Dont Trouble the Trouble Review: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రివ్యూ.. పిల్ల దయ్యాన్ని హీరో కిడ్నాప్ చేస్తే..

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చి స్పీచ్ ఇవ్వడం, రాజమౌళి ఫ్యామిలీ ఎమోషనల్ అవ్వడం, మహేష్ బాబు సినిమాపై గొప్పగా ట్వీట్ వేయడం, ట్రైలర్ కి బాలయ్యతో వాయిస్ ఓవర్ ఇప్పించడంతో.. ఒక్కసారిగా ఈ సినిమాకు బజ్ వచ్చింది. (Don’t Trouble The Trouble)

  • Updated on- October 1, 2026 / 11:45 PM IST

Don’t Trouble The Trouble Review

Dont Trouble the Trouble Review: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కార్తికేయ నిర్మాణంలో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

సూరి(ఫహద్ ఫాజిల్) అంబులెన్స్ డ్రైవర్ జాబ్ చేస్తూ మరో పక్క డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. మ్యాజిక్ చేసే తన ఫ్రెండ్ మల్లేష్(వెంకటేష్ కాకుమాను)ని కూడా ఇబ్బందుల్లో పెడుతూ ఉంటాడు. సూరి చేసిన పనులతో అస్లాం భాయ్(మహేష్ మంజ్రేకర్)కి 25 లక్షలు రెండు రోజుల్లో ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక ఎవరినైనా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటాడు. అదే సమయంలో దివ్య(సారా) అనే పాప ఆత్మ సూరి కి కనిపిస్తుంది. అది ఆత్మ అని సూరికి తెలియదు. దివ్యకి కూడా తను ఆత్మ అని, చనిపోయాను అని తెలియదు. సూరి ఒక్కడికే దివ్య కనిపిస్తుంది. దివ్య.. తన తల్లితండ్రులను మాయం చేశాను, తిరిగి తెప్పించు, నువ్వు మెజీషియన్ కదా అని సూరి దగ్గరకు వస్తుంది. కిడ్నాప్ చేయాలని చూస్తున్న సూరికి దివ్యనే తన దగ్గరకు రావడంతో పాప తప్పిపోయి ఏదేదో మాట్లాడుతుంది అనుకోని తనతో తీసుకెళ్తాడు.

దివ్య చెప్పిన గుర్తులతో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి దివ్య మామయ్య ప్రతాప్(సౌరభ్ సచ్ దేవ్) నెంబర్ సాధించి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తాడు. సూరి డబ్బులు తీసుకొని పాపని ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ పాప ప్రతాప్ కి, పోలీసులకు కనపడదు. రెండు సార్లు ఫెయిల్ అవ్వడంతో అనుకోకుండా దివ్య ఆత్మ అని తెలుస్తుంది. దీంతో సూరి షాక్ అవుతాడు. అసలు దివ్య ఎలా చనిపోయింది? ఆమె తల్లితండ్రులు ఏమయ్యారు? సూరి ఒక్కడికే దివ్య ఎందుకు కనిపిస్తుంది? దివ్య ఆత్మ పై లోకాలకు వెళ్లిపోతుందా? దివ్యకు తాను చనిపోయింది అని తెలుస్తుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Premane Oorilo Review : ‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. కన్నడ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు తెలుగులో.. సాంగ్స్ సూపర్..

సినిమా విశ్లేషణ..

ఫహద్ ఫాజిల్ తెలుగులో సినిమా చేస్తున్నాడు అని ప్రమోట్ చేసినా, రాజమౌళి కొడుకు సినిమా అన్నా పెద్దగా అంచనాలు రాలేదు ఈ సినిమాపై. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చి స్పీచ్ ఇవ్వడం, రాజమౌళి ఫ్యామిలీ ఎమోషనల్ అవ్వడం, మహేష్ బాబు సినిమాపై గొప్పగా ట్వీట్ వేయడం, ట్రైలర్ కి బాలయ్యతో వాయిస్ ఓవర్ ఇప్పించడంతో.. ఒక్కసారిగా ఈ సినిమాకు బజ్ వచ్చింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో తెలుగులో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ఓపెనింగ్ సూరి పాత్ర డబ్బుల కోసం చేసే పనులు కాస్త సిల్లీగా సాగదీశారు. పాప ఆత్మ ఎంట్రీ బాగుంటుంది. డబ్బుల కోసం సూరి పడే పాట్లతో కాసేపు సాగదీశారు. దివ్య సూరిని కలిసిన దగ్గర్నుంచి సూరికి ఎప్పుడు ఆ పాప ఆత్మ అని తెలుస్తుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక బ్లాక్ మెయిల్ చేసి డబులు అడిగే సీన్స్ రొటీన్. చాలా సినిమాల్లో ఉన్నవే. దివ్యకు తాను ఆత్మ అని తెలియక చేసే కామెడీ కాస్త వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ కి దివ్య ఆత్మ అని సూరి పాత్రకు తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సూరి పాప ఆత్మతో ఏం చేసాడు ? మధ్యలో పోలీసులు సూరిని పట్టుకోవడం, దివ్య తల్లితండ్రులు ఏమయ్యారు అని సాగుతుంది.

ఈ సినిమా కథ చూస్తుంటే గతంలో బోలెడు సినిమాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఓ పాపకి కష్టం రావడం, ఒక్కతే ఉండి హీరో దగ్గరకు చేరడం, హీరో పాప కష్టాన్ని సాల్వ్ చేయడం.. అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం నుంచి భజరంగి భాయ్ జాన్ వరకు బోలెడన్ని సినిమాలు వచ్చాయి ఈ కథతో. కాకపోతే అందులో రియల్ మనిషి, ఇందులో ఆత్మ అదొక్కటే తేడా. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా అక్కడక్కడా కామెడీతో, కొన్ని రొటీన్ బ్లాక్ మెయిల్, రొటీన్ హీరో కష్టాల సీన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆత్మని అడ్డు పెట్టుకొని సూరి చేసే పనులు బాగానే నడిపించాయి. పోలీసుల విచారణ, దివ్య తల్లితండ్రులను కనుక్కోవడం లాంటివి బేసిక్ లాజిక్స్ కూడా లేకుండా సాగదీశారు. అసలు దివ్య మామ వచ్చి కంప్లైంట్ ఇస్తే తల్లితండ్రులు ఏమయ్యారు, ఎటు వెళ్లారు అని విచారణ చేయకుండా సూరి చేసిన కాల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద ఓ లారీ యాక్సిడెంట్ అయి రెండు మూడు రోజులు అయినా ఎవరూ పట్టించుకోరు.. ఇలాంటి బేసిక్ లాజిక్ లెస్ సీన్స్ సెకండ్ హాఫ్ లో చాలానే వచ్చాయి.

అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. ఎమోషన్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో రాసుకున్న పలు డైలాగ్స్ తో క్లైమాక్స్ ఇంకా కొనసాగింపు ఇచ్చి ఇంకో ముగింపు ఇచ్చుకునే అవకాశం ఉంది కానీ ఇలాంటి ముగింపు ఇచ్చాడేంటి అని ఆలోచించాల్సిందే. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. చిన్న పిల్లలకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరదాగా ఓ సారి అయితే చూడొచ్చు. కానీ రాజమౌళి మార్క్ సినిమా అయితే కాదు. ఎన్టీఆర్, మహేష్ ఇచ్చినంత హైప్ అయితే ఉండదు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఫహద్ ఫాజిల్ తన పాత్రలో బాగానే నటించినా వేరే కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు ఉంటే ఇంకా బాగా పండేది ఆ పాత్ర అనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ సారా మాత్రం క్యూట్ గా నటిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా మెప్పించింది. మరిన్ని సినిమాల్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి అవకాశాలు ఖాయం. హీరో ఫ్రెండ్ పాత్రలో వెంకటేష్ కాకుమాను బాగా నటించాడు. అస్లాం భాయ్ గా మహేష్ మంజ్రేకర్ బాగానే నటించాడు. సుబ్బరాజు పోలీస్ పాత్రలో పర్వాలేదు అనిపించదు. పాప మామయ్య పాత్రలో సౌరభ్ సచ్ దేవ్ కాస్త ఓవర్ యాక్షన్ చేసాడని అనిపిస్తుంది. పాప తల్లితండ్రులుగా శశాంక్, దివ్య పిళ్ళై గెస్ట్ పాత్రలు పోషించారు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Mahendragiri Varahi OTT : ఓటీటీలోకి మ‌హేంద్ర‌గిరి వారాహి.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు కూడా మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. పాత కథ తీసుకొని ఆత్మ అనే కొత్త పాయింట్ జోడించి బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. రాజమౌళి మార్క్ సినిమాలంటే గ్రాఫిక్స్ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. కానీ ఇందులో క్లైమాక్స్, పలు సీన్స్ లో ఇది గ్రాఫిక్ విజువల్స్ అని అర్థమయ్యేలా రియాలిటీకి దూరంగా ఉంటాయి. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ డబ్బు కోసం ఏ పనైనా చేసే హీరో దయ్యం అని తెలియాక ఓ పాప ఆత్మని కిడ్నాప్ చేస్తే ఏం జరిగింది అని కామెడీ ఎమోషన్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.