Gurthukosthunnayi Review: ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ రివ్యూ.. 90s కిడ్స్ కనెక్ట్ అవ్వాల్సిందే.. ఫుల్గా నవ్వించి చివర్లో ఏడిపించి..
గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ తో 90s కిడ్స్ జ్ఞాపకాలతో వచ్చే సిరీస్ అని చెప్పి ప్రమోట్ చేయడంతో ఈ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి. (Gurthukosthunnayi Review)
Gurthukosthunnayi Web Series Review
Gurthukosthunnayi Web Series Review: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. 90s కిడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో వినోద్ గాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ జులై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ సిరీస్ లో రోహిణి హట్టంగడి, శివ నారాయణ, ప్రియదర్శిని రామ్.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే..
సంతోష్(విరాజ్)- వైశాలి(యశశ్రీరావు) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. అతి కష్టం మీద వైశాలి తండ్రి, సంతోష్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ రఘునాథ్(ప్రియదర్శిని రామ్)ని ఒప్పిస్తారు. కానీ రఘునాథ్ కొన్ని కండిషన్స్ పెడతాడు. వాటన్నిటిని సంతోష్ నెరవేర్చడంతో పెళ్ళికి ముహూర్తం పెడతారు. అయితే మొదటి పెళ్లి కార్డు మాకే ఇవ్వాలని, పెళ్లి అయ్యేదాకా ఊరు దాటి బయటకు వెళ్ళొద్దని సంతోష్ కి రఘునాథ్ కండిషన్ పెడతాడు. కానీ సంతోష్ కి తన చిన్ననాటి స్నేహితులు గుర్తొచ్చి వాళ్లందరికీ ముందే కార్డులు పోస్ట్ చేసి వారం రోజుల ముందే రమ్మంటాడు. వాళ్ళు వచ్చాక బ్యాచిలర్ పార్టీ గోవా అని హడావిడి చేయడంతో సంతోష్, అతని చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్ ఆనంద్(గోపి), గణేష్(వైవా రాఘవ), శ్రీకాంత్(సిద్దు పవన్) కలిసి కార్ లో గోవాకు బయలుదేరుతారు. వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ జరిగి సంతోష్ గతం మర్చిపోతాడు.
అతని గతం గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ మాములు మనిషి అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్(అనీష్ కురువిళ్ళ) చెప్పడంతో ఫ్రెండ్స్ అంతా తమ చిన్ననాటి సంగతులు చెప్పుకొస్తారు. ఈ విషయం రఘునాథ్ కి, వైశాలికి తెలిస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని భయపడి సంతోష్ ఫ్రెండ్స్, అతని పేరెంట్స్ ఎపుడూ సంతోష్ పక్కనే ఉంటూ మేనేజ్ చేస్తారు. మరి ఈ విషయం రఘునాథ్, వైశాలికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సంతోష్ -వైశాలి పెళ్లి జరుగుతుందా? సంతోష్ – వైశాలి ప్రేమ కథేంటి? ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి చిన్నప్పుడు చేసిన సందడి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read – Isakapatnam Web Series Review : ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. తండ్రి కూతుళ్ళ యుద్ధం..
సిరీస్ విశ్లేషణ..
గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ తో 90s కిడ్స్ జ్ఞాపకాలతో వచ్చే సిరీస్ అని చెప్పి ప్రమోట్ చేయడంతో ఈ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి. సిరీస్ ఓటీటీలో జులై 3 రిలీజ్ అయినా కాన్ఫిడెన్స్ తో ముందే థియేటర్ లో ప్రీమియర్ షో వేయడం గమనార్హం. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్ లో. ఒక్కో ఎపిసోడేకి దానికి తగ్గట్టు ఆసక్తికర పేరు కూడా పెట్టడం గమనార్హం.
మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఫుల్ గా నవ్వుకుంటాము. ప్రతి సీన్ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తాము. సిరీస్ చూస్తున్నంతసేపు మన చిన్నప్పటి సంగతులు, మన ఫ్రెండ్స్ తో చేసిన సందడి గుర్తొస్తాయి. ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి సంతోష్ ని అందరి దగ్గర మేనేజ్ చేయడం, వాళ్ళ మాజీ ప్రిన్సిపాల్ ని మేనేజ్ చేయడం, గతం మర్చిపోయి సంతోష్ చేసే పనులతో ఫుల్ గా నవ్వుకుంటాము. సంతోష్ – వైశాలి చిన్నప్పటి లవ్ స్టోరీని క్యూట్ గా చూపించారు. ఈ సిరీస్ అంతా ప్రస్తుతం, గతం మధ్యలో నడుస్తుంది. చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం ఎమోషనల్ గా నడిపించారు. అమ్మమ్మ సెంటిమెంట్ కి కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. క్లైమాక్స్ ఫ్రెండ్స్ ఎమోషన్ కి కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. మొదటి నాలుగు ఎపిసోడ్స్ నవ్విస్తే చివరి మూడు ఎపిసోడ్స్ ఎమోషనల్ గా తెరకెక్కించారు.
రఘునాథ్ కి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది? తెలిసాక ఏం చేస్తాడు అనేది మాత్రం ఉత్కంఠగా నడిపించారు. ప్రతి ఎపిసోడ్ చివర ఆసక్తి కలిగించేలా మంచి ఎండ్ ఇచ్చారు. చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం కాస్త అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఈ కథలో టెక్నాలజీని కూడా బాగానే వాడారు. క్లైమాక్స్ లో రెండు ట్విస్టులు మాత్రం అస్సలు ఊహించలేము. ఆ ట్విస్ట్ లు ఎమోషనల్ గా మెప్పిస్తాయి. కేవలం హీరో గురించే కాక మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ ని కూడా అక్కడక్కడా చూపించడం బాగుంటుంది. కాకపోతే ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాని భలేభలే మగాడివోయ్, కమిటీ కుర్రాళ్ళు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలు, 90s సిరీస్ గుర్తొస్తాయి. వాటిల్లోంచి కొన్ని సీన్స్ తీసుకొని కొత్తగా చూపించారు అనిపిస్తుంది. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా హ్యాపీగా ఈ సిరీస్ ని చూసేయొచ్చు.
ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మన చిన్నతనం, ఫ్రెండ్స్, అమ్మమ్మ ఇల్లు, చిన్నప్పటి ప్రేమకథలు గుర్తొచ్చి నవ్వుకుంటాం, ఏడుస్తాం. ఈ గుర్తుకొస్తున్నాయి సిరీస్ ని పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్.. ఇలా అందరితో సరదాగా కూర్చొని చూడొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కి సంబంధించి సిరీస్ లో బోలెడన్ని రిఫరెన్స్ లు ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేసారు. వేరే హీరోల పాత పాటలు అక్కడక్కడా వినిపిస్తాయి. 90s సిరీస్ ని ప్రమోట్ చేసినట్టు ఈటీవీ విన్ ఈ సిరీస్ ని కూడా ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సిరీస్ లాగే కాకుండా కొంత కట్ చేసి సినిమాగా రిలీజ్ చేసినా వర్కౌట్ అయ్యేది అనిపిస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ చాలా బాగా నటించాడు. గతం మర్చిపోయి నటించే పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ సీన్ తో మెప్పించాడు. ఈ సిరీస్ తర్వాత విరాజ్ అశ్విన్ కి మరిన్ని అవకాశాలు రావొచ్చు. ముంబై సోషల్ మీడియా స్టార్ యశశ్రీరావు ఈ సిరీస్ తో నటిగా మారింది. యశశ్రీ అక్కడక్కడా క్యూట్ గా కనిపించి ఓకే అనిపిస్తుంది. చాన్నాళ్ల తర్వాత ప్రియదర్శిని రామ్ స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ పాత్రలో మెప్పిస్తారు. హీరో ఫ్రెండ్స్ గా గోపి, వైవా రాఘవ, సిద్ధూ పవన్ ఫుల్ గా నవ్విస్తారు. ఈ సిరీస్ అంతా వీళ్లే నడిపించారు అని చెప్పొచ్చు.
అమ్మమ్మ పాత్రలో రోహిణి హట్టంగడి, తాతయ్య పాత్రలో శుభలేఖ సుధాకర్ చక్కగా మెప్పిస్తారు. శివన్నారాయణ, గోపరాజు రమణ, అనీష్ కురువిళ్ళ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. చిన్నప్పటి యశశ్రీ పాత్రలో మేఘన సునీల్ క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు గఫార్, మధు స్టీవ్, చక్రి, సైమన్.. మిగిలిన చైల్డ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారు. ఫుల్ గా నవ్వించి ఏడిపిస్తారు కూడా. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం.
Also See : AAA Cinemas : వైజాగ్ లో ఓపెన్ అయిన అల్లు అర్జున్ థియేటర్.. సందడి చేసిన స్నేహారెడ్డి..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే అదిరిపోతాయి. రిపీట్ మోడ్ లో వినొచ్చు. గతం మర్చిపోయిన హీరోకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసే సింపుల్ కథతో మంచి ఆసక్తికరమైన కథనంతో చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ కూడా బాగుంది. చిన్నప్పటి స్కూల్, అప్పటి వస్తువులు చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడ్డారు. నిర్మాణ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ చూసి మన చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకోవడం ఖాయం. ఈ సిరీస్ కి 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
