Objection My Lord Review : ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది?

శ్రీకాంత్ మెయిన్ లీడ్ గా ఈ అబ్జెక్ష‌న్ మై లార్డ్‌ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్స్ గా చిత్రీకరించారు. (Objection My Lord Review)

  • Published on- July 31, 2026 / 05:24 PM IST

Objection My Lord Review

Objection My Lord Review : శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాణంలో సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ నేడు జులై 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. స్నేహాల్‌ కామత్, స‌మీర్, షర్మిల హారిక, జెమిని సురేష్, రాయల హరిశ్చంద్ర, అప్పాజీ అంబరీష్.. పలువురు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే..

పరుశురాం(శ్రీకాంత్) ట్యాలెంటెడ్ లాయర్ అయినా కేసులు వాదించడం మానేసి కొన్నేళ్లుగా నోటరీలు చేసుకుంటూ ఉంటాడు. అసలు అతను కోర్ట్ లోపలికి వెళ్ళడానికి కూడా భయపడతాడు. అతని పేరు చెప్తే వేద(అనన్య శర్మ)ని ఏ లాయర్ జూనియర్ గా చేర్చుకోరు. ఓ రోజు నారాయణ అనే వ్యక్తి కోర్ట్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పరుశురాం అప్పుల్లో ఉంటాడు. తనొక ఫెయిల్యూర్ లాయర్ ని ఇంట్లో పిల్లలు అనడం, వేద కూడా పరుశురాం కేసులు ఎందుకు తీసుకోవట్లేదు, నారాయణ కేసు మీరు కూడా తీసుకోలేదు అందుకే చనిపోయాడు అని ఫైర్ అవ్వడంతో పరుశురాం నారాయణ కేసుని కోర్టులో ప్రజాహితం కేసుగా వేస్తాడు.

నారాయణ తన కూతురు సమీరా కిడ్నాప్ అయింది అని టైపు చేయించిన పిటిషన తప్ప పరుశురాం దగ్గర ఎలాంటి అధరాలు ఉండవు. అసలు నారాయణ ఎవరో ఏంటో కూడా తెలియదు. అయితే ఈ కేసుకి బాగా పాపులర్ లాయర్ విశ్వనాధ్ ప్రభుత్వం తరపున పరుశురాం కి వ్యతిరేకంగా వాదించడానికి వస్తాడు. విశ్వనాధ్ కి సంబంధం లేని ఇలాంటి కేసుకి రావడంతో పరుశురాంకి అనుమానమొస్తుంది. దీంతో నారాయణ సమాచారం, సమీరా గురించి పరుశురాం, వేద కలిసి వెతుకులాట మొదలుపెడతారు. నారాయణ ఓ మెంటల్ హాస్పిటల్ లో 18 ఏళ్ళు ఉండి రిలీజయి వచ్చాడని తెలియడంతో పరుశురాం షాక్ అవుతాడు. అసలు ఈ నారాయణ ఎవరు? సమీరా ఎవరు? సమీరా ఎక్కడుంది? ఎవరు కిడ్నాప్ చేసారు? పాపులర్ లాయర్ విశ్వనాధ్ ఎందుకు ఈ కేసు వాదించడానికి వస్తాడు? చాలా ఏళ్ళ తర్వాత కేసు తీసుకున్న పరుశురాం గెలుస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..

Also Read : Karmakhya Review : ‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ.. జబర్దస్త్ అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉంది..?

సిరీస్ విశ్లేషణ..

శ్రీకాంత్ మెయిన్ లీడ్ గా ఈ అబ్జెక్ష‌న్ మై లార్డ్‌ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్స్ గా చిత్రీకరించారు. చిరంజీవి ఈ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోట్ చేయడంతో సిరీస్ పై ఆసక్తి నెలకొంది. ఒక వ్యక్తి కోర్ట్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడంతో కథ మొదలవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ అంతా నారాయణ, వేద పాత్రల పరిచయం చేస్తూ సాగదీసి చివర్లో ఓ మోటివేషన్ తో పరుశురాం కేసు తీసుకోవడంతో ఆసక్తి నెలకొంటుంది. ఆ తర్వాత మూడు ఎపిసోడ్స్ కోర్ట్ లో విచారణలు, వాదనలు, నారాయణ, సమీరాల సమాచారం కోసం వెతుకులాటతో సింపుల్ గా సాగుతుంది. ఇవేవి అంత ఆసక్తిగా ఉండవు. రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్, పోలీస్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ లాగానే సాగుతాయి. ఐదో ఎపిసోడ్ నుంచి కథ ఆసక్తిగా నడుస్తుంది. కేసులో సాక్ష్యాలు రావడం, నారాయణ, సమీరా ఎవరు అని తెలియడం, ఈ క్రమంలో పరుశురాం, వేదలకు ఎదురయ్యే ఇబ్బందులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆరో ఎపిసోడ్ దాకా సమీరా అసలు ఎవరు? ఎలా ఉంటుంది చూపించకపోవడం చాలా ప్లస్ అయింది.

కోర్టులో వాదనలు, ప్రతివాదనలతో రక్తి కట్టించొచ్చు కానీ సింపుల్ గానే రాసుకున్నారు. సాక్షాలను విచారించడం కూడా సింపుల్ గానే ఉంటుంది. చివర్లో పరుశురాం దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ లు ఉన్నా వాటిని బయటపెట్టకుండా, తీసుకురాలేక మాములు ఎవిడెన్స్ లతో, ఎమోషనల్ డైలాగ్స్ తో ముగించడం సింపుల్ గా ఉంటుంది. పరుశురాం, వేద కేసు గురించి చేసిన రీసెర్చ్ బాగున్నా ఆ రీసెర్చ్ ని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. కిడ్నాప్ కేసు, అసలు సమీరా ఉందో లేదో అనే దగ్గర్నుంచి చివరకు ఇదొక రేప్ కేసుగా మారడం, కేసులో సమాజంలో పేరున్నవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడంగా మారి రొటీన్ ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చారు.

ఇక పరుశురాం ఎందుకు కేసులు వదిలేసాడు అనే ఫ్లాష్ బ్యాక్ సింపుల్ గా ఒక్క సీన్ తో తేల్చేసారు. అయితే సెక్షన్ లు, చట్టంపై దర్శకుడు చేసిన రీసెర్చ్ బాగుంది. అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కో సెక్షన్, అది ఎందుకు చాలా బాగా వివరించారు. ఈ సిరీస్ లో కోర్టులోనే కాకుండా బయట కూడా అనేక సెక్షన్ లు ప్రస్తావించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొదటి నాలుగు ఎపిసోడ్స్ కాస్త ఫార్వార్డ్ చేసుకుంటూ సిరీస్ చూసేయొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామాలు ఆసక్తి ఉన్నవారు ఈ సిరీస్ చూడొచ్చు. ఇక ఈ సిరీస్ కి ముగింపు ఇవ్వకుండా ఆ కేసు ఇంకా క్లోజ్ కాకుండానే సిరీస్ పూర్తి చేసారు. సీజన్ 2కి లీడ్ ఇచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

మెయిన్ లీడ్ లో నోటరీ పరుశురాంగా శ్రీకాంత్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాగా నటించి మెప్పించారు. ఒకప్పుడు విలన్ పాత్రలు చేసిన ముకేశ్ రిషి చాన్నాళ్లకు ఇలా లాయర్ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు. యూట్యూబ్ సిరీస్ లు, పలు సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య శర్మ పవర్ ఫుల్ లేడీ జూనియర్ లాయర్ గా అదరగొట్టింది.

స్నేహాల్ కామత్ ఎమోషనల్ పాత్రలో మెప్పించింది. రాయల హరిశ్చంద్ర నారాయణ పాత్రలో ఎమోషనల్ గా మెప్పించాడు. స‌మీర్, షర్మిల హారిక, జెమిని సురేష్, అప్పాజీ అంబరీష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Newtons 3rd Law Review : ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ.. సుమంత్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంది..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఫస్ట్ నాలుగు ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్. ఎవరో ఏంటో తెలియని ఆసక్తికర కేసుని తీసుకొని మంచి స్క్రీన్ ప్లే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ కేసులు వదిలేసిన ఓ లాయర్ ఎవరు తీసుకొని, ఎలాంటి ఆధారాలు, సమాచారం లేని కేసుని తీసుకొని ఎలా గెలిచాడు అని కాస్త సాగదీస్తూ కాస్త ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.