Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు!..
విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు.
- Guntupalli Ramakrishna
- Published On : October 29, 2021 / 03:24 PM IST
B12
Vitamin Deficiency : మనిషి శరీరంలో అవసరమైన వివిధ విటమిన్లలో ముఖ్యమైంది విటమిన్ బి 12. కోబాలమిన్గా కూడా దీన్ని పిలుస్తారు. మనిషి నాడీ వ్యవస్థ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత, అలసట, తిమ్మిర్ల నివారణకు విటమిన్ బి12 ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర పెరుగుదలకు, రక్త కణాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు, డీఎస్‌ఏ ఉత్పత్తికి ప్రధాన పోషకం. అలాగేశరీరంలోని వివిధ భాగాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. సీ ఫుడ్ , గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 15% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ బి 12 లోపంపై అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఊపిరితిత్తుల సమస్యలైన శ్వాస సరిగ్గా ఆడకపోవడం, మానసిక సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తాయి. విటమిన్ బి12 లోపం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మిమిక్ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది. ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు. బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి12 బాధ్యత వహిస్తుంది. గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చేతులు, కాళ్ల వేళ్ల చివర్లు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి.
మాంసంలో విటమిన్ బి 12 సమృద్ధిగా ఉంటుంది. మాంసాన్ని ఎంచుకునేటప్పుడు తక్కువ కొవ్వుశాతం ఉండేది ఎంచుకోవడం మంచిది. గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తుల్లో బి విటమిన్లు, ముఖ్యంగా బి 2, బి 12 లు సమృద్ధిగా లభిస్తాయి. గుడ్డు సొనలో బి 12 అధికంగా ఉంటుంది. అందుకే కేవలం ఎగ్ వైట్‌నే కాకుండా మొత్తం గుడ్డును ఆహారంగా తీసుకోవాలి. ట్రౌట్ చేపలో అయితే విటమిన్ బి 12 చాలా ఎక్కువగా ఉంటుంది. విలువైన పోషకాలతో నిండి ఉండే రెయిన్ బో ట్రౌట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చేప ద్వారా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు శరీరానికి అందుతాయి. తృణధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి 12 స్థాయి పెరుగుతుంది.
