Teath Problems
Dental Problems : చాలా మంది ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు కాని నోటిలోని పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయోలేదో గమనించరు. నోటిలో పళ్లు పచ్చగా ఉంటే మీ ముఖానికి ఎంత అందమున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఎదుటివారి దృష్టి మొత్తం మీ పళ్లపైనే ఉంటుంది. అందుకే పళ్లను తెల్లగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుకోవడం పైనే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలామందికి చిగుళ్లలో వాపు, నొప్పి వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడే కాస్త శ్రద్ధ వహిస్తే సమస్య పెద్దదిగా కాకుండా కాపాడుకోవడంతో పాటు సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. దీనికోసం రెగ్యులర్ గా డెంటల్ చెకప్స్ చేయించుకోవడంతో పాటు రోజూ కొన్ని రకాల సహజ పద్ధతులు పాటించడం కూడా అవసరం. దీనివల్ల మీ చిగుళ్లు, పళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో రోజూ రెండు సార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ వంటివి చేయడంతో పాటు కొన్ని రకాల పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుంది అవేంటంటే..
నోటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆయుర్వేదంతో పాటు ఎన్నో గ్రంథాల్లో వివరించిన పద్ధతి ఇది. ఇందుకోసం మూమూలు నూనె కంటే గానుగ పట్టించిన నూనెను ఉపయోగిస్తే మంచిది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా వాడొచ్చు. కొబ్బరి, నువ్వులు లేదా ఆలివ్ నూనెలను వాడవచ్చు. రోజూ ఉదయాన్నే ఒకటి లేదా రెండు టీస్పూన్ల నూనెను నోట్లో వేసుకొని పదిహేను నిమిషాల పాటు పళ్ల మధ్య నుంచి వెనక్కి, ముందుకి అంటూ ఆయిల్ పుల్లింగ్ చేస్తుండాలి. ఆ తర్వాత నూనెను వూసేయాలి. ఆపై బ్రష్ చేసుకోవాలి. రోజూ బ్రషింగ్ కంటే ముందే ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పాచి పట్టడం, జింజివైటిస్ వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. నోటిలో ఉన్న టాక్సిన్లన్నీ బయటకు పోతాయి.
వెచ్చని ఉప్పు నీటితో నోరు శుభ్రం చేయడం ద్వారా, దంత కుహరాలలో లేదా దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడమే కాకుండా, వైద్యాన్ని సులభతరం చేస్తుంది. ఉప్పునీటి చిట్కా గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్ధం. వెల్లుల్లి, అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.తాజా వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి, ఆపై కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో రాయాలి. కొద్దిసేపటికే మీరు కొంత ఉపశమనం లభిస్తుంది.
లవంగాల మాదిరిగానే, పుదీనాకు కూడా పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్, ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, కాస్త చల్లబడిన తరువాత, వాటితో పుక్కిలించొచ్చు. లేదా టీ లా తాగేసేయొచ్చు. తడి టీ-బ్యాగ్ ను కూడా నొప్పి తగ్గే వరకూ నొప్పి ఉన్న భాగంలో అదిమిపట్టుకుంటే కొద్ది సేపటికే నొప్పి క్రమేపి తగ్గుతుంది.
కలబంద గుజ్జు కాలిన గాయాలు , చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది. కొంతమంది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ జెల్‌ని ఉపయోగిస్తారు. కలబందలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, దంత క్షయం కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కలబంద జెల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయటం ద్వారా కొంత ఉపసమనం పొందవచ్చు.
లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలు మరియు చిగుళ్ళ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి. లవంగాల నూనెలో ఒక చిన్న కాటన్- బాల్ ని నానబెట్టి, ప్రభావితమైన దంతాల భాగంలో ఉంచడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, తర్బూజా, కివీ, మామిడి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, దబ్బపండు, ఎర్ర క్యాప్సికమ్, బ్రొకొలీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్ వంటివి చిగుళ్లు, పళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. వీటి వల్ల పెరియోడాంటల్ పళ్ల సమస్యలైన చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు, రక్తం కారడం వంటివి తగ్గుతాయి.
ఆయుర్వేద సూచించిన విధంగా పళ్లు, చిగుళ్ళ సమస్యలకు వేపలోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇనఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. పళ్లకు ఉపయోగిస్తే చిగుళ్ల వాపు, రక్తం కారడం, పళ్లపై పేరుకున్న పాచి వంటివి తగ్గించి జింజివైటిస్ రాకుండా చేస్తుంది. ఎనామిల్ ని రక్షిస్తుంది. అందుకే వేప ఉన్న టూత్ పేస్ట్ కానీ వేప పుల్లతో పళ్లు తోముకోవడం కానీ చేయాలి. దీంతో పాటు మీ టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ కూడా ఉండేలా చూసుకోవాలి.