Agadha Review : ‘అగధ’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ మాములుగా లేదుగా..

Agadha Movie Review: టీజర్, ట్రైలర్స్ తో మెప్పించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

  • Updated on- August 14, 2026 / 12:41 AM IST

Agadha Review

Agadha Review : కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అగధ సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

మహిమ(ఉల్కా గుప్తా) ఓ నరబలిలో ఒక చిన్న పాపని రక్షించి కొంతమంది నుంచి తప్పించుకొని వెళ్లడంతో కథ మొదలవుతుంది. ఆమె ముందే తన ఫ్రెండ్ బబ్లూ(వైవా రాఘవ) తల నరికేస్తారు. అది జరిగిన కొన్నాళ్ళకు ప్రగ్నెంట్ గా ఉన్న మహిమ ఉరి వేసుకొని చనిపోతుంది. ఓ గ్రామంలో దుష్ట శక్తులను, ఆత్మలను తరిమేసే మహాదేవి(కామాక్షి భాస్కర్ల)కి తన చెల్లి మహిమ చనిపోయిందని తెలుస్తుంది.

మహాదేవి అక్కడికి వెళ్ళాక తన కుటుంబాన్ని కొన్ని దుష్ట శక్తులు ఆవహించాయని, తన మరో చెల్లి హరిణి(జోవిక)ని కూడా ఆత్మలు ఆవహించాయని తెలుస్తుంది. మహిమ ఆత్మ ఇంకా భూమిని వదిలి వెళ్ళకపోవడంతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మహాదేవి. ఈ క్రమంలో మహిమ బాయ్ ఫ్రెండ్ సింహ(శ్రవణ్ రెడ్డి) ఆత్మని రప్పించి మహిమ, సింహ, బబ్లూ ఓ నిషేధిత ప్రాంతానికి వెళ్లినట్టు, అక్కడ ఓ నరబలిని అడ్డుకున్నట్టు, అగధ అనే శక్తి వీళ్లపై పగబట్టినట్టు తెలుస్తుంది. కానీ సింహలో కూడా వేరే ఆత్మలు ఉన్నాయని తెలుస్తుంది. మహాదేవి అగధ గురించి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు విఫలమవడంతో అసలు అగధ ఎవరు? మహిమ, సింహ ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? మహిమ ఆత్మ భూమిని వదిలి వెళ్లిపోతుందా? తన కుటుంబాన్ని మహాదేవి కాపాడుకుంటుందా? అగధని మహాదేవి ఎదుర్కుంటుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also See : Poojitha Reddy : బోన‌మెత్తిన ఇంటింటి గృహలక్ష్మి సీరియ‌ల్ న‌టి.. ఫ్యామిలీతో పండ‌గ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు

సినిమా విశ్లేషణ..

ఒకప్పుడు నిర్మాతగా ఎన్నో హిట్స్ ఇచ్చి దర్శకుడిగా మారిన MS రాజు, ఆల్రెడీ పొలిమేర లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన కామాక్షి కాంబినేషన్ లో క్షుద్రపూజలు నేపథ్యంలో సినిమా వస్తుండటం, టీజర్, ట్రైలర్స్ తో మెప్పించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా మహిమ ఎక్కడికో వెళ్లడం, మహాదేవి పాత్ర పరిచయం, మహిమ చనిపోవడం, మహాదేవి మహిమ ఇంటికి రావడం, అక్కడ జరిగే సంఘటనలతో కాస్త నిదానంగా సాగినా ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ నెలకొంటుంది. కాస్త భయం కూడా వేస్తుంది. ఇంటర్వెల్ కి అసలు ఈ అగధ ఎవరు? మహాదేవికి ఎవరు అపడుతున్నారు అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పుతారు.

సెకండ్ హాఫ్ మహిమ, సింహ ఫ్లాష్ బ్యాక్, మహాదేవి అగధ ఎవరో తెలుసుకోవడం, అగధని అడ్డుకునే ప్రయత్నాలతో, తన కుటుంబానికి ఎదురయ్యే ఆపదలు, వాటి నుంచి కాపాడుకోవడం.. ఇలా ఆసక్తిగానే సాగుతుంది. క్లైమాక్స్ టైం లూప్, ఓ చిన్న మల్టీవర్స్.. తో కొత్తగానే ప్లాన్ చేసుకున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్, భయపెట్టే అంశాలు మాత్రం బాగానే ఉన్నాయి. కాస్త సాగదీసినా, స్లో నేరేషన్ ఉన్నా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది.

అయితే అగధని పూజించేవాళ్ళు, అక్కడ నరబలి చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ కథేంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక మహాదేవి దగ్గరకు ఆమె కథ తెలుసుకుందామని వచ్చిన మానస, సంజయ్ అనే ఇద్దరు కూడా ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎవరు అనేది క్లారిటీ ఇవ్వలేదు. క్లైమాక్స్ కొత్త పాయింట్ తీసుకున్నా సింపుల్ గా ముగించేసినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కోసం కొన్ని సీన్స్ ఎక్కువ రిపీట్ చేసారు. కాకులు సీన్స్ మరీ ఎక్కువగా చూపించారు. సింహ పాత్ర నగ్నంగా ఓ సీన్ చేసారు కానీ అది ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు. ఇలా కొన్ని క్లారిటీలు ఇవ్వకుండా కొన్ని ప్రశ్నలతోనే అగధని ముగించారు. పార్ట్ 2 అధికారికంగా ప్రకటించకపోయినా లీడ్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రశ్నలకు సెకండ్ పార్ట్ లో సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి. ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండొచ్చు అని దర్శకుడు MS రాజు ప్రమోషన్స్ లో తెలిపారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఇలాంటి పాత్రలు కామాక్షి భాస్కర్లకు కొట్టిన పిండి. ఈ సినిమా అంతా తన భుజాలపైనే నడిపించింది. సీరియస్ పాత్రలో కామాక్షి భాస్కర్ల తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఉల్కా గుప్తా మహిమ పాత్రలో చాలా బాగా నటించింది. శ్రవణ్ రెడ్డి రెండు మూడు వేరియేషన్స్ తో, నెగిటివ్ షేడ్స్ లో కూడా చాలా బాగా నటించాడు. జోవిక విజయ్ కుమార్ మొదటి సినిమా అయినా ఆత్మ ఆవహించిన ఓ సైకో లాంటి పాత్రలో చాలా బాగా నటించింది. సీనియర్ నటులు సిజు, భాను చందర్ మెప్పిస్తారు. వనిత విజయ్ కుమార్, రోషన్ బషీర్, ఆర్నా మూలే, కనకవ్వ, వైవా రాఘవ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also See : Irumudi pre release event : ర‌వితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. చాలా సీన్స్ ని మ్యూజిక్ తో ఎలివేట్ చేసారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త బెటర్ గా వర్క్ చేయాల్సింది. కొన్ని సెట్స్ చూస్తుంటే రియాల్టీగా కనిపించకుండా అవి సెట్స్ అని చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి. గ్రాఫిక్స్ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎడిటింగ్ విషయానికొస్తే ల్యాగ్ సీన్స్ లో షార్ప్ కట్స్ చేసి, రిపీటెడ్ సీన్స్ కొన్ని కట్ చేస్తే బాగుండేది. ఆత్మలు, ఓ దుష్ట శక్తి దాన్ని అంతం చేయడానికి దైవ శక్తి అనే రొటీన్ పాయింట్ అయినా కొత్త కథనంతో, కొత్త క్లైమాక్స్ తో రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘అగధ’ ఓ మిస్టీరియస్ డివైన్ థ్రిల్లర్ సినిమా. కాసేపు సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి, కాస్త భయపడటానికి చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.