Constipation : మలబద్ధకాన్ని నివారించే యోగాసనాలు ఇవే!
నీరు ఎక్కువగా తీసుకోకపోవటం, బలహీనమైన కండరాలు, ఆహారంలో ఫైబర్ తీసుకోకపోవటం వంటివి సైతం మలబద్దకానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకాన్ని నివారించేందుకు రోజు వారిగా కొన్ని యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి.
- Guntupalli Ramakrishna
- Published On : July 29, 2022 / 03:18 PM IST
Constipation
Constipation : మలబద్ధకం అనేది సాధారణ సమస్య. ప్రేగు కదలికలు కష్టంగా మారిన సందర్భాన్నే మలబద్ధకంగా చెప్పవచ్చు. తీసుకున్న ఆహారం, జీవనశైలి క్రమం తప్పి ఆహారం తీసుకోవటం ఇలాంటివన్నీమలబద్ధకంతలెత్తడానికి కారణమౌతాయి. నీరు ఎక్కువగా తీసుకోకపోవటం, బలహీనమైన కండరాలు, ఆహారంలో ఫైబర్ తీసుకోకపోవటం వంటివి సైతం మలబద్దకానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకాన్ని నివారించేందుకు రోజు వారిగా కొన్ని యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
బాలాసనం: మోకాళ్ల మీద కూర్చుని, ముందుకు వంగాలి. పొత్తికడుపు తొడలకు తగిలేలా, తల నేల మీద ఆనేలా ముందుకు వంగాలి. రెండు చేతులను తల మీదుగా చాపి, నేలను తాకించాలి. ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి. ఇలా చేయటం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.
మాలాసనం: కాళ్ల మధ్య ఎడం ఉండేలా నిలబడాలి. మోకాళ్లు వంచి, నేల మీద స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవాలి. చేతులు రెండు జోడించి, మోచేతులు మోకాళ్లకు ఆనేలా శరీరం దగ్గరకు చేతులను తీసుకురావాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచి, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.
పవనముక్తాసనం: విశ్రాంత స్థితిలో వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను మడిచి, పొత్తికడుపు దగ్గరకు తీసుకురావాలి. రెండు చేతులతో మోకాళ్లను బిగించి, దగ్గరకు లాక్కోవాలి. తలను పైకెత్తి, గడ్డం ఛాతీకి ఆనించాలి. ఈ భంగిమలో 5 సెకన్లు పాటు ఉండి, తిరిగి యథాస్థితిలోకి రావాలి. ఇలా చేయటం వల్ల విరోచనం సాఫీ అవుతుంది. మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.
