Sugarcane (1)
Sugar Cane Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకునేదుకు వివిధ రకాల పానీయాలను సేవిస్తుంటారు. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు పానీయాలు ఎంతో దోహదపడతాయి. అయితే వేసవి నుండి రక్షణ కోసం ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే వడ దెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. డీహైడ్రేషన్ సమస్యా ఉత్పన్నంకాదు. చెరుకు రసంలో చాలా మినరల్స్ ఉంటాయి. ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే సుమారు 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఎండ వల్ల నీరసం వచ్చినా ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే తక్షణం శక్తి వస్తుంది. చెరుకు రసం శరీరంలో నీటి స్దాయిని పెంచి ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వేసవిలో ఎక్కువగా దొరికే అద్భుతమైన పానీయంగా చెప్పవచ్చు.
చెరుకురసం శరీరంలో ఉన్న ప్రొటీన్స్ ను సమతూల్యం చేస్తుంది. అనేక మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. పచ్చకామెర్ల వ్యాధికి చెరుకురసం అద్భుతమైన ఔషధం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జలుబు, తుమ్ములతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాసు చెరుకురసంతో ఉపశమనం పొందుతారు. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి చెరుకురసం ఎంతో సహాయపడుతుంది. 40 ఏళ్లు దాటిన స్త్రీలకు శరీరంలో క్యాల్షియం స్దాయిలు తగ్గుతాయి. అలాంటప్పుడు చెరుకురసం తాగితే క్యాల్షియం స్దాయి పెరుగుతుంది. విపరీతమైన ఆకలి, నీరసంతో ఇబ్బందిపడుతుంటే అలాంటప్పుడు చెరుకురసం రోజుకు మూడు లేక నాలుగు గ్లాసులు తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం కూడా కలుపుతారు. దీని వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడ దరిచేరవు. స్వీట్లు ఎక్కువగా తినే వారికి దంత సమస్యలు ఎక్కువగా ఉండి నోటి దర్వాసనతో బాధపడతారు. అలాంటప్పుడు ప్రతిరోజూ చెరుకురసం తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు. శరీరంలో జరిగే జీవ క్రియలను సరైన క్రమంలో ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చెరుకు రసం మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేషన్ లో ఉంచుతుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. చెరుకు రసాన్ని రెండు చెంచాలు తీసుకుని ముఖానికి మృదువుగా రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మానికి అదనపు మెరుపు వస్తుంది.