Karmakhya Review : ‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ.. జబర్దస్త్ అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉంది..?
Karmakhya Movie Review: సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు.
- Saketh U
- Updated on- July 31, 2026 / 01:25 PM IST
Jabardasth Adhire Abhi Karmakhya Movie Review Rating
Karmakhya Movie Review : సమైరా, సముద్రఖని, అభిరామి, శరణ్య ప్రదీప్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కర్మాఖ్య. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT లిమిటెడ్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మాణంలో జబర్దస్త్ అదిరే అభి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కర్మాఖ్య సినిమా నేడు జూలై 31న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
శక్తిపీఠాల్లో ఒకటైన అస్సాంలోని కామాఖ్య ఆలయం గురించి, అక్కడ తంత్ర విద్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లలో ఓ కుటుంబం ఆంధ్రలోని ఓ గ్రామానికి వలస వస్తారు అని AI విజువల్స్ తో చెప్తారు. ఓ 20 ఏళ్ళ క్రితం ఓ గ్రామంలో చేతబడులు చేస్తున్నారు అని ఓ వ్యక్తి(మధునందన్), ఆమె భార్యని గ్రామస్థులు చంపేస్తారు. దాంతో వాళ్ళ కూతురు చిన్నిని ఎవరో తీసుకెళ్ళిపోతారు.
20 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం.. వైజాగ్ లో ఓ హాస్టల్ లో కామాఖ్య(సమైరా) తన ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రవల్లిక(శరణ్య ప్రదీప్)తో కలిసి ఉంటుంది. కామాఖ్య జాబ్ పోయి ఖాళీగా ఉంటుంది. ఓ రోజు ప్రవల్లిక అర్జెంట్ గా ఊరు వెళ్లాల్సి రావడంతో తన పని కామాఖ్య చేస్తాను అని చెప్తుంది. దాంతో కామాఖ్య ప్రవల్లిక పేరుతో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వైజాగ్ కి దూరంగా ఉన్న ఓ ఇంటికి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురావడానికి వెళ్తుంది. ఆ ఇంట్లో సరోజిని(అభిరామి), తన భర్త(ఆనంద్), తన మతిస్థిమితం లేని కొడుకుతో కలిసి ఉంటుంది. తమ కూతురు ప్రజ్ఞ(ఐశ్వర్య)మరణించడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కామాఖ్యకు ప్రజ్ఞ డాక్యుమెంట్స్ దొరక్కపోవడంతో వెళ్ళిపోతాను అంటే వాళ్ళు భోజనం చేసి వెళ్ళమని, తర్వాత ఇక్కడే ఉండాలి, నిన్ను బలి ఇస్తాం అని భయపెడతారు. కామాఖ్యని కట్టేసి వాళ్ళింట్లోనే బంధిస్తారు. అసలు సరోజిని, ఆ ఫ్యామిలీ ఎవరు? కామాఖ్యని ఎందుకు బలి ఇవ్వాలి అనుకుంటారు? ప్రజ్ఞ ఎలా చనిపోయింది? అక్కడ్నుంచి కామాఖ్య ఎలా తప్పించుకుంది? గతంలో చంపేసిన ఫ్యామిలీ ఎవరు? చిన్ని ఏమైంది? పోలీస్ తిరుపతి(సముద్రఖని)కి ఈ కథకు సంబంధం ఏంటి? ఈ కథకు కామాఖ్య ఆలయానికి లింక్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Newtons 3rd Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ.. సుమంత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంది..?
సినిమా విశ్లేషణ..
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. అస్సాంలోని ఫేమస్ టెంపుల్, శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయంను లీడ్ గా తీసుకొని అదే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు.
మొదట పది నిముషాలు AI విజువల్స్ తో కామాఖ్య టెంపుల్ గురించి, ఓ కుటుంబం గురించి చూపించడం, ఇద్దర్ని గ్రామస్థులు చంపడంతో వాళ్లెవరు అనే ఆసక్తి నెలకొంటుంది. ఆ విజువల్స్ అంతగా మెప్పించవు. ఫస్ట్ హాఫ్ హీరోయిన్, ఆమె ఫ్రెండ్ పాత్రల పరిచయం, లోన్ రికవరీ అంటూ ధనరాజ్ వచ్చి కాసేపు కామెడీతో సాగదీశారు. మధ్యలో పోలీస్ పాత్రతో నిదానంగా నడుస్తుంది. కామాఖ్య సరోజిని ఇంటికి వెళ్లడం, అక్కడ సంఘటనలతో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. కానీ ఇంట్లోనే కొంత సాగదీసి చివర్లో బలి ఇస్తాం అనడంతో అసలు వాళ్ళు ఎవరు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ కామాఖ్యని బంధించడం, బలి కోసం రెడీ చేయడంతో వచ్చే ట్విస్టులు, ఆమె ఎలా తప్పించుకుంది అని ట్విస్టులతో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తితో బాగానే నడిపించారు.
ఫస్ట్ హాఫ్ అక్కర్లేని కామెడీ, కొన్ని సీన్స్ తో సాగదీశారు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఆ ఇంట్లో చోటు చేసుకునే ఘటనలు, ఫ్యామిలీ వాళ్లంతా విచిత్రంగా ప్రరవర్తించడం, అక్కడి నుంచి బయటపడేందుకు కామాఖ్య చేసే ప్రయత్నాలు అన్ని థ్రిల్‌గానే సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఉత్కంఠగా నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి వరుసగా ట్విస్ట్ లు ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు. మొదట గ్రామస్థులు చంపేసిన జంట గురించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి కొంత సాగదీశారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, పోలీస్ తో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. శరణ్య ఇచ్చే ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించరు. 20 ఏళ్ళ క్రితం జరిగిన కథకు, ప్రస్తుతం ఉన్న పాత్రలకు ఇచ్చిన లింక్ చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు కూడా పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. మొత్తంగా చేతబడులు నేపథ్యంలో, ఓ అమ్మాయిని బలి ఇవ్వాలి అనుకుంటే ఏం జరిగింది, ఆమె ఎలా తప్పించుకుంది అని ఆసక్తికర కథనంతో అభినయ కృష్ణ బాగానే తెరకెక్కించాడు. సినిమా సగం వరకు ఒకే ఇంట్లో తీశారు. ఒకే ఇంట్లో అన్ని సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
కామాఖ్య పాత్రలో సమైరా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అంతా బందీగా, అక్కడ నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలలో చాలా బాగా నటించింది. శరణ్య ప్రదీప్ కూడా తన పాత్ర, పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సీనియర్ నటి అభినయ ఈ సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. సముద్రఖని అక్కడక్కడా నవ్విస్తారు. ఆనంద్, ధనరాజ్, మధునందన్, ఐశ్వర్య ఉల్లింగల.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. చివర్లో అదిరే అభి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు మాత్రం అంతగా మెప్పించవు. ఒక సింపుల్ కథ తీసుకొని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో బాగానే రాసి తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం కొన్ని సాగదీసిన సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కర్మాఖ్య’ చేతబడులు నేపథ్యంలో ఓ అమ్మాయి బలి నుంచి ఎలా తపించుకుంది అని ఆసక్తికరంగా తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
