Love Oh Love Review : ‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి..
అబ్బాయిలు మీ లవర్స్ తో ఈ సినిమాని కచ్చితంగా చూడండి. (Love Oh Love Review)
- Saketh U
- Updated on- July 11, 2026 / 12:40 AM IST
Love Oh Love Review
Love Oh Love Review : ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలుగమ్మాయి నాగదుర్గ హీరోయిన్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా ‘లవ్ ఓ లవ్’. జినీమా మీడియా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పై దినేష్ రాజ్, ధనంజయన్ నిర్మాణంలో మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా జులై 10న థియేటర్స్ లో రిలీజయింది. సెల్వరాఘవన్, KS రవికుమార్, వనిత విజయ్ కుమార్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే..
రఘు(పవిష్ నారాయణ్) ఓ అమ్మాయిని మోసం చేసి దుబాయ్ పారిపోతున్నాడని పోలీసులకు మహిళా మండలి అధ్యక్షురాలు లేఖ(వనిత విజయ్ కుమార్) కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కుర్చోపెడతారు. దాంతో అతని కథ మొత్తం పోలీసులకు చెప్పడం మొదలుపెడతాడు.
రఘు చూసిన మొదటి చూపులోనే అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమలో పడ్డాక అవంతిక రఘుని సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో అతని డబ్బులని అవజేసి అతను క్రెడి కార్డులు, అప్పులు, లోన్లు తీసుకునేలా చేస్తుంది. రఘు ఏ పరిస్థితుల్లో ఉన్నా అర్ధం చేసుకోకుండా అతన్ని ఆఫీస్ నుంచి రమ్మనడం, ఇబ్బంది పెట్టడం చేసేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని రఘుని ఇంటికి రమ్మని అక్కడ ఓ గొడవపెట్టుకొని తెల్లారి వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఊటీలోనే చేసుకోవాలని పట్టుబడుతోంది. వీరిద్దరూ ఊటీకి వెళ్ళాక అవంతిక తల్లి రఘు అవంతికని కిడ్నాప్ చేసాడని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని స్టేషన్ కి రప్పిస్తుంది.
స్టేషన్ లో అవంతిక తల్లితో వెళ్లిపోవడం, అవంతిక తల్లి రఘు పేరెంట్స్ ని అవమానించడం, అప్పులోళ్లు రఘు మీదకు గొడవకు రావడం, రఘు తల్లి ఆరోగ్యం పాడవడం.. ఇలాంటి సంఘటనలతో ఇంట్లో వాళ్ళు కూడా రఘుని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ కథ అంతా పోలీస్ కి చెప్పి అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలి లేదా ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు అబ్బాయి ప్లేస్ లో ఉండి తనకు చేయాలని అడుగుతాడు రఘు. దీంతో అవంతిక అబ్బాయి ప్లేస్ లో ఉండి రఘుని చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత అవంతిక ప్రేమలో ఒక అబ్బాయిలా ఉండగలిగిందా? రఘులా ఖర్చు పెట్టిందా? రఘులా టైం ఇచ్చిందా? ఈ క్రమంలో తను ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? ప్రేమలో అబ్బాయిల కష్టాలు అవంతికకు అర్ధమవుతాయా? వీళ్ళ ప్రేమ నిలబడుతుందా? రఘు ఫ్యామిలీ మళ్ళీ కలుస్తుందా? అసలు వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Vasudheva Sutham Review : ‘వసుదేవసుతం’ మూవీ రివ్యూ.. పూరి ఆలయం బ్యాక్ డ్రాప్‌లో డివోషనల్ టచ్ తో..
సినిమా విశ్లేషణ..
ధనుష్ మేనల్లుడు రెండో సినిమా, తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగ దుర్గ తమిళ్ లో మొదటి సినిమా హీరోయిన్ గా చేస్తుంది అనడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సినిమా మొదటి సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. హీరోని తీసుకొచ్చి పోలీసులు అతని ఇంటరాగేషన్ మొదలుపెట్టినప్పుడు అతను చెప్పే డైలాగ్ లకి, సినిమా టైటిల్ కార్డ్స్ పడే విధానం చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యి కొత్తగా బాగుంది.
ప్రేమలో పడ్డాక అవంతిక ద్వారా రఘుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అబ్బాయిలు అమ్మాయిల కోసం ఎంతలా ఖర్చు పెడతారు, ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు ఏం ఆలోచిస్తారు, అమ్మాయిలు అబ్బాయిలతో ఎలా ఖర్చు పెట్టిస్తారు? వాళ్ళని ఎలా తిప్పించుకుంటారు.. అనే కొన్ని రియల్ లైఫ్ లలో జరిగే సీన్స్ తో ఫుల్లుగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా నవ్వుకుంటాం. మధ్యలో రెండు పాటలు మాత్రం ఆ నవ్వులకు బ్రేక్ వేస్తాయి.
ఇంటర్వెల్ కి హీరో పెట్టిన రెండు కండిషన్స్ కొత్తగా బాగుంటాయి. హీరోయిన్ రఘులా ఉంటాను అనడంతో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో ఆ అమ్మాయిని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు, హీరో ఖర్చులు, అప్పులు ఆ అమ్మాయి తీర్చిందా, ఆ అమ్మాయి ఎలా తట్టుకుంది, ఒకప్పుడు తను ఎలా ఇబ్బంది పెట్టిందో అవన్నీ కూడా హీరో చేయడం.. వంటి సీన్స్ ఫుల్లుగా నవ్విస్తాయి. అయితే ముందు నుంచి ఊహించినట్టే చివర్లో కథను ఎమోషనల్ గా మార్చేశారు.
అబ్బాయిలు అమ్మాయిలు అని వచ్చే ఇలాంటి సినిమాల్లో చాలా వరకు సినిమా అంతా ఒకవైపు కథ నడిపించి చివరిలో మార్చేస్తారు. దీంతో ఆ సినిమాకు ఉన్న ఫ్లేవర్ పోతుంది. గతంలో కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమా కూడా సినిమా అంతా ఒక క్యారెక్టరైజేషన్ తో నడిపించి చివరలో కథ రివర్స్ చేసేసి హీరోయిన్ వైపు తిప్పేస్తారు. అలా ఈ సినిమాలో కూడా సినిమా అంతా అబ్బాయిల పాయింట్ ఆఫ్ లో రియాల్టీ చూపించి చివర్లో మహిళల మీద ఓ నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ తో మొత్తం కథనే మార్చేశారు. దీంతో సరైన ఎండింగ్ లేదనిపిస్తుంది. ఆ ఎమోషన్ లో రాసుకున్న డైలాగ్స్ కూడా మొదటినుంచి చూపించిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కి అసలు సెట్ అవ్వవు. క్లైమాక్స్ ఇంకోలా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది.
సినిమా అంతా అయ్యాక క్లైమాక్స్ లో మళ్ళీ అనధికారికంగా పార్ట్ 2కి లీడ్ ఇచ్చి నవ్వుకునేలా చేశారు. మొదటి నుంచి తండ్రి ఎమోషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కానీ చివర్లో దాన్ని చూపించకుండానే వదిలేశారు. సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగానే నవ్వించి చివరిలో ఎమోషనల్ టచ్ తో కాస్త సాగదీశారు. అబ్బాయిలు అయితే ఈ సినిమాకి ఫుల్లుగా కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు మీ లవర్స్ తో ఈ సినిమాని కచ్చితంగా చూడండి. హ్యాపీగా నవ్వుకోడానికి ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల పెర్ఫార్మెన్స్..
ధనుష్ మేనల్లుడు పవిశ్ నారాయణ ప్రేమలో బాధలు పడే అబ్బాయి పాత్రలో చాలా బాగా నటించి ఫుల్లుగా నవ్వించాడు. చివర్లో ఎమోషనల్ గా పర్వాలేదనిపించాడు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ మొదటిసారి హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ పాత్రలో సినిమా అంతా కూడా నవ్విస్తూ చివరిలో ఎమోషనల్ గా కూడా బాగానే నటించింది. ఈ సినిమా తర్వాత నాగదుర్గకు హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు రావొచ్చు.
మహిళా మండల అధ్యక్షురాలిగా వనిత విజయ్ కుమార్ అక్కడక్కడ నవ్వించింది. పోలీస్ పాత్రలో సెల్వ రాఘవన్ కూడా బాగానే నటించి అక్కడక్కడ నవ్వించారు. తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ ఒదిగిపోయారు. పవిశ్ ఫ్రెండ్ పాత్రలో చేసిన నటుడు కూడా అక్కడక్కడ బాగానే నవ్వించాడు. మిగిలిన నటీనటులంతా వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Lenin Review : ‘లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా..?
సాంకేతిక విషయాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు యావరేజ్. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడా సరిగా కుదరలేదు. స్క్రీన్ ప్లే ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. లవ్ లో అబ్బాయిలు పడే బాధల్ని రాసుకొని చివర్లో ఎమోషనల్ టచ్ తో సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి కావలసినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘లవ్ ఓ లవ్’ సినిమా ప్రేమలో అబ్బాయిలు పడే బాధల్ని, అమ్మాయిలు వాటిని అర్ధం చేసుకుంటారా అనే కథాంశంతో ఫుల్ గా నవ్విస్తూ చివర్లో ఎమోషనల్ టచ్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
