KJQ Movie Review : KJQ (కింగ్ – జాకీ – క్వీన్) మూవీ రివ్యూ.. డైరెక్టర్ మరణించాక రిలీజ్ అయిన సినిమా..
KJQ Movie Review : గతంలో నాగార్జునతో కేడి సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు కేకే చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేసాడు.
- Saketh U
- Updated on- August 7, 2026 / 03:01 PM IST
KJQ King Jackie Queen Review
KJQ Movie Review : దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘KJQ’. కింగ్ – జాకీ – క్వీన్ సబ్ టైటిల్. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో KK(కిరణ్) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. KJQ సినిమా నేడు ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
పార్థ(దీక్షిత్ శెట్టి) ఓ అనాథ. అందరూ తనని చిన్నచూపు చూడటంతో సమాజం మీద ద్వేషం ఏర్పడి ఎలాగైనా బాగా సంపాదించాలి, సిటీని రూల్ చేయాలని తనకు ఎదురు వచ్చిన వాళ్ళందర్నీ తొక్కుకుంటూ పెద్ద రౌడీగా ఎదుగుతాడు. చివరకి సిటీని రూల్ చేసే కమల్ దాస్ కూతురు(రేఖ నిరోషా)ని పెళ్లి చేసుకొని సిటీని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. తను చంపాలనుకున్న SI ని జాకీ చంపడంతో అనాథగా మారిన జాకీ(శశి ఓదెల)ని చేరదీసి తమ్ముడిగా పక్కనే పెట్టుకుంటాడు పార్థ.
ఓ రోజు సినిమా హీరోయిన్ భార్గవి(యుక్తి తరేజా)ని తన పార్టీలో డ్యాన్స్ చేయమని అడిగితే నో చెప్తుంది. దాంతో పార్థ అహం దెబ్బ తిని భార్గవిని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. భర్త ఇంకో అమ్మాయి వెనక తిరుగుతున్నాడని పార్థ భార్య జాకీని హెల్ప్ చేయమని అడుగుతుంది. అదే సమయంలో జాకీ – భార్గవి ముద్దు పెట్టుకున్న ఫోటో లీక్ అవుతుంది. దీంతో అన్నదమ్ములుగా ఉన్న జాకీ – పార్థ మధ్య ఎలాంటి సంఘటనలు నెలకొంటాయి? దీనికి కారణమైన హీరోయిన్ భార్గవి ఎవరు? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? పార్థ ఎలా ఎదిగాడు? అసలు పార్థ, జాకీలు ఎలా అనాథలుగా మారారు.. అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Korean Kanakaraju Review : ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా.. హిట్ కొట్టాడా మరి?
సినిమా విశ్లేషణ..
గతంలో నాగార్జునతో కేడి సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు కేకే చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేసాడు. అయితే సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఉన్నప్పుడు కేకే అనారోగ్య సమస్యలతో మరణించడంతో సినిమా ఆలస్యంగా రిలీజ్ అయింది.
ఫస్ట్ హాఫ్ అంతా మూడు పాత్రల పరిచయాలు, పార్థ – జాకీ ఎలా ఎదిగారు, జాకీ ప్రేమ కథ, పార్థ, జాకీ చేసే దందాలు, పార్థ పెళ్లి సీన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఎంట్రీ, పార్థ అహం దెబ్బ తినడం, జాకీ – హీరోయిన్ ముద్దు ఫోటో బయటకు రావడంతో మంచి బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. చివర్లో హీరోయిన్ కోసం పార్థ – జాకీల మధ్య ఏం జరిగింది? పార్థ జీవితం ఏమైంది అని సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసారు. ఓ అనాథ ఎవరూ పట్టించుకోకపోతే ఎలా ఎదిగాడు అని గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది. అలా ఎదిగిన వ్యక్తి అహంతో ఉంటే ఎలా మారాడు, తన లైఫ్ లో ఏం పోగొట్టుకున్నాడు, మనిషిని అహం ఎలా నాశనం చేస్తుంది అనే మెసేజ్ తో ముగించారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ అందరి ఫ్లాష్ బ్యాక్స్ రొటీన్ కథలే. చాలా సినిమాల్లో చూసేసినవే. అందరి ఫ్లాష్ బ్యాక్స్ కథ నడుస్తున్నప్పుడే ఊహించేయొచ్చు. బోల్డ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కొంత వర్కౌట్ అయ్యాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ లో నెగిటివ్ షేడ్స్ తో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల ఈ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. శశి ఓదెల మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. యుక్తి తరేజా బోల్డ్ గా అందాలు ఆరబోస్తూనే బాగా నటించింది. మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో బాగానే నటించారు. రేఖ నిరోషా పార్థ భార్య పాత్రలో బాగా నటించింది. మణిక చిక్కాల, మీసాల లక్ష్మణ్, సురేఖవాణి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also See : Anshu Selvamani : సంగీత పరికరాల మధ్య రోజా కూతురు.. అమెరికాలో అన్షు సెల్వమణి ఫోటోలు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా స్క్రీన్ ప్లే బాగుంది. కొత్త స్క్రీన్ ప్లేతో సాంకేతికంగా బాగానే తెరకెక్కించారు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా KJQ (కింగ్ – జాకీ – క్వీన్) ఓ ముగ్గురు వ్యక్తులు, వారి జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
