Mandaadi Review: ‘మండాడి’ మూవీ రివ్యూ.. సుహాస్ విలన్ గా నటించిన సినిమా.. సముద్రంపై పోటీ అదిరిందిగా..
Mandaadi Movie Review: టాలీవుడ్ స్టార్ సుహాస్ తమిళ్ సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
- Saketh U
- Updated on- September 10, 2026 / 01:07 PM IST
Mandaadi Review
Mandaadi Review: సూరి, సుహాస్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలను పోషించారు. మండాడి సినిమా నేడు సెప్టెంబర్ 10న తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
కళింగపట్నంను సట్టపులి(సుహాస్) రూల్ చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో సముద్రంలో జరిగే పడవపోటీలు ఎన్నో ఏళ్లుగా చాలా ఫేమస్. 20 ఏళ్లుగా సట్టపులి సునామి రైడర్స్ టీమ్ తో ఆ ఊరిని గెలిపిస్తూ ఉంటాడు. శ్రీను(రవీంద్ర విజయ్) కొడుకు మల్లేష్(మిథున్ జై శంకర్) పడవల పోటీకి సంబంధించిన ఓ విషయంలో గొడవ జరిగి సట్టపులి కొడుకుపై దాడి చేస్తాడు. అది మిస్ అవ్వడంతో ఓ అమ్మాయి సాయంతో హైదరాబాద్ లో ఉన్న ముత్తు కాళీ(సూరి) దగ్గర తలదాచుకుని ఉంటాడు. ముత్తుకాళీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటూ ఓ స్విమ్మింగ్ పూల్ లో పనిచేస్తూ ఉంటాడు. కానీ సట్టపులి మనుషులు మల్లేష్ ని చంపడానికి అక్కడికి కూడా రావడంతో 20 ఏళ్లుగా ఊరికి వెళ్లని ముత్తుకాళీ మల్లేష్ ని తీసుకొని ఊరికి వస్తాడు. అక్కడ పెద్దలు సట్టపులికి ముత్తుకాళీ మధ్య రాజి కుదర్చాలని ట్రై చేసినా అక్కడ పెద్ద గొడవ అవుతుంది.
దాంతో కళింగపట్నం నుంచి రెండు టీమ్స్ పోటీ చేయాలి ఎవరు ఓడిపోతే వాళ్ళు ఆటని వదిలేయాలి అని నిర్ణయిస్తారు. పోటీకి కొన్ని రోజులు సమయం ఉండటంతో కొత్తవాళ్లకు ముత్తుకాళీ తన కళింగ వారియర్స్ టీమ్ గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సట్టపులి, అతని కొడుకు పోటీ ఎలాగైనా గెలవాలని కుట్రలు పన్నుతూ ఉంటారు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో ముత్తుకాళీ టీమ్ పడవ బోల్తా పడి పోటీలో ఉన్నవాళ్లు హాస్పిటల్ పాలవుతారు. దీంతో కళింగ వారియర్స్ కి పోటీల్లో ఎలా పాల్గొనాలో అర్ధం కాదు. మరోవైపు 20 ఏళ్ళ క్రితం ముత్తుకాళీ ఒకప్పుడు తన తల్లి ఏంజిల్ (మహిమా నంబియార్)ని ప్రేమించిన వ్యక్తి అని తెలిసి మల్లేష్ ముత్తుకాళీ పై కోపంగా ఉంటాడు. అసలు 20 ఏళ్ళ క్రితం ఆ ఊళ్ళో ఏం జరిగింది? బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే సట్టపులి – ముత్తుకాళీ శత్రువులు ఎలా అయ్యారు? ఏంజిల్ – ముత్తుకాళీ ప్రేమ ఎందుకు విఫలమైంది? పోటీలో గెలవడానికి సట్టపులి చేసే కుట్రలు ఏంటి? ఫైనల్ పోటీలో ముత్తుకాళీ టీమ్ గెలుస్తుందా? సముద్రంలో జరిగే సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Maremma Review: ‘మారెమ్మ’ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడు కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఎలా ఉందంటే?
సినిమా విశ్లేషణ..
టాలీవుడ్ స్టార్ సుహాస్ తమిళ్ సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ లో సముద్రంపై పడవల పోటీల విజువల్స్ చూసి సినిమాకు హైప్ వచ్చింది. ఒక ఊరు, అక్కడ జరిగే పోటీలు, గొడవలు, కొన్నేళ్ల క్రితం బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులుగా మారడం, హీరో తిరిగొచ్చి మళ్ళీ పోటీల్లో గెలవడం.. అనేది కొన్ని వందల సినిమాల్లో చూసాం. ఈ మండాడి కథ కూడా అంతే. కానీ కథనం, నేపథ్యం కొత్తగా చూపించి సక్సెస్ అయ్యారు.
ఫస్ట్ హాఫ్ ప్రస్తుతంలో జరుగుతుంది. సట్టపులి పాత్ర పరిచయం, మల్లేష్ దాడి, ముత్తుకాళీ ఎంట్రీ, ప్రాక్టీస్ మ్యాచ్, మల్లేష్ – ఏంజల్ సీన్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లో ప్రమాదం జరగడం.. ఆసక్తికర సీన్స్ తో బాగానే సాగుతుంది. ఇంటర్వెల్ కి సట్టపులి – ముత్తుకాళీ మధ్య గొడవతో అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సముద్రం పై పోటీలు, పడవలు, పడవల బిజినెస్, హీరోకి గురువు – స్నేహితుడు అనే సంఘర్షణ బాగుంది. మధ్యలో ముత్తుకాళీ – ఏంజిల్ లవ్ స్టోరీ కూడా ఓ పాటతో క్యూట్ గా చూపించారు. ముత్తుకాళీ ఊరు వదిలి వెళ్లిపోవడానికి చూపించిన కారణం బాగా సెట్ అయింది. ప్రీ క్లైమాక్స్ లో ఓ ఎమోషన్ సీన్ బాగా పండింది. మనం కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక క్లైమాక్స్ అరగంట సేపు సముద్రంలో పడవల పోటీలు, ముత్తుకాళీ టీమ్ పై సట్టపులి మనుషులు చేసే దాడి, మధ్యలో సుడిగుండం సీక్వెన్స్, చివర్లో ఫైట్ తో చాలా ఆసక్తిగా జరుగుతుంది.
చివరి అరగంట మాత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సముద్రంపై పోటీల సీక్వెన్స్ ని బాగా చూపించారు. అయితే సుడిగుండం సీక్వెన్స్, మధ్యలో ఏంజిల్ ఎంట్రీ కొంత డ్రమాటిక్ అనిపించినా ఆ సస్పెన్స్ కి ఇది కవర్ అయిపోతుంది. ముగింపు ఇంకొంచెం కొనసాగించి తర్వాత ఏం జరిగింది అని చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. అక్కడక్కడా కొంత కామెడీ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. హీరోకి, విలన్ కి ఎలివేషన్స్ బాగా పండాయి. అయితే ఇది తమిళ్ సినిమా కావడంతో తెలుగు డబ్బింగ్ వర్షన్ లో జెర్సీలపై, బోర్డులపై తెలుగు టెక్స్ట్ కనపడటానికి చేసిన గ్రాఫిక్స్ అక్కడక్కడా బాగోలేవు. మధ్యమధ్యలో తమిళ్ పదాలు వస్తూ వెళ్తూ ఉంటాయి. తమిళ సముద్రపు ఒడ్డున తీసిన రూటెడ్ సినిమా మండాడి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు మనకు కమెడియన్ గా తెలిసిన తమిళ నటుడు సూరి గత కొన్నాళ్లుగా సీరియస్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హీరోగా సీరియస్ పాత్రలో బాగానే నటించాడు. రెండు వేరియేషన్స్ లో తన నటనతో మెప్పించాడు. ఇక మన టాలీవుడ్ కుర్రాడు సుహాస్ అయితే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. యువకుడిగా, ఓ 45 ఏళ్ళు పైబడిన వ్యక్తిగా వేరియేషన్ చాలా బాగా చూపించాడు. నెగిటివ్ షేడ్స్ లో తన పర్ఫార్మెన్స్ తో సుహాస్ మరోసారి మెప్పించాడు. ఈ సినిమాతో సుహాస్ కి తమిళ్ లో మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.
మహిమ నంబియార్ గ్రామీణ యువతి పాత్రలో చాలా బాగా మెప్పించింది. సెకండ్ హాఫ్ లో రెండు ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. రవీంద్ర విజయ్ హీరో ఫ్రెండ్ పాత్రలో బాగానే మెప్పించారు. సత్యరాజ్ గురువు ముని పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిథున్ జై శంకర్ మల్లేష్ పాత్రలో బాగానే మెప్పించాడు. క్రిష్ హాసన్, బాల శరవణన్, రామచంద్రన్ దురై రాజ్.. మిగిలిన తమిళ నటీనటులు అంతా బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. అసలు సముద్రంలో సీన్స్, ఆ విజువల్స్, పోటీలకు సంబంధించిన సీక్వెన్స్ కోసం సినిమాటోగ్రాఫర్ చాలా కష్టపడ్డాడు అని తెలుస్తుంది. రియల్ సముద్రంలో పోటీలో ఉన్న పడవలు కవర్ చేస్తూ హీరో, విలన్ పడవలను చూపిస్తూ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎడిట్ లో కట్ చేసి ఉంటే బాగుండేది. సముద్రం పక్కన సెట్స్, జాలర్ల వస్తువులు, పడవలు.. వీటన్నిటి కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. పాత కథే తీసుకున్నా కొత్త నేపథ్యం, కథనంతో సముద్రపు ఒడ్డున బాగా రాసుకొని సాంకేతికంగా కూడా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘మండాడి’ సముద్రంపై పడవల పోటీలతో ఆసక్తికరంగా సాగిన ఎమోషనల్ సస్పెన్స్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
