DC Movie Review : ‘డి.సి’ మూవీ రివ్యూ.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?
DC Movie Review : డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, అనిరుధ్ ఇచ్చిన అదిరిపోయే మ్యూజిక్ ముందు నుంచే వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
- Saketh U
- Published on- August 7, 2026 / 04:01 PM IST
Lokesh Kanagaraj DC Review
DC Movie Review : లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డి.సి’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డి.సి సినిమా నేడు ఆగస్టు 7న థియేటర్స్ లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
సర్కార్, దాస్(లోకేష్ కనగరాజ్) మరికొంతమంది కలిసి పోలీస్ ఆయుధాలు దొంగిలిస్తారు. అదే సమయంలో ఈ ఆయుధాలు దొంగతనం కేసు డీల్ చేసే ఆఫీసర్.. కొడుకు చదువు కోసం పొలం అమ్మి డబ్బులు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని చంపి ఆ డబ్బును తీసుకుంటాడు. ప్రశ్నిస్తే అతని భార్యని భయపెడతాడు. పోలీసులే ఇలా చేయడంతో మరణించిన వ్యక్తి భార్య, తండ్రి దాస్ వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకుంటారు. పోలీస్ డబ్బులను వాడేయడంతో దాస్ ఆ పోలీస్ ని చంపి డబ్బులు నేను ఇస్తాను అని ఆ కుటుంబానికి హామీ ఇస్తాడు. పోలీస్ ని చంపడం, పోలీస్ ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో డిపార్ట్మెంట్ ఈ కేసుని డీల్ చేయడానికి భోజ్ రాజ్ అనే ఓ స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తుంది.
దీంతో దాస్, అతని మనుషులు ఓ హోటల్ లో దాక్కోగా అక్కడ పార్వతి(సంజన కృష్ణమూర్తి)ని చూసి ఇష్టపడతాడు దాస్. కానీ హోటల్ పై పోలీసులు దాడి చేసి పార్వతిని చంపి, దాస్ ని అరెస్ట్ చేస్తారు. దాస్ పోలీసుల నుంచి తప్పించుకొని హోటల్ లో తమపై దాడికి కారణం అయిన వ్యక్తిని చంపడానికి ఓ వ్యభిచార గృహానికి వెళ్లగా అక్కడ చంద్ర(వామికా గబ్బి)ని చూడగానే పార్వతి గుర్తొస్తుంది. దీంతో ఆ గృహాన్ని నడిపిస్తున్న అందర్నీ చంపేసి అక్కడ మహిళలను విడిపిస్తాడు. తనకు ఎవరూ లేరు, ఎక్కడకు వెళ్లాలో తెలియదు అని చంద్ర.. దాస్, అతని మనుషులతో వెళ్తుంది. మరి దాస్ ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చాడా? పోలీసులు దాస్, అతని మనుషులను పట్టుకున్నారా? దాస్, చంద్ర ల ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి? దాస్ – చంద్రల మధ్య బంధం ఎలా ఏర్పడుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : KJQ Movie Review : KJQ (కింగ్ – జాకీ – క్వీన్) మూవీ రివ్యూ.. డైరెక్టర్ మరణించాక రిలీజ్ అయిన సినిమా..
సినిమా విశ్లేషణ..
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, అనిరుధ్ ఇచ్చిన అదిరిపోయే మ్యూజిక్ ముందు నుంచే వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇది తమిళ్ సినిమా కాగా తెలుగులోకి డబ్బింగ్ చేసారు. ఓ గ్యాంగ్ ని పట్టుకోడానికి పోలీసులు వాళ్ళ వెంట పడటం, గ్యాంగ్ తప్పించుకోవడం, ఈ క్రమంలో కొంతమంది చనిపోవడం.. ఇదే కథాంశంతో ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. లోకేష్ కనగరాజ్ తీసిన ఖైదీ కూడా ఇదే కథాంశం. ఇప్పుడు డిసి కూడా అదే కోవలోకి చెందిన సినిమా. డిసి టైటిల్ లో డి అంటే దాస్, సి అంటే చంద్ర అని ఇందులోని ఇద్దరు మెయిన్ లీడ్స్.
ఈ కథ అంతా 2011 బ్యాక్ డ్రాప్ లో చూపించారు. ఫస్ట్ హాఫ్ పోలీస్ ఆయుధాల దొంగతనం, పోలీస్ ఓ వ్యక్తిని చంపడంతో కథ మొదలుపెట్టి దాస్, అతని మనుషులు దాక్కోవడం, దాస్ – పార్వతిల సీన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ కి చంద్రని కలవడం, ఆమెని వ్యభిచార గృహం నుంచి తప్పించడం సీన్స్ ఆసక్తిగా సాగి ఇంటర్వెల్ సింపుల్ గానే ఇచ్చినా నెక్స్ట్ వీరి ప్రయాణం ఎటు అని ఓ ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా క్యాట్ – మౌస్ రేస్ లాగా పోలీసులు – దాస్ మనుషులు అన్నట్టు సాగుతుంది.
సినిమా ఎక్కడా బోర్ కొట్టదు కానీ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ప్రేమ కథలు మెప్పిస్తాయి. ఓపెనింగ్ రెండు సీక్వెన్స్ లు బాగుంటాయి. వ్యభిచార గృహంలో లోకేష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోతాయి. సెకండ్ హాఫ్ లో ఛేజింగ్ సీన్స్, దాస్ ని పోలీసులు పట్టుకుంటే పోలీస్ స్టేషన్ పై దాడి, చంద్ర డబ్బులు తీసుకు వచ్చే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఓపెనింగ్ సీన్స్ కి క్లైమాక్స్ సీన్స్ కి లింక్ ఇస్తూ మంచి స్క్రీన్ ప్లే తో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
ఈ ప్రయాణంలో దాస్ ఒక్కొక్కరిని కోల్పోవడం, మరికొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. ఒక ఇంటెన్స్ రా & రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే అసలు దాస్, అతని గ్యాంగ్ ఏం చేస్తారు? ఎందుకు గన్స్ దొంగతనం చేసారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాకు అధికారికంగా ప్రకటించకపోయినా ప్రీక్వెల్, సీక్వెల్ తీసే అవకాశం ఉంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అదరగొట్టేసాడు. ఒక మంచి గ్యాంగ్ స్టర్ లాంటి పాత్రలో తన పర్ఫార్మెన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. వామికా గబ్బి వేశ్య పాత్రలో, తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సంజన కృష్ణమూర్తి క్యూట్ గా కాసేపే కనిపించినా మెప్పిస్తుంది. మిగిలిన తమిళ నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు.
Also Read : Korean Kanakaraju Review : ‘కొరియన్ కనకరాజు’ రివ్యూ.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా.. హిట్ కొట్టాడా మరి?
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. తన కెరీర్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. తన మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టాడు. ఎలివేషన్స్ సీన్స్ కి అనిరుద్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్స్ లో ఆ సీన్స్ బాగా పండాయి.
సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే వావ్ అనిపిస్తాయి. పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ బాగుంది. పాత కథే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. కొన్ని డెప్త్ ఉన్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా డిసి సినిమా ఓ గ్యాంగ్ – పోలీసులకు మధ్య జరిగిన యాక్షన్ క్రైమ్ డ్రామా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ& రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
