Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో నవ్వించి..

Hushar Pittalu Movie Review:హుషార్ పిట్టలు అనే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ కి టీజర్ ఒక్కసారిగా వైరల్ అయి సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని విమర్శలు కూడా వచ్చాయి.

  • Published on- August 14, 2026 / 12:46 AM IST

Hushar Pittalu Review

Hushar Pittalu Review: అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ బ్యానర్ పై వెంకట్‌ యాదవ్‌ నిర్మాణంలో బిక్షు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నా మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

రవి(అన్ష్) అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోతుంది. స్కూల్ ఫస్ట్ వస్తాడు. అదే ఊళ్ళో ఉండే చిట్టి(వాసవి గణేశన్) అప్పుడే పెద్దమనిషి అవుతుంది. చిట్టి రవిని చూసి ఇష్టపడుతుంది. చక్కగా చదువుకునే రవిని బాలన్న, ఇంకొంతమంది కలిసి అడల్ట్ వీడియోలు చూపించి, అమ్మాయిలను ప్రేమించాలి అని చెప్పి చెడగొడతారు. దాంతో రవి కూడా చిట్టికి కనెక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరూ తెలిసి తెలియని వయసులో హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏకంగా శృంగారం చేసుకునే దాకా వెళ్తారు.

ఇది చిట్టి అక్క శైలు(ప్రణీ రెడ్డి)కి తెలిసి హెచ్చరించినా వినకుండా కుదిరినప్పుడల్లా అదే ప్రేమ అనుకోని శృంగారం చేసుకుంటారు. చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆమె తండ్రి(గోవర్ధన్)కి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు? రవి తండ్రికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు? తెలిసి తెలియని వయసులో చేసిన శృంగారంతో వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా లేదా? ఈ సంఘటనలతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Agadha Review : ‘అగధ’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ మాములుగా లేదుగా..

సినిమా విశ్లేషణ..

హుషార్ పిట్టలు అనే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ కి టీజర్ ఒక్కసారిగా వైరల్ అయి సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ తర్వాత ఇది ఎలాంటి సినిమానో కాస్త క్లారిటీ వచ్చింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా బాగుండటం, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో హుషార్ పిట్టలు సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ప్రీమియర్స్ వేయడం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ చిట్టి, రవి, వారి చుట్టూ ఉండే పాత్రల పరిచయం, వీరిద్దరూ ప్రేమలో పడి, ఫోన్స్ లో ఊసులాడుకోవడం, శృంగారం దాకా వెళ్లడం.. లాంటి సీన్స్ తో నవ్విస్తూ సాగుతుంది. ఇంటర్వెల్ కి కాస్త సస్పెన్స్ పెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొల్పారు. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉంది. వీళ్ళిద్దరూ దొరికిపోవడం, ఇంట్లో వాళ్లకు తెలియడం, వీరి శృంగారం హద్దులు దాటడం.. లాంటి సీన్స్ తో వీరి జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయి అని ఆసక్తిగా నడుస్తుంది.

సినిమాలో ఎక్కువ అడల్ట్ కామెడీనే ఉంది. చాలా వరకు డబల్ మీనింగ్ డైలాగ్స్ తోనే కథని నడిపించారు. ఆ అడల్ట్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ గానే నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్ లో కూడా కొంత అడల్ట్ కామెడీ ఉన్నా ఎమోషన్, మెసేజ్ సీన్స్ తో పర్ఫెక్ట్ గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ కొత్తగా రాసుకున్నారు. క్లైమాక్స్ సీన్ అయితే ఊహించేయొచ్చు.

చిన్నపిల్లలను పక్కన పెట్టుకొని మనం చేసే పనులు, మాట్లాడే మాటలు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే సీరియస్ మెసేజ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. చెడు స్నేహాలు మనుషులను ఎలా మారుస్తాయి, తల్లితండ్రుల ప్రేమ, వాళ్ళు మనపై పెట్టుకున్న ఆశలు, తెలిసి తెలియని వయసులో హార్మోన్స్ ప్రభావంతో పిల్లలు ఎలా దారి తప్పుతున్నారు, ఫోన్స్ లో పిల్లలు ఏం చేస్తున్నారు.. ఇలాంటివి అన్ని కూడా మంచి సీన్స్ తో మెసేజ్ ఇచ్చారు. అయితే ఈ సినిమా చూస్తుంటే టెన్త్ క్లాస్, బస్ స్టాప్, ఈరోజుల్లో.. లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ముందంతా బూతు కంటెంట్ చూపించి చివర్లో ఎమోషన్, నాలుగు మంచి సీన్స్ తో ఇలా చేయడం తప్పు అని చెప్పే సినిమాల్లాగే ఇది కూడా ఉంది. కానీ అలాంటి సినిమా చాన్నాళ్ల తర్వాత వచ్చింది. ఈ సినిమా ప్రస్తుత సమాజానికి అవసరమే. పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా చూడాల్సిన సినిమా.

నటీనటుల పర్ఫార్మెన్స్..

కొత్త వాళ్ళు అయినా అన్ష్, వాసవి గణేషన్‌ ఇద్దరూ తమ పాత్రల్లో అదరగొట్టేసారు. క్యూట్ గా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా మెప్పించారు. ఈ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. గోవర్ధన్ తండ్రి పాత్రలో బాగానే ఎమోషన్ పండించారు. సునీత మనోహర్, రమేష్, అంజి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also See : Poojitha Reddy : బోన‌మెత్తిన ఇంటింటి గృహలక్ష్మి సీరియ‌ల్ న‌టి.. ఫ్యామిలీతో పండ‌గ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా కలర్ ఫుల్ గా కథకు తగ్గట్టు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి. కథకు తగ్గట్టు లిరిక్స్ బాగా సెట్ అయ్యాయి. పాటలు రిపీట్ మోడ్ లో వినొచ్చు. ఈ సినిమాకు పాటలు చాలా హెల్ప్ అయ్యాయి. విలేజ్ రియల్ లొకేషన్స్ బాగున్నాయి. పాత కథే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ పరంగా కొంత అడల్ట్ కంటెంట్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘హుషార్ పిట్టలు’ సినిమా అడల్ట్ కామెడీతో పాటు ప్రస్తుత సమాజానికి కావాల్సిన మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.