Romanchakam Review : ‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే..?
Romanchakam Movie Review : సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు అని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Romanchakam Review
Romanchakam Review : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన సినిమా రోమాంచకం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
అన్వేష్(సుమంత్ ప్రభాస్) రోమాంచకం అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. దాని కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఇంకో డేటింగ్ యాప్ లో చెన్నై అమ్మాయి మైథిలి(అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఇద్దరూ ఫోన్స్ లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయి బాగా దగ్గరవుతారు. మైథిలి పుట్టిన రోజు నాడు మొదటిసారి కలవాలని సర్ప్రైజ్ అని చెప్పి చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఒక హోటల్ దగ్గర ఉన్నానని చెప్పి రమ్మంటాడు. కానీ మైథిలి బ్లాక్ చేస్తుంది. దాంతో మైథిలి జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్ తో గొడవలతో బాధపడుతుంటే సడెన్ గా ఓ రోజు మైథిలి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను నీతో ఓ రెండు రోజులు ఉంటాను అని చెప్తుంది.
మైథిలిని అన్వేష్ తన ఫ్రెండ్ మామ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. కానీ అన్వేష్ బయటకు వెళ్లొచ్చేసరికి మైథిలి ఫ్లాట్ లో కనపడదు. దీంతో అన్వేష్ కంగారుపడతాడు. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్ వచ్చింది? మైథిలి ఏమైంది? మైథిలి కనపడకపోవడంతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు మైథిలి – అన్వేష్ ప్రేమించుకున్నారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also See : Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్..
సినిమా విశ్లేషణ..
సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు అని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఇదొక క్యూట్ లవ్ స్టోరీలా ఉండబోతుంది అని అర్థమైంది. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, ప్రభాస్ ని తీసుకొచ్చి ప్రమోషన్స్ భారీగానే చేసారు.
ఫస్ట్ హాఫ్ ఆరంభంలో హీరో పాత్ర, అతని స్టార్టప్ గురించి ఫ్రెండ్స్ తో సీన్స్ కాస్త సాగదీసినా అమ్మాయి, అబ్బాయి డేటింగ్ యాప్ లో పరిచయం అవ్వడంతో అసలు కథ మొదలుఅవుతుంది. వీరిద్దరి మధ్య ఫోన్ కాల్స్ లోనే క్యూట్ సీన్స్ ని చూపించారు. చెన్నై వెళ్ళాక అమ్మాయి బ్లాక్ చేయడంతో ఏమవుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఆ తర్వాత కొన్ని ఫ్రెండ్స్ సీన్స్, పార్టీ, సాంగ్ తో బాగా సాగదీశారు. మళ్ళీ అమ్మాయి హీరో లైఫ్ లోకి రావడంతో క్యూట్ గా ఉండబోతుందేమో అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ కి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి నెలకొల్పారు.
ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫ్రెండ్స్ తో హీరో సీన్ ఫుల్ గా నవ్విస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో, అతని ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కోసం వెతకడం, వీళ్ళ ప్రేమ ఏమైంది అని సస్పెన్స్ కామెడీగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా బాగానే నవ్విస్తారు. మధ్యలో ఉపేంద్ర లిమియే పోలీస్ పాత్రతో కామెడీ ట్రై చేసినా పెద్దగా పండలేదు. ఆ అమ్మాయి కోసం వెతికే సీన్స్, మధ్యలో ఫ్రెండ్స్ చేసే కామెడీతో సో సోగా సాగిపోతుంది. క్లైమాక్స్ మళ్ళీ ఫుల్ గా నవ్విస్తారు.
అయితే లవ్ స్టోరీ అని సినిమా ప్రమోట్ చేసినా అసలు హీరో – హీరోయిన్ మధ్యలో లవ్ ఎక్కడ చూపించలేదు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని చెప్పడానికి కరెక్ట్ సీన్స్ పడలేదు. హోటల్ కి రమ్మనగానే ప్రశ్నించకుండా బ్లాక్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుందో తెలీదు. పోనీ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత వెళ్లిపోవడానికి ఒక రీజన్ చెప్తుంది. దానికి హీరోని ప్రశ్నించొచ్చు కానీ ఎందుకు వెళ్లిపోతుందో క్లారిటీ ఉండదు, హీరో చెప్పేది వినదు. అసలు ఒక క్లారిటీ లేకుండా హీరోయిన్ పాత్రను రాసుకున్నారు. హీరో హీరోయిన్ ని నిబ్బి మైండ్ సెట్ అని అంటదు. ఆ డైలాగ్ కి తగ్గట్టే ఆ పాత్ర కూడా ఉంది. అసలు హీరోయిన్ ఎక్కడా హీరోకి ప్రేమిస్తున్నట్టు చెప్పదు. తను హైదరాబాద్ కి ఎందుకు వచ్చిందో హీరోకి తెలియకుండానే హీరోనే అర్ధం చేసుకోలేదు అని అనడం గమనార్హం. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే సబ్ టైటిల్ పెట్టారు ఈ సినిమాకు. హాస్యం, ఉత్కంఠ ఉన్నా ప్రేమ మాత్రం లేదు. తప్పులన్నీ హీరోయిన్ చేసి హీరోని వదిలేయడం, హీరో వచ్చి హీరోయిన్ నే బతిమాలుకోవడం లాంటి సీన్స్ గమనార్హం.
అయితే డేటింగ్ యాప్స్ లో పరిచయం అయిన అబ్బాయి కోసం అమ్మాయి వచ్చేయడం అనే సంఘటనలతో మెసేజ్ ఇస్తున్నారేమో అనుకుంటే, ప్రేమ అర్ధం చేసుకోలేదు అని డైలాగ్స్ వాడారు. మధ్యలో ఆడవాళ్ళ కష్టాల గురించి కొన్ని డైలాగ్స్ వస్తాయి. అసలు సినిమాకు, కథకు, అక్కడ సీన్ కి సంబంధం లేకుండా ఆ డైలాగ్స్ ఎందుకు వచ్చాయో తెలీదు. క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే ఊహించేయొచ్చు. చాలా చోట్ల ఫ్రెండ్స్ పాత్రలు ఒకేసారి అందరూ గొడవపడటంతో చాలా డైలాగ్స్ ఓవర్ ల్యాప్ అయ్యాయి. అయితే లాజిక్స్ ఆలోచించకుండా ఒకసారి హ్యాపీగా నవ్వుకోడానికి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సుమంత్ ప్రభాస్, అనంతిక జంట చాలా ఫ్రెష్ గా, క్యూట్ గా ఉంది. యూత్ ఫుల్ జెన్ జీ లవ్ స్టోరీకి తగ్గట్టు వీరిద్దరూ బాగా సెట్ అయ్యారు. సుమంత్ ఫుల్ ఎనర్జిటిక్ గా, ఫ్రస్టేషన్ చూపించే పాత్రలో బాగా నటించాడు. అనంతిక సినిమా అంతా క్యూట్ గా కనిపిస్తూ అమాయకపు పాత్రలో బాగానే మెప్పించింది. ఫ్రెండ్స్ పాత్రలు చేసిన వారిలో నాగేంద్ర ఫుల్ గా నవ్వించాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ సినిమాలో హైలెట్ గా నిలిచిన నాగేంద్ర ఈ సినిమాలో మరోసారి తన పాత్రతో చాలా బాగా నవ్వించాడు. మిగిలిన ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన వాళ్ళు కూడా పర్వాలేదనిపించారు. ఉపేంద్ర లిమియే కామెడీ పోలీస్ పాత్రలో పర్వాలేదు అనిపించారు. డైరెక్టర్ అనుదీప్ మరోసారి గెస్ట్ పాత్రలో కనిపించి నవ్వించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also See : Jabardasth Satya Sri : జబర్దస్త్ నటి సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ పుట్టిన రోజు.. ఫొటోలు షేర్ చేసి..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. రిచ్ విజువల్స్ ని చూపించారు. కలర్ ఫుల్ లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. పాటలు అన్ని రిపీట్ మోడ్ లో వినొచ్చు. కథ, కథనం పాతవే అయినా కామెడీ కాస్త సస్పెన్స్ తో రాసుకొని సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్స్ తో ఉండే కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయొచ్చు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘రోమాంచకం’ డేటింగ్ యాప్ తో పరిచయం అయిన జెన్ జీ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
