Bethlehem Kudumba Unit : ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ రివ్యూ.. మలయాళంలో 200కోట్లు కొట్టిన మమిత బైజు సినిమా.. ఎలా ఉందంటే..?
Bethlehem Kudumba Unit : మలయాళంలో ఒక సినిమా బాగుంది, హిట్ అయింది అంటే మన తెలుగు వాళ్ళు ఆ సినిమాని చూసేదాకా వదిలిపెట్టరని తెలిసిందే.
Bethlehem Kudumba Unit
Bethlehem Kudumba Unit : నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా తెరకెక్కిన సినిమా బెత్లెహెమ్ కుటుంబ యూనిట్. మలయాళంలో రెండు వారాల క్రితం రిలీజయి పెద్ద హిట్ అవ్వగా నేడు సెప్టెంబర్ 4న తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. ప్రేమలు సినిమా ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భావన స్టూడియోస్, వర్కింగ్ క్లాస్ హీరో, ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్స్ పై దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే..
ఆష్లే(మమిత బైజు) వాళ్ళ సొంతూరు నుంచి కొన్ని ఆర్ధిక సమస్యలతో వేరే ఊరికి వస్తారు. జస్టిన్(నివిన్ పౌలి) పక్కింట్లో దిగుతారు ఆష్లే కుటుంబం. జస్టిన్ క్యాటరింగ్ బిజినెస్ చేసుకుంటూ చుట్టుపక్కల అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఏజ్ పెరిగినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోతాడు. జస్టిన్ తమ్ముడు జోయెల్(సంగీత్ ప్రతాప్) షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ వాటిల్లో నటించే ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆష్లేకి జస్టిన్, అతని చెల్లెల్లు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ క్లోజ్ అవుతారు. జస్టిన్ క్యారెక్టర్ తెలిసి అతన్ని ఇష్టపడటం మొదలుపెడుతుంది ఆష్లే. ఓ నన్ ద్వారా ఈ విషయం జస్టిన్ కి తెలుస్తుంది. మొదట సంకోచించినా తను కూడా ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. ఇద్దరూ మాట్లాడుకొని ప్రేమించుకోవడం మొదలుపెడతారు.
అయితే వీరిద్దరికి దాదాపు 10 ఏళ్లకు పైగా గ్యాప్ ఉంటుంది. అదే సమయంలో జోయెల్ ఫ్రెండ్ గ్లిక్సన్(రోషన్ శానవాస్) కూడా ఆష్లేని ట్రై చేస్తూ ఉంటాడు. ఆష్లే- జస్టిన్ ప్రేమించుకుంటున్న విషయం ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రేమ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఆష్లే మామయ్య అలెక్స్(వినయ్ ఫోర్ట్) ఎంట్రీ ఇస్తాడు. అలెక్స్ ఎంట్రీ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి? ఆష్లే- జస్టిన్ విషయం అందరికి తెలిసాక ఏం జరిగింది? వీళ్ళ ప్రేమ ఫలించిందా? జస్టిన్ తమ్ముడు ప్రేమ ఫలించిందా? అసలు ఇన్నాళ్లు జస్టిన్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Sahaa Review : ‘సహా’ మూవీ రివ్యూ.. చిన్నప్పట్నుంచి ఒకే అమ్మాయిని ప్రేమించి..
సినిమా విశ్లేషణ..
మమిత బైజు ఇటీవల వరుస హిట్స్ కొడుతుంది. ప్రేమలు సినిమాతో తెలుగు వాళ్లకు క్రష్ అయిన మమిత తెలుగులో విశ్వనాధ్ & సన్స్ తర్వాత మలయాళంలో బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టింది అనడంతో ఇక్కడ కూడా ఆ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో ఒక సినిమా బాగుంది, హిట్ అయింది అంటే మన తెలుగు వాళ్ళు ఆ సినిమాని చూసేదాకా వదిలిపెట్టరని తెలిసిందే. అందుకే ఈ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమాపై ఇక్కడ కూడా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ప్రేమలు సినిమా తీసిన దర్శకుడే ఈ సినిమా కూడా తీయడం, ప్రేమమ్ సినిమా హీరో అవ్వడం, చాలా మంది ప్రేమలు సినిమా నటీనటులు నటించడంతో తెలుగు వాళ్ళు ఈ సినిమా కోసం బాగానే ఎదురుచూసారు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం మైత్రి మూవీ మేకర్స్ ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ చేసింది ఈ సినిమాని. ప్రీమియర్స్ షోస్ కే మంచి బుకింగ్స్ అయ్యాయి.
ఆష్లే, జస్టిన్ పాత్రలను పరిచయం చేసి ఆష్లే ఫ్యామిలీ జస్టిన్ ఇంటి పక్క ఇంట్లోకి రావడంతో కథ మొదలవుతుంది. ఆష్లే చుట్టు పక్కల వాళ్ళతో కలిసిపోవడం, గ్లిక్సన్ ఆష్లే వెంట పడటం, ఆష్లే జస్టిన్ ని ఇష్టపడటంతో సింపుల్ గా సాగుతుంది. ఓ నన్ ఎంట్రీ ఇచ్చి ఆష్లేని అడగడం, ఆ విషయం జస్టిన్ కి చెప్పడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇక అప్పట్నుంచి వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే సరదా, క్యూట్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ కి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ వీళ్ళ ప్రేమ సన్నివేశాలు, అలెక్స్ ఎంట్రీ, వీళ్లంతా గోవా ట్రిప్ కి వెళ్లడం, వీళ్ళ ప్రేమ విషయం అందరికి తెలిసి ఏం జరిగింది అని నడిపించారు. సెకండ్ హాఫ్ సగం నుంచి కథ ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ ఊహించేయొచ్చు.
కామెడీ సన్నివేశాలు అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. వాటికి తెలుగు డబ్బింగ్ బాగా ప్లస్ అయింది. లవ్ సన్నివేశాలు క్యూట్ గా మెప్పిస్తాయి. మధ్య మధ్యలో జస్టిన్ తమ్ముడు జోయెల్ షార్ట్ ఫిలిం హంగామాతో, జోయెల్ ప్రేమ, గొడవలు.. సీన్స్ బాగానే పండాయి. జస్టిన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం బాగానే ఉంది. ఇంట్లో తెలిసాక ఏం జరుగుతుంది అనేది చాలా సినిమాల్లో ఉన్న సన్నివేశాలే. ఈ కథ, కథనం కొత్తదేమీ కాదు కానీ సన్నివేశాలతో మ్యాజిక్ చేసారు. పదేళ్లు గ్యాప్ ఉన్న అబ్బాయితో అమ్మాయి ప్రేమ అనే సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఇది కూడా అలాంటింది. మమిత బైజు ఇటీవల చేసిన విశ్వనాధ్ & సన్స్ సినిమాలో కూడా ఇదే పాయింట్ ఉంది. అసలు ఆష్లే ఎందుకు ఊరు వదిలి పెట్టి వచ్చింది అనేది ఒకటి రెండు డైలాగ్స్ లో చెప్పారు కానీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కథ, కథనం కాకపోయినా క్యూట్, కామెడీ సీన్స్ తో ప్రేక్షకులని మ్యాజిక్ చేయడం, ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులని మెప్పించడం వల్లే ఈ సినిమా హిట్ అయింది. దానికి తోడు ప్రేమలు నటీనటులు, దర్శకుడు, అదే ఫ్లేవర్ లో ఉండటం కలిసొచ్చింది. ఇక సినిమా మలయాళం సినిమానే అని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఓ పదేళ్ల క్రితం ప్రేమమ్ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా కనెక్ట్ అయిన నవీన్ పౌలీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెప్పించాడు. 30 ఏళ్ళు దాటి పెళ్లి చేసుకోని అబ్బాయి తనకన్నా పదేళ్లు చిన్న అమ్మాయితో ప్రేమలో పడే సీన్స్, తనని కూడా ప్రేమించే అమ్మాయి ఉందని తెలిసి సిగ్గు పడే సీన్స్ లో బాగా నటించాడు. ఇక మమిత బైజు మరోసారి తన పర్ఫార్మెన్స్ తో క్యూట్ గా, ఎమోషనల్ గా మెప్పించింది. సంగీత్ ప్రతాప్ మరోసారి తన కామెడీతో నవ్వించాడు. వినయ్ ఫోర్ట్ కూడా అక్కడక్కడా నవ్విస్తాడు. ప్రేమలు సినిమాలో నటీనటులు కొంతమంది వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. మిగతా మలయాళ నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Romanchakam Review : ‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కేరళ సినిమాలు అంటే లొకేషన్స్ అందంగా ఉంటాయని తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ బాగానే పేలినా కొన్ని చోట్ల మలయాళం పాటలు, పదాలు ఉంచారు. కొన్ని షార్ట్ ఫిలిం ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. ప్రేమలు దర్శకుడు మరోసారి లవ్ స్టోరీతోనే తన స్ట్రాంగ్ జోనర్ లో బాగానే రాసుకొని తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ పదేళ్లు వ్యత్యాసం ఉన్న ఓ అబ్బాయి – అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
