Sleep Deprivation : నిద్ర లేమి సమస్యలు…ఆయుర్వేద పరిష్కారాలు

కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేందుకు మంచి ఉపాయాల్లో ఒకటి.

Sleeping

Sleep Deprivation : నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడటం ప్రస్తుత కాలంలో కామనై పోయింది. నిద్రిస్తుండగా మధ్యలో ఒక్కసారిగా మెలుకువ రావటం జరుగుతుంది. ఇలా నిద్ర పోతున్న సమయంలో ఒక్కసారిగా మెలుకువ రావటం వంటి సందర్భంలో రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫరాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. నిద్ర మధ్యలో మెలకువ రావటం కారణంగా ముఖ్యంగా వయో వృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన్న సందర్భాలు ఉంటాయి.

నిద్రాభంగం కారణంగా ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ మరింత దెబ్బతినడాన్ని పలు పరిశోధనల్లో గుర్తించారు. ఈ నిద్రాభంగానికి కారణాలు ఏంటన్న విషయంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర మాత్రలు వేసుకోవటం సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాదు. నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు.

జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబధ్ధకం, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహారాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి. వాతం వికటించటం వలన మానసిక లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీరంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రపట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది. గుండె దడ, భయంగా ఉండటంలాంటి సమస్యలు ఉత్పన్నమై నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే, ఇంక నిద్రపట్టదు.ఇందుకు చికిత్స ఆయా పరిస్ధితులను భట్టీ ఉంటుంది.

నిద్రలో తేడా వస్తోందంటే తేలికగా అరిగే ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఊరగాయ పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదార్థాలు, నూనె పదార్థాలను మానటం వలన కొంతమేర ఉపశమనం లభిస్తుంది. శరీరానికి తగిన వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు నడవటం, రాత్రి ఆహారాన్ని త్వరగా ముగించుకోవటం 9గంటలకల్లా నిద్రకు ఉపక్రమించటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కొంత ప్రయోజనం కనిపిస్తుంది.

కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేందుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా పుస్తకాలు చదవటం ద్వారా నిద్రలోకి జారుకోవచ్చు. రాత్రిపూట గోరుచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని ఔషదాలను సూచిస్తున్నాయి. వాటికి సంబంధించి సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గుతుంది. ప్రాణాయామం నిద్ర పట్టేలా చేస్తుంది. జాజికాయ, జాపత్రి, మరాటీ మొగ్గలను 10 గ్రాముల చొప్పున తీసుకుని, అందులో 5 గ్రాముల పచ్చ కర్పూరం ఈ నాల్గింటినీ మెత్తగా నూరి ఒక సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదేశ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు రెండూ వాడుతూ ఉంటే నిద్రభంగం నుండి విముక్తి పొందవచ్చు. ఇవన్నీ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు.