Dharmasthala Niyojakavargam Review: ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. పొలిటికల్ యాక్షన్..

Dharmasthala Niyojakavargam Review: వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై కాస్త బజ్ నెలకొంది.

  • Updated on- September 4, 2026 / 03:09 PM IST

Dharmasthala Niyojakavargam Review

Dharmasthala Niyojakavargam Review: సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మేరుం భాస్కర్ నిర్మాణంలో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ధర్మస్థల నియోజకవర్గం సినిమా నేడు సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచి ఆ నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు ఎమ్మెల్యే బైర్రాజు(సాయికుమార్). అదే ఊళ్ళో బైర్రాజు సపోర్ట్ తో కాలేజీని నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తుంటారు వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య (కస్తూరి). ఆ కాలేజీలోని విద్యార్థులకు విశ్వ(శివకుమార్) ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తూ విద్యార్థులను డ్రగ్స్ కు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన కాలేజీ లెక్చరర్ గా పని చేసే అరుంధతి( వితిక షేరు), ఆమె స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) విశ్వను ఎదిరిస్తారు. దీంతో బద్రిని చంపేస్తారు.

ఎమ్మెల్యే బైర్రాజు వల్లే తన కొడుకు చనిపోయాడని తెలిసి టీ కొట్టు నడుపుకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నికల్లో బైర్రాజు మీద నిలబడతాడు. మరి బైర్రాజు మీద ఈశ్వరయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడా? కాలేజీలో డ్రగ్స్ ఆగిపోతాయా? లెక్చరర్ అరుంధతి దీనిపై ఎలా పోరాటం చేస్తుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read: Ramba Oorvasi Menaka Reivew: ‘రంభ ఊర్వశి మేనక’ రివ్యూ.. భూమి పైకి రంభ, ఊర్వశి, మేనక తమ భక్తుడి కోసం దిగి వస్తే..

సినిమా విశ్లేషణ..

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై కాస్త బజ్ నెలకొంది. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ సీన్స్, కాలేజీలో స్టూడెంట్స్ డ్రగ్స్ కి బానిసవ్వడం, అక్కడొక విలన్, వాళ్ళతో బద్రి, అరుంధతి ఫైట్ చేసే సీన్స్ తో సింపుల్ గా సాగిపోతుంది. ఇంటర్వెల్ కి బద్రి మరణంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఈశ్వరయ్య తన కొడుకును చంపిన వాళ్ళని చంపడం, అరుంధతి పోరాటం, ఈశ్వరయ్య పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ క్యాంపైన్స్, ఎన్నికలు.. అంటూ సాగుతుంది.

ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు హక్కు మెసేజ్ ని చూపించారు. ఫస్ట్ హాఫ్ రొటీన్ కాలేజీ డ్రగ్స్ సీన్స్, ఓ పాట, ఫైట్ తో సాగదీశారు. ఇంటర్వెల్ నుంచే కథ ఆసక్తిగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ సాగదీసినా సెకండ్ హాఫ్ సీన్స్ పరిగెడతాయి. అయితే ఓ 30 ఏళ్ళ నుంచి భయపడుతూ బతుకుతున్న ప్రజలు ఒక్కసారిగా మారడం అనే సీన్స్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. రాజకీయ నాయకులపై సామాన్యులు పోటీకి నిలబడి గెలిచినా సినిమాలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే కొన్ని మెసేజ్ లు ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సుమన్ టీ అమ్మే వ్యక్తిగా, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా రెండు వేరియేషన్స్ తో బాగానే నటించారు. సాయికుమార్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నటి కస్తూరి, శివకుమార్ విలన్స్ పాత్రల్లో బాగా నటించారు. విలన్ పాత్రలతో ఫేమ్ తెచ్చుకున్న సీనియర్ నటుడు సత్య ప్రకాష్ తనయుడు నటరాజ్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బద్రి పాత్రలో మెప్పించాడు. వితిక షేరు రీ ఎంట్రీలో లెక్చరర్ గా పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. రాయంచ కొక్కుర, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. వరుణ్ సందేశ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం.

Also Read : Sahaa Review : ‘సహా’ మూవీ రివ్యూ.. చిన్నప్పట్నుంచి ఒకే అమ్మాయిని ప్రేమించి..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బాగుండేది. మెసేజ్ ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా దర్శకుడు బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ యూత్ కి, జనాలకు మెసేజ్ ఇస్తూ సాగిన పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.