Lenin Review : ‘లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా..?
అఖిల్ ఏ రేంజ్ హిట్ కొడతాడో, ఎన్ని కలెక్షన్స్ వస్తాయో చూడాలి. (Lenin Movie Review)
- Saketh U
- Updated on- July 10, 2026 / 01:52 PM IST
Lenin Review : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కిన సినిమా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లెనిన్ సినిమా నేడు జూలై 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
శ్రీరామపురం అనే ఊళ్ళో ద్రౌపది దేవి ఆలయం ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం భారతం మిట్ట అనే పేరుతో 18 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతర సమయంలో అక్కడ రక్తపాతం జరగకూడదు. అనాథ అయిన లెనిన్(అఖిల్) చిన్నప్పుడే ఆ ఊరికి వచ్చి జాతర విషయంలో ఓ గొడవ తీర్చడంతో ఊరి పెద్ద జయంతి(ఈశ్వరి రావు) కొడుకుగా దగ్గరికి తీసుకొని తన కొడుకు వసంత్(ప్రమోద్ పుంజు) తో పాటే పెంచుతుంది.
కొన్నేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన లెనిన్ ఓ బార్ లో కూర్చొని తన కథ అంతా ఓ పిల్లాడికి చెప్తాడు. లెనిన్ పెద్దయ్యాక తన దూరపు చుట్టం భారతి(భాగ్యశ్రీ భోర్సే)తో ప్రేమలో పడి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే భారతం మిట్టలో తన హవా సాగాలనుకుంటాడు. దీంతో లెనిన్, వసంత్ ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఆ ఎమ్మెల్యేని అవమానిస్తారు. భారతి అక్క వైదేహితో వసంత్ పెళ్లి ఫిక్స్ చేస్తారు కానీ వైదేహి పెళ్లి ముందు రోజు వేరే వాళ్ళతో లేచిపోతుంది. దాంతో భారతిని ఇచ్చి వసంత్ కి పెళ్లి చేయలని ఫిక్స్ అవుతారు. జాతరలో జాతర పెద్దగా ధర్మరాజు ప్లేస్ లో ఎప్పటికైనా తాను ఉండాలని యతిరాజు(శివాజీ) ప్రయత్నిస్తాడు. మరి లెనిన్ – వసంత్ ప్రేమకథ ఏమైంది? ఆ జాతరలో రక్తపాతం జరిగిందా? ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వైదేహి ఏమైంది? యతిరాజు జాతర పెద్ద అవుతాడా? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేసాడు.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Also Read : Lenin Twitter Review : ‘లెనిన్’ ట్విట్టర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..!
సినిమా విశ్లేషణ..
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. 2000 బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. మహాభారతం, ద్రౌపది, పాండవుల గురించి చెప్పి ఆ ఊరి కథలోకి తీసుకు వెళ్తాడు. హీరో చిన్నప్పుడు ఎంట్రీ సీన్ బాగుంటుంది. సినిమా ఓపెనింగ్ జైలు నుంచి హీరో బయటకు రావడంతో అసలు ఏం జరిగింది అని ఆసక్తి నెలకొంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ లెనిన్, భారతి ప్రేమకథతో, మధ్యలో ఎమ్మెల్యే సీన్స్ తో సాగుతుంది. ప్రేమ కథ రొటీన్ విలేజ్ లవ్ స్టోరీ. భారతి అక్క వైదేహి విషయంలో ఇచ్చే ట్విస్ట్ ఊహించలేరు. అక్కడ్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి వసంత్ ని చంపడానికి కొంతమంది ప్లాన్ చేస్తారు. దీంతో ఎవరు ప్లాన్ చేసారు? లెనిన్ – భారతి పెళ్లి జరుగుతుందా అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇంటర్వెల్ కి ఇచ్చే ట్విస్ట్ కూడా ఊహించలేము .
సెకండ్ హాఫ్ మరిన్ని ట్విస్టులతో, ఎమోషన్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అన్ని ఊహించేయొచ్చు. మెయిన్ విలన్ ఎవరో ముందే పసిగట్టేయొచ్చు. కథ, ట్విస్టులు కొత్తవేమీ కావు. ఇలాంటి కథ, ట్విస్ట్ లు చాలా సినిమాల్లో ఉన్నవే. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. కానీ కథనం మహాభారతానికి లింక్ చేస్తూ మహాభారతంలోని పాత్రలు రివర్స్ అయితే ఎలా ఉంటుంది అని ఆసక్తికర కథనంతో చెప్పారు. అక్కినేని ఫ్యాన్స్ కి అయితే పండగే. సినిమా అంతా ఒక ప్రేమకథ, హీరోయిన్ పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు అన్ని ఏం చేసారు అని ట్విస్టులతో సాగుతుంది. ఒక మాస్ కమర్షియల్ విలేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు. కమర్షియల్ గా అయితే ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిసి సెంటర్స్ కి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవ్వొచ్చు. మరి అఖిల్ ఏ రేంజ్ హిట్ కొడతాడో, ఎన్ని కలెక్షన్స్ వస్తాయో చూడాలి.
చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చేస్తే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు సో సోగా పర్వాలేదనిపించిన అఖిల్ మొదటిసారి నటించాడు అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో, క్లైమాక్స్ లో అఖిల్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే అఖిల్ అదరగొట్టేసాడు. భాగ్యశ్రీ భోర్సే కూడా చాలా బాగా నటించింది. భారతి పాత్రలో మెప్పిస్తుంది. కథ అంతా తన చుట్టే తిరుగుతుంది. శ్రీలీలని తీసేసి ఈ పాత్రకు భాగ్యశ్రీని తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది.
వసంత్ పాత్రలో కన్నడ నటుడు ప్రమోద్ పుంజు అదరగొట్టాడు. ఓ జాతర సీక్వెన్స్ లో అయితే చాలా బాగా నటించాడు. ఈ సినిమాతో ప్రమోద్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈశ్వరరావు తల్లి పాత్రలో బాగానే మెప్పించింది. శివాజీ కూడా మరోసారి తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. భాగ్యశ్రీ అక్క పాత్రలో చేసిన నటి కూడా బాగా నటించింది. రాంకీ, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, శత్రు, శరణ్య ప్రదీప్, ఎమ్మెల్యే పాత్ర చేసిన నటుడు..మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Lenin First Review : ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. ఆ ఒక్కటీ వర్కవుట్ అయితే.. అయ్యగారి ఖాతాలో సూపర్ హిట్టే..!
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ సీన్స్ లో బాగున్నా మిగిలిన చోట్ల యావరేజ్. ఒక్క పెళ్లి సాంగ్ మాత్రమే బాగుంది. మిగిలిన పాటలన్ని ఒకసారి వినడమే. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ సీన్స్, ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. కథ, ట్విస్టులు పాతవి అయినా కథనం కొత్తగా రాసుకొని మహాభారతానికి లింక్ ఇస్తూ బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడ్డారు. కొన్ని డైలాగ్స్ పవర్ ఫుల్ గా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. బస్ ఛేజింగ్, ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది.
మొత్తంగా ‘లెనిన్’ సినిమా ఓ ప్రేమకథ చుట్టూ ట్విస్టులతో సాగే సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ& రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
