Ee Paata Korinavaaru Nemalipaalem Nundi Review : ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి’ మూవీ రివ్యూ.. మ్యూజికల్ థ్రిల్లర్..
Ee Paata Korinavaaru Nemalipaalem Nundi Review : ఈ పొడవైన టైటిల్ సినిమాని ప్రకటించడంతో ఈ టైటిల్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అందరికి సినిమాపై ఆసక్తి కలిగింది.
- Saketh U
- Updated on- September 18, 2026 / 02:41 PM IST
Ee Paata Korinavaaru Nemalipaalem Nundi
Ee Paata Korinavaaru Nemalipaalem Nundi Review : హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ బ్యానర్ పై చంద్ర సిద్ధార్థ్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
సాగర్(హర్ష) ఒక మానసిక పేషేంట్. సాగర్ అన్నయ్య శివాజీ(రవివర్మ) అమెరికాలో ఓ డాక్టర్. శివాజీ తన తమ్ముడు సాగర్ ని ఏపీలోని ఓ గెస్ట్ హౌస్ లో పెట్టి చూసుకోడానికి దాము(అశోక్ వర్ధన్), నీలి(రేఖ నిరోషా)ని నియమిస్తాడు. రేడియోలో సాగర్ కి ప్రతి రోజు రాత్రి 10.30 ఒకే పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటని కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు అని చెప్పి ఆ పాట వేస్తారు. ఆ పాట విన్న దగ్గర్నుంచి సాగర్ చుట్టూ దయ్యం తిరుగుతుందేమో అని భ్రమపడుతూ ఉంటాడు. దాము కూడా ఆ పాట రోజూ వస్తుంది అని చెప్తాడు. దాము, నీలి పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఒంటరి వాడైన సాగర్ అసలు ఆ పాట రోజూ ఎందుకు వస్తుంది తెలుసుకోవడానికి విజయవాడలోని రేడియో స్టేషన్ కి వెళ్తాడు.
అక్కడ కావేరి(ఇనయా సుల్తానా) ఆ ప్రైవేట్ సాంగ్ వేయమని ఆరు నెలలుగా ఉత్తరాలు వస్తున్నాయి అని పోస్ట్ కార్డు సాగర్ కి ఇస్తుంది. దీంతో ఆ పోస్ట్ కార్డు పట్టుకొని నెమలి పాలెం ఎక్కడుంది, అసలు రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి ఎవరు? వాళ్ళు ఇదే పాట రోజూ ఎందుకు అడుగుతున్నారు అని కనుక్కోవడానికి వెళ్తాడు. అడ్రెస్ వెతుక్కుంటూ వెళ్లిన సాగర్ కి అసలు అక్కడ నెమలి పాలెం అనే ఊరు, అక్కడ మనుషులు ఎవరూ ఉండరు. మరి రోజూ ఆ పాటని వేయమని ఉత్తరాలు పంపేది ఎవరు? ఎందుకు అదే పాటని వేయాలని అడుగుతున్నారు? రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి ఎవరు? వాళ్లకు సాగర్ కి సంబంధం ఏంటి? సాగర్ కి ఉన్న సమస్య ఏంటి? సాగర్ వాళ్ళని కనిపెడతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Missing Meghana Review : ‘మిస్సింగ్ మేఘన’ రివ్యూ.. అమ్మాయి మిస్సింగ్ కేసు చివరకు ఎటు వెళ్లిందంటే..
సినిమా విశ్లేషణ..
ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఇదీ సంగతి, ఆటగదరా శివా.. లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల ఈ పొడవైన టైటిల్ సినిమాని ప్రకటించడంతో ఈ టైటిల్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అందరికి సినిమాపై ఆసక్తి కలిగింది. ట్రైలర్ కూడా బాగుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని చర్చ జరిగింది. కాకపోతే ఈ సినిమా ఇప్పటికే ఆలస్యంగా విడుదల అవడం, ప్రమోషన్స్ ఎక్కువ చేయకపోవడంతో పెద్దగా బజ్ ఏర్పడలేదు.
ఫస్ట్ హాఫ్ సాగర్ గెస్ట్ హౌస్ వచ్చిన దగ్గర్నుంచి కొన్ని భయపడే సీన్స్ తో నడిపించి నీలి సీన్స్ తో కాస్త కవ్వించారు. దాము, నీలి పెళ్లి సీన్ తో ఒంటరైన సాగర్.. కొన్ని నవ్వులు కొన్ని కన్నీళ్లు.. అని సాగే ఆ పాటని అడిగేవాళ్ళ గురించి కనుక్కునే ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో కావేరిని కలవడం, ఆ ఊరికి వెళ్లడం, అక్కడ ఆ ఊరే లేకపోవడం, వాళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలియడం, అక్కడే ఒక అమ్మాయి దగ్గర అదే పోస్ట్ కార్డు చూడటంతో ఇంటర్వెల్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ ఓపెనింగ్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తారు. ఆ అయిదుగురి స్టోరీ, వాళ్ళ మ్యూజికల్ బ్యాండ్, వాళ్ళ స్నేహం, ప్రేమలతో నడిపించి చివర్లో సాగర్ హెల్త్ కండిషన్ తో, సాగర్ కలిసిన అమ్మాయితో అసంపూర్ణంగా ముగింపు ఇచ్చారు.
మొదటి 20 నిముషాలు బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి ఆ సీన్స్ పెట్టారు కానీ అంతగా పండలేదు. నీలి పాత్ర కథని కాస్త ఎంగేజ్ చేస్తుంది. ఆ పాట, మనుషుల కోసం సాగర్ వెతకడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందే ఊహించేయొచ్చు. కానీ ఇంటర్వెల్ అయ్యాక వచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేము. అలాంటి సీన్స్ గతంలో పలు సినిమాల్లో ఉన్నా అది ఊహించలేని విధంగా ఫస్ట్ హాఫ్ ని రాసుకోగలిగారు. సినిమాకు ఆ ట్విస్ట్ ప్లస్ అయింది. ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా రొటీన్ మ్యూజికల్ బ్యాండ్ సాంగ్స్ కంపోజ్, ప్రేమలు, స్నేహాలు, ఫ్రెండ్స్ మధ్య గొడవలు, రెగ్యులర్ గా హీరో వినే కొన్ని నవ్వులు కొన్ని కన్నీళ్లు.. సాంగ్ కంపోజ్ తో సాగుతుంది. క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది కానీ దర్శకుడు కథ పూర్తి చేయకుండా ఎందుకు వదిలేసాడో అనిపిస్తుంది.
కొన్ని AI విజువల్స్ వాడారు అవి సెట్ అవలేదు. అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించినా టైటిల్ మైనస్ అయింది. ఇంత పెద్ద టైటిల్ పెట్టి ఆసక్తి కలిగించినా అందరు పిలుచుకునే విధంగా ఏదైనా టైటిల్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడు చంద్ర సిద్దార్థ్ మరోసారి ఎక్స్పరిమెంట్ చేసాడు అని చెప్పొచ్చు. ఓటీటీలో అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
హీరో పాత్రలో హర్ష రెండు వేరియేషన్స్ తో పర్వాలేదు అనిపించాడు. అమైరా గోస్వామి తన పాత్రలో మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించింది. సుజనా రెడ్డి అందాల ఆరబోతకే. నటనలో పర్వాలేదు అనిపిస్తుంది. రేఖ నిరోషా కూడా ఉన్న కాసేపు మెప్పిస్తుంది. డాక్టర్ పాత్రలో రవివర్మ అప్పుడప్పుడు కనిపించి వెళ్తూ ఉంటాడు. రేడియో జాకీగా గెస్ట్ పాత్రలో ఇనయా సుల్తానా ఒకసారి కనిపించి వెళ్ళిపోతుంది. అశోక్ వర్ధన్, సన్నీ, గిరిధర్ చంద్రమౌళి, భద్రాచలం దేవిక, అనిరుద్ శ్రీవాస్తవ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Daayra Review : ‘దాయ్‌రా’ మూవీ రివ్యూ.. దిశా కేసుపై బాలీవుడ్ లో సినిమా.. ఎలా ఉందంటే..?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ కి కలర్ గ్రేడింగ్ చేయలేదు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రిపీటెడ్ గా వినిపించే పాట మాత్రం చాలా బాగుంది. మిగిలిన పాటలు పర్వాలేదు. లొకేషన్స్ కూడా గ్రీనరీగా కథకు తగ్గట్టు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్స్ లో కొంత ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. AI విజువల్స్ ఏవి కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు, బాగోలేవు. ఆసక్తికర పాయింట్ తో రొటీన్ కథనంతోనే బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా ఆ పాటని కోరింది ఎవరు అని హీరో కనిపెట్టే ప్రయత్నం ఓ ఆసక్తికర ట్విస్ట్ తో సస్పెన్స్ మ్యూజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
