Ears Sounds : చెవుల్లో రింగుమనే శబ్ధాలు…ఎందుకో తెలుసా?

ముఖ్యంగా ఈ టిన్నిటస్ వయో వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో సైతం ఈ పరిస్ధితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది.

Ear Sounds

Ears Sounds : చెవుల్లో రింగుమనే శబ్ధాలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. దీనినే వైద్య పరిభాషలో టిన్నిటస్ అని పిలుస్తారు. బయట నుండి ఎలాంటి శబ్ధాలు లేకుండానే చెవిలోపల రింగు,రింగు మనే శబ్ధం వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక చెవిలో ఇలాంటి శబ్ధాలు వినిపిస్తుండగా మరికొందరిలో రెండు చెవుల్లో ఈ శబ్ధాలు వస్తుంటాయి. కొన్ని సార్లు ఈ శబ్ధాలు చాలా పెద్దవిగా, చిన్నవిగా కూడా ఉంటాయి. టిన్నిటస్ అనేది ఒక వ్యాధి కాదని వ్యాధులు చెబుతున్నారు.

చెవుల్లో రింగు రింగు మనే శబ్ధాలే కాకుండా మరికొందరిలో పెద్ద ధ్వని, పాము బుసలు కొడుతున్నసౌండ్, ఈల వేస్తున్నట్లు శబ్ధాలు, అస్పష్టమైన శబ్ధాలు వినిపించటం వంటివి చోటు చేసుకుంటాయి. సాధారణంగా ఇలాంటి శబ్ధాలు కొన్ని నిమిషాలపాటు ఉంటాయి. అయితే మరికొందరిలో మాత్రం దీర్ఘాకాలంపాటు ఇలాంటి శబ్ధాలు వినిపిస్తూనే ఉంటాయి. చెవిలో శబ్దాలకు వినికిడి లోపానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయంటే అప్పటికే వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. పగలంతా బయటి శబ్దాల వల్ల చెవి లోపలి శబ్దాలను చాలా మంది గమనించలేరు.

ముఖ్యంగా ఈ టిన్నిటస్ వయో వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో సైతం ఈ పరిస్ధితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. గులిమి పేరుకుపోవటం, సైనస్ ఇన్ఫెక్షన్, హార్మోన్ల మార్పులు, థైరాయిడ్, చెవికి దెబ్బతగలటం, అలసట, ద్రవాలు,మెదడు వాపు, గవద బిళ్లలు కొన్ని రకాల ఔషదాల కారణంగా ఈ టన్నిటస్ కనిపిస్తుంది. వృద్ధుల్లో ఈ పరిస్ధితి వచ్చిందంటే వినికిడి లోపానికి సంకేతంగా వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమలు, మ్యూజికల్ ట్రూప్ లలో పనిచేసే వారికి ధ్వని కారణంగా ఈ టన్నిటస్ లక్షణం కనిపిస్తుంది.

వినికిడి పరీక్షల ద్వారా వైద్యులు దీనిని నిర్ధారిస్తారు. ఇంపిడెన్స్‌ ఆడియోమెట్రీ, ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్షల ద్వారా కర్ణభేరి వెలుపల, వెనక మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్‌, సమస్యలను గుర్తించవచ్చు. బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవోక్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రీ అనే పరీక్ష ద్వారా మాట్లాడలేని వయస్సున్న పిల్లలకు వినికిడి శక్తి ఎంత శాతం ఉందో కనిపెట్టవచ్చు. ఓటో ఎకోస్టిక్‌ ఎమిషన్ పరీక్ష ద్వారా పుట్టిన వెంటనే పిల్లలు వినికిడి శక్తితో పుట్టారో తెలుసుకోవచ్చు. చెవిలోపల ఉన్న పరిస్ధితిని పరిశీలించిన తరువాత అందుకు తగ్గట్టుగా వైద్యులు చికిత్సను అందిస్తారు.