Daayra Review : ‘దాయ్‌రా’ మూవీ రివ్యూ.. దిశా కేసుపై బాలీవుడ్ లో సినిమా.. ఎలా ఉందంటే..?

దాయ్‌రా సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా ముందే ప్రీమియర్స్ వేశారు.(Daayra Review)

  • Updated on- September 17, 2026 / 11:54 AM IST

Daayra Review

Daayra Review : కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘దాయ్‌రా’. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మాణంలో మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దాయ్‌రా సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా ముందే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

రాగిణి(ప్రగతి మిశ్రా) అనే అమ్మాయిని రే*ప్ చేసి చంపేసినందుకు DCP రామన్ కుమార్(పృథ్వీరాజ్ సుకుమారన్), అతని టీమ్ నిందితులను వెతికి పట్టుకొని ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆమెకు న్యాయం జరిగిందని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ కౌంటర్ చేసినందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కేసు వేయడంతో DCP రామన్ కుమార్, అతని టీమ్ పై, ఆ కేసుని విచారణ చేయాలని ఆదేశిస్తుంది కోర్టు.

దీంతో వాళ్ళని విచారించడానికి మరో DCP అజూని కోహ్లీ(కరీనా కపూర్) వస్తుంది. మరి అజూని కోహ్లీ రాగిణి కేసుని, DCP రామన్ కుమార్ ని విచారిస్తుందా? ఆమె ఏ రిపోర్ట్ ఇస్తుంది? DCP రామన్ కుమార్, అతని టీమ్ రాగిణి కేసులో నిందితులను ఎలా పట్టుకుంటారు? ఎలా ఎన్ కౌంటర్ చేస్తారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Priyanka Jain : సీరియల్ నటి ప్రియాంక జైన్ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు.. శివ కుమార్ ఎక్కడ?

సినిమా విశ్లేషణ..

2019లో హైదరాబాద్ లో జరిగిన దిశా కేసు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో ఇదే కథతో ఇదే కేసు మీద ఓ రెండు సినిమాలు వచ్చాయి. అందరికి తెలిసిన కేసు కావడంతో ఎలా తెరకెక్కించారు అనే ఆసక్తి ఉంది తప్ప బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై బజ్ లేదు. అయితే దిశా కేసు కథగా తీసుకున్నా కథనంలో మరో రెండు మూడు పాయింట్స్ కొత్తగా చేర్చి బాగానే రాసుకున్నారు. ఈ సినిమా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది.

రాగిణి కేసులో నిందితులను DCP రామన్ కుమార్, అతని టీమ్ ఎన్ కౌంటర్ చేసి చంపడంతో జనాలు సెలబ్రేట్ చేసుకునే సీన్ తో సినిమాని ఓపెన్ చేసారు. ఆ తర్వాత DCP అజూని కోహ్లీ చేతికి ఎన్ కౌంటర్ కేసు విచారణకు రావడంతో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అదే సమయంలో అసలు రాగిణి కేసు ఏంటి.. అని చూపించడం మొదలుపెట్టారు. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో విచారణ కూడా పెద్దగా సస్పెన్స్ లాంటిది ఏం లేకుండా సింపుల్ గానే నడిపించారు. రెండు కోణాల్లో ఒకే కేసు విచారణని చూపించే స్క్రీన్ ప్లే అయితే బాగుంది.

ఈ సినిమాలో ఢిల్లీ నిర్భయ కేసుని తీసుకొచ్చి అందులో ఓ మైనర్ నిందితుడి ప్రస్తుత పరిస్థితిని ఈ సినిమా కథకు లింక్ చేసి రాగిణి కేసులో కూడా కూడా ఓ మైనర్ ఉన్నాడు అని చూపించి ఈ రెండిటిని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అలాగే ఒక అమ్మాయి మిస్ అయింది అనగానే స్పందించకుండా పోలీసులు చూపించే అలసత్వం అన్ని సినిమాల్లో లాగే చూపించారు. రాగిణి కేసులో నిందితులు గతంలో కూడా ఇలాగే చేసారు అని కొత్త లైన్ ఒకటి చేర్చారు. దిశా కేసులో నిందితులు ఏం చేసారు, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఏం మార్చకుండా ఈ కథలో అలాగే రాసుకున్నారు. ఇక క్లైమాక్స్ ఏం ఇవ్వాలో తెలియక అలాగే వదిలేసారు. రాగిణి కేసు కంటే కూడా అజూని కోహ్లీ ఏం రిపోర్ట్ ఇస్తుంది అనేదే ఈ సినిమా అసలు కథగా ఓపెనింగ్ లో చూపించారు. కానీ ఏం రిపోర్ట్ ఇవ్వకుండానే సినిమాని మధ్యలో వదిలేసారు క్లైమాక్స్ లేకుండా. దీంతో ఈ సినిమా పూర్తయినట్టు అనిపించదు. ఆ క్లైమాక్స్ ఏదో మనల్నే రాసుకోండి అన్నట్టు అజూని కోహ్లీ- రామన్ కుమార్ మధ్య ఓ సీన్,కొన్ని డైలాగ్స్ పెట్టి వదిలేసారు.

ఒక అమ్మాయి రే*ప్ & మర్డర్ అనే ఎమోషన్ చాలా బలమైంది. కానీ ఈ సినిమాలో ఆ బలమైన ఎమోషన్ పండలేదు. కొని చోట్ల ఈ సినిమా చూస్తుంటే డాక్యుమెంటరీ అనే ఫీల్ వస్తుంది. స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నా చాలా నిదానంగా, చూసే ప్రేక్షకులకు బోర్ వచ్చేలా రాసుకున్నారు. ఇలాంటి కథలో ఓ రెండు మూడు సీన్స్ లో నవ్వించారు కూడా. థియేటర్లో చూసే రేంజ్ సినిమా అయితే కాదు. గతంలో దిశా కేసుపై ఆర్జీవీ సినిమా చేస్తే బాధితురాలి కుటంబం రిలీజ్ కి అడ్డుకుంది. మరి దాయ్‌రా మూవీ ఆ కుటుంబం అనుమతి తీసుకుందా లేదా తెలియదు. అయితే ఈ సినిమాలో కేసు ఫలానా ప్రాంతంలో జరిగింది అని ప్రాతం పేరు చెప్పకపోయినా మిగతా అంతా దిశా కేసు ఆధారంగానే తెరకెక్కించారు. ఇక దాయ్‌రా అంటే హిందీలో సర్కిల్ అని అర్థం. ఒక అంతం లేకుండా ఇది జరుగుతూనే ఉంటుంది అనే అర్ధం వచ్చేలా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనేలా ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ గా చాలా సెటిల్డ్ పాత్రలో, ఎక్కువ యాక్షన్ లేకుండా, తక్కువ మాట్లాడే పాత్రలో బాగానే నటించాడు. కరీనా కపూర్ కూడా మరో పోలీస్ పాత్రలో మెప్పించింది. ప్రగతి మిశ్రా బాధితురాలి పాత్రలో కాసేపే కనిపించినా మెప్పించింది. జితేంద్ర జోషి, మిగిలిన హిందీ నటీనటులు అందరూ వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Bigg Boss Today Promo : నిన్న కొట్టుకొని, ఏడ్చేసి.. ఇవాళ ఏంటి బ్రో అందరూ పడీ పడీ నవ్వుకుంటున్నారు.. బిగ్ బాస్ ప్రోమో..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కథకు తగ్గట్టు విజువల్స్ కి డార్క్ కలర్ ప్యాలెట్ మాత్రం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. చివర్లో ఒకే ఒక పాట ఉండగా అది పర్వాలేదు. తెలిసిన కథ, కొత్త కథనంతో, క్లైమాక్స్ లేకుండా రాసుకొని సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సిందే. నిర్మాణ పరంగా సినిమా కావాల్సినంతలో తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘దాయ్‌రా’ సినిమా దిశా కేసు ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ సినిమా. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.