I Nobody Review : ‘ఐ, నో బడీ’ మూవీ రివ్యూ.. వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా.. ఎలా ఉందంటే..?

తన కొత్త సినిమా ఐ, నో బడీ ని తెలుగులో రిలీజ్ చేసారు. (I Nobody Review)

  • Published on- July 9, 2026 / 10:47 PM IST

I Nobody Review

I Nobody Review : మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా తెరకెక్కిన మలయాళ సినిమా ‘ఐ, నో బడీ’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ‘ఐ, నో బడీ’ సినిమా నేడు జులై 9న థియేటర్స్ లో రిలీజయింది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్సపెరిమెంట్స్ బ్యానర్స్ పై సుప్రియ మీనన్, ముకేశ్ R మెహతా, CV సారథి నిర్మాణంలో నిసం బషీర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే..

రాజీవ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఓ మాములు ప్రభుత్వ ఉద్యోగి. తన భార్య మీరా(పార్వతి తిరువొతు) కూడా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమ ఇద్దరు పిల్లలలను చదివిస్తూ ఉంటారు. మీరాకు ఓ బ్యాంక్ మేనేజర్ తో అఫైర్ ఉండటంతో ఈ విషయం తెలిసిన రాజీవ్ అతన్ని భయపెడదామని గన్ తీసుకొని బ్యాంక్ కి వెళ్తాడు. అదే సమయంలో ఓ ముగ్గురు దొంగలు ఆ బ్యాంక్ లోకి వచ్చి 17 కోట్ల రూపాయలు దోచుకొని రాజీవ్ ని కూడా కొట్టి బంధించి తీసుకెళ్తారు. దారి మధ్యలో రాజీవ్ ని కొట్టి పడేసి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి ఆ ముగ్గురు దొంగలు చనిపోతారు. ముగ్గురు చనిపోవడం, రాజీవ్ హాస్పిటల్ లో ఉండటంతో ఆ డబ్బు ఎక్కడుందో ఎవరికీ తెలియదు.

దీంతో ఆ దొంగతనంలో రాజీవ్ కూడా పార్టనర్ అని వాళ్ళను చంపేసి అతనే డబ్బులు దాచేసాడని పోలీసులు, జనాలు నమ్ముతారు. దీంతో కొంతమంది డబ్బులు ఇమ్మని అతన్ని, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పోలీసులు కూడా రాజీవ్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దొంగతనం వల్ల జాబ్ పోయిన ఓ పోలీస్ (హకీమ్ షా) కూడా డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు. జనాలు కూడా ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు అని వెతుకుతూ ఉంటారు. అసలు ఆ 17 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఆ దొంగతనం ఎవరు చేయించారు? ఆ డబ్బులు లేకపోయినా రాజీవ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? రాజీవ్ – మీరా బంధం ఏమవుతుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Jana Nayagan : విజ‌య్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎట్ట‌కేల‌కు జ‌న నాయ‌గ‌న్ సెన్సార్ పూర్తి.. ర‌న్‌టైమ్ ఎంతంటే?

సినిమా విశ్లేషణ..

వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దాంతో తన కొత్త సినిమా ఐ, నో బడీ ని తెలుగులో రిలీజ్ చేసారు. ఒక సామాన్య వ్యక్తి అనుకోకుండా ఓ దొంగతనంలో నిందితుడిగా అందరూ అనుమానిస్తే అతను, అతని కుటుంబం ఎలాంటి ఘర్షణలకు లోనైంది, డబ్బుల కోసం జనాలు ఎలా మారతారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

సినిమా ఓపెనింగ్ లోనే దొంగతనం సీన్, రాజీవ్ ని కట్టి తీసుకెళ్లే సీన్ తో ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత కాసేపు సాగదీసినా ఆ డబ్బుల కోసం జనాలు ఇతన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ ఆసక్తిగా సాగుతాయి. జనాలలో డబ్బుల విషయంలో ఎంత నెగిటివిటీ ఉంది, ఎలా మారిపోతారు అని బాగా చూపించారు. పోలీస్ కూడా డబ్బుల కోసం ఇతని వెనక పడటం నుంచి కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఆశ్చర్యపోతూనే కాస్త నవ్వుకుంటాం కూడా. ఇక సెకండ్ హాఫ్ మొదట్లో ఆ డబ్బు చుటూ కథ ఆసక్తిగా సాగినా ఆ డబ్బుల కోసం కొంతమంది, పోలీసులు రాజీవ్ చుట్టూ పడటం, రాజీవ్ కూతురు కిడ్నాప్.. ఇంట్రెస్ట్ గా ఉన్నా చివర్లో కాస్త సాగదీశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, రాజీకీయాలు, సీఎం దిగి రావడం.. అదంతా సిల్లీగా అనిపిస్తుంది.

సింపుల్ గా ఒక ఫ్యామిలీ వర్సెస్ పోలీసులు, కొంతమంది మనుషుల మధ్య జరుగుతున్న కథని ఒక్కసారిగా స్టేట్ ఇష్యూ చేయడం నమ్మశక్యంగా, రియాల్టీగా అనిపించదు. ఇక క్లైమాక్స్ కూడా సరైన ముగింపు ఇవ్వలేదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొదట్లో, సెకండ్ హాఫ్ చివర్లో కాస్త సాగదీసినా మిగతా అంతా ఆసక్తిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సాగుతుంది. చిన్న కూతురు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఐరా చేసే పనులతో కొన్ని సీన్స్ లో ఫుల్ గా నవ్వుకుంటాం. అంత సీరియస్ సీన్స్ లో కూడా ఆ నవ్వించే సీన్స్ బాగా రాసుకున్నారు. హీరోకి హెల్ప్ చేసే జాకబ్ అనే వ్యక్తి గురించి అతను ఎవరు, అతనికి ఎందుకు డబ్బులు అవసరం అనేది క్లారిటీ ఇవ్వలేదు. డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఎవరి దగ్గరకు ఎలా వెళ్తాయి అనేది మాత్రం ఊహించేయొచ్చు.

రాజీవ్ కుటుంబం మధ్య సరిగ్గా అనుబంధం లేదు అని మొదట్నుంచి చూపించినా దానికి కూడా సరైన ముగింపు ఇవ్వలేదు. కిడ్నాప్ అయిన పాప గురించి కూడా చివర్లో ఏదో ఎమోషన్ చూపిస్తారు అనుకుంటే అది కూడా క్లారిటీ ఇవ్వకుండానే వదిలేసారు. నేను ఎవరికీ ఏమి కాను, ఎవరికీ అక్కర్లేదు అనే ఉద్దేశంలో సామాన్య వ్యక్తికి సమస్యలు వస్తే ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు అనే పాయింట్ తో ఐ, నో బడీ అనే ఈ టైటిల్ పెట్టినట్టు ఉన్నారు. టైటిల్ ఇంకేదైనా పెడితే బాగుండేది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఓ సామాన్య తండ్రి, ఉద్యోగి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ బాగానే నటించారు. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. పార్వతి తిరువొతు భార్యగా, తల్లి పాత్రలో చాలా బాగా నటించింది. ఇద్దరు పిల్లలు నక్షత్ర, ఐరా చక్కగా నటించారు. చిన్న కూతురు పాత్ర చేసిన ఐరా అయితే నవ్విస్తుంది. హకీమ్ షా పోలీస్ పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే నటించాడు. అశోకన్ మంచి పాత్రలో మెప్పించారు. మిగిలిన మలయాళ నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు సౌండ్ డిజైనింగ్, రీ రికార్డింగ్ చాలా ప్లస్ అయింది. చాలా సీన్స్ లో డిటైలింగ్ సౌండ్ తో చాలా పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ అస్సలు బాగోలేవు. మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ లో రెండు హిందీ పాటలు పెట్టడం గమనార్హం. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది.

కొత్త కథ, కథనంతో రాసుకున్నా క్లైమాక్స్ సరిగ్గా రాసుకోలేదు. సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది. చాలా వరకు కేరళలోని ఓ సిటీలో రియల్ లొకేషన్స్ లోనే తెరకెక్కించినట్టి తెలుస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది.

మోతంగా ‘ఐ, నో బడీ’ సినిమా ఓ సామాన్య వ్యక్తి అనుకోకుండా ఆరోపణలు ఎదుర్కొంటే అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అని సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.