయి. ఇందుకుగాను వ్యాయామం, యోగా, ధ్యానం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. నిద్రలేమి బరువు పెరగడానికి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో ఏడెనిమిది గంటలు నిద్ర పోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.