Dhandha Review : ‘దందా’ వెబ్ సిరీస్ రివ్యూ.. సైబర్ మోసాలపై మరో కొత్త సిరీస్.. ఎలా ఉందంటే..?
ఛాయ్ షాట్స్ ఓటీటీలో వర్టికల్ వెబ్ సిరీస్ లు, షోలు అంటూ కొత్త కంటెంట్ బాగానే వస్తుంది. (Dhandha Review)
- Saketh U
- Updated on- August 4, 2026 / 08:30 AM IST
Dhandha Review
Dhandha Review : దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్, సాయి మాధవ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ దందా. ఛాయ్ షాట్స్ నిర్మాణంలో ఆదిత్య దేవులపల్లి దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఛాయ్ షాట్స్ ఓటీటీలో 29 చిన్న ఎపిసోడ్స్ గా ఒక గంట నిడివితో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే..
అరవింద్(దొరసాయితేజ) ఓ అనాథ. చిన్నప్పట్నుంచి ఎన్నో కష్టాలు పడి ఏం చేసైనా సరే డబ్బులు సంపాదించాలనుకునే మనిషి. ఓ పక్క బిటెక్ చదువుకుంటూనే సైబర్ మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అరవింద్ ఓ పెద్ద దందా లీడర్ ప్రకాష్ ఠాకూర్ (కిరణ్ కుమార్) మనిషినే మోసం చేయడంతో పిలిచి ముందు తిట్టి తర్వాత ఇతని ట్యాలెంట్ తెలుసుకొని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు ప్రకాష్. ఇది ఆ దందా నడిపించే గణేష్(సాయి మాధవ్)కి నచ్చదు. జనాలకు కాల్స్ చేసి ఓటీపీలు సంపాదించి వాళ్ళ బ్యాంక్స్ నుంచి డబ్బులు కొట్టేయడమే ఈ దందా పని. ఇందుకు అక్కడ చాలా మంది ఎంప్లాయిస్ లా పనిచేస్తారు.
గణేష్.. అరవింద్, అతని ఫ్రెండ్ వినయ్ లను ఇరికించాలని, వాళ్లకేం పని రాదు అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క అరవింద్ కాలేజీలో తన ఫ్రెండ్ ప్రేమించే నీరు(అక్షర నల్ల)ని ఇష్టపడతాడు. సమయం దొరికితే వాళ్ళిద్దర్నీ విడగొట్టి నీరుని తన ప్రేమలో పడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క ఇలాంటి సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువవుతున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ ఆదిత్య సింగ్ (నితిన్ ప్రసన్న)ని నియమిస్తుంది. మరి అరవింద్ దందాలో గణేష్ ని తట్టుకొని ఎదుగుతాడా? అసలు అరవింద్ కి ఏం కావాలి? నీరు అరవింద్ ప్రేమలో పడుతుందా? ఆదిత్య సింగ్ సైబర్ మోసాలను అరికట్టి ఈ దందాని పట్టుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Also Read : Ruhani Sharma : రుహాని శర్మ నేచుర్ థెరపీ.. ఫోటోలు వైరల్..
సిరీస్ విశ్లేషణ..
ఛాయ్ షాట్స్ ఓటీటీలో వర్టికల్ వెబ్ సిరీస్ లు, షోలు అంటూ కొత్త కంటెంట్ బాగానే వస్తుంది. ఇటీవల ఛాయ్ షాట్స్ కంటెంట్ బాగానే వైరల్ అవుతుంది. తాజాగా ఈ దందా వెబ్ సిరీస్ వచ్చింది. ఇది ఒక బోల్డ్ క్రైమ్ సిరీస్. చాలా సినిమాల లాగే ఓ అనాథ, జీవితంలో కష్టాలు పడ్డ కుర్రాడు ఎలా పైకి ఎదుగుతాడు, ఈ మధ్యలో అతనికి ఎదురయ్యే సంఘటనలు, శత్రువులు, అతని జీవితంలో ఉండే ఓ ప్రేమకథ.. అనే కాన్సెప్ట్ తోనే ఈ సిరీస్ తెరకెక్కింది. కానీ చాలా ఆసక్తిగా కథనం రాసుకున్నారు.
కేవలం ఓటీపీలు మాత్రమే అడిగి డబ్బులు లాగేయడం లాంటివి కాకుండా సైబర్ క్రైమ్ మోసాలు ఇంకెంత కొత్తగా జరుగుతున్నాయో చూపించడం బాగుంది. ఒకరకంగా సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించడమే చేసారు. లవ్ స్టోరీ కూడా కొత్తగా బాగుంటుంది. దందాలో గణేష్ ని కాదని అరవింద్ ఎలా ఎదిగాడు తన ట్యాలెంట్ తో అనే సీన్స్ ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఓటీటీ బోల్డ్ సిరీస్ కాబట్టి బూతులు చాలానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ చూడలేము. కథ అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది కాబట్టి అక్కడక్కడా హిందీ డైలాగ్స్ చాలానే వినిపిస్తాయి. అవి అందరికి అర్ధం కాకపోవచ్చు. వాటికి సబ్ టైటిల్స్ ఇచ్చినా బాగుండేది. అయితే ఎక్కువగా హీరో డైలాగ్స్ ఆడియన్స్ కి చెప్పినట్టు ఉండటం డైలాగ్స్ బాగున్నా కథని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. చివర్లో వచ్చే రెండు ట్విస్టులు బాగుంటాయి.
సీజన్ 2 కి కూడా లీడ్ ఇచ్చి అందులో కథ ఏం ఉంటుందో చెప్పేయడం గమనార్హం. దీంతో సీజన్ 2 పై మరింత ఆసక్తి నెలకొంది. మంచి సస్పెన్స్ క్రైమ్ బోల్డ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ దందా సిరీస్ చూసేయండి..
నటీనటుల పర్ఫార్మెన్స్..
యూట్యూబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న దొర సాయి తేజ ఈ సిరీస్ లో అదిరిపోయే పర్ఫార్మెన్ ఇచ్చాడు. నెగిటివ్ షేడ్స్ ఉండే హీరోగా మెప్పించాడు. అక్షర నల్ల క్యూట్ గా కనిపించి మెప్పించింది. ఈ అమ్మాయికి ముందుముందు మరిన్ని ఛాన్సులు రావొచ్చు. ఇన్నాళ్లు షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియాలో నవ్వించిన సాయి మాధవ్ పూర్తి నెగిటివ్ షేడ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దందా లీడర్ గా కిరణ్ కుమార్ మెప్పించాడు. నితిన్ ప్రసన్న గెస్ట్ అప్పీరెన్స్ లో పర్వాలేదు అనిపించదు. విక్రమ్, శైలు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : AGADHA : ఆకట్టుకుంటున్న అగధ ట్రైలర్.. మంత్ర తంత్ర విద్యలకు అందని శక్తి
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సిరీస్ కంటెంట్ కి తగ్గట్టు కాస్త డార్క్ కలర్ ప్యాలెట్ లో విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిరిస్ కి చాలా ప్లస్ అయింది. డైలాగ్స్ బాగున్నాయి. పాత కథే అయినా సైబర్ క్రైమ్ మోసాలతో కొత్త కథనం రాసుకొని సాంకేతికంగా కూడా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు దర్శకుడు. నిర్మాణ పరంగా భారీ సిరీస్ లకు పెట్టినట్టు దీనికి కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘దందా’ ఎలాగైనా డబులు సంపాదించాలి, ఎదగాలి అనుకునే ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనలతో తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ బోల్డ్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
