Irumudi Review: ‘ఇరుముడి’ మూవీ రివ్యూ.. స్వామియే శరణం అయ్యప్ప.. ఏడిపించేశారుగా..
Irumudi Movie Review: రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన సినిమా 'ఇరుముడి' ఈ సినిమా నేడు ఆగస్టు 21న థియేటర్లలో రిలీజయింది.
Ravi Teja Irumudi Review Rating Movie Cast Nakshatra Priya Bhavani Shankar Shiva Nirvana
Irumudi Review: రవితేజ, ప్రియా ప్రియా భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర, సాయి కుమార్, శ్వాసిక, అజయ్ ఘోష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇరుముడి సినిమా నేడు ఆగస్టు 21న థియేటర్లలో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
త్రినాథ్(రవితేజ) తన భార్య కావేరి(ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ(నక్షత్ర)తో కలిసి సీలేరు దగ్గర ఓ గ్రామంలో అరటిపళ్ళ బిజినెస్ చేస్తూ బతుకుతుంటాడు. కూతురంటే తనకు పిచ్చి ప్రేమ. రోజూ మందు తాగుతూ ఉంటాడు. కానీ కూతురు కోసం ప్రతి సంవత్సరం తన గురుస్వామి(సాయి కుమార్) దగ్గర అయ్యప్ప మాల వేసుకొని చాలా నిష్టగా ఉంటాడు. అయితే ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా, ఏ ఆడపిల్లను ఏడిపించినా అందరు తన కూతుళ్లు లాంటివాళ్లే అని నమ్మి ఏడిపించేవాళ్ళని కొడుతూ గొడవలు పెట్టుకుంటాడు. దీంతో త్రినాథ్ కి చాలామంది శత్రువులు తయారవుతారు.
త్రినాథ్ మణికంఠని సీలేరు హై స్కూల్ లో చేర్పిస్తాడు. ఆ స్కూల్ లో ఆడపిల్లలు చనిపోవడం, మణికంఠకు తెలిసిన అమ్మాయి స్కూల్ మానేయడం, స్కూల్ టీచర్ ధనలక్ష్మి చాలా స్ట్రిక్ట్ గా ఉండటం, ఆమె వల్ల ఆడపిల్లలు ఇబ్బంది పడటం.. లాంటి సంఘటనలు జరుగుతాయి. మణికంఠ బయట ఏం జరిగినా తండ్రికి చెప్పడం అలవాటు. మరి మణికంఠకి తెలిసిన నిజాలు ఏంటి? మణికంఠ తండ్రికి చెప్తుందా? టీచర్ ధనలక్ష్మి ఏం చేస్తుంది? త్రినాథ్ అయ్యప్ప మాల వేస్తే అతనిపై దాడి చేద్దామని ఎదురుచూస్తున్న శత్రువులు ఏం చేస్తారు? త్రినాథ్ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read – Irumudi : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్నికోట్లు కలెక్ట్ చేయాలి..?
సినిమా విశ్లేషణ..
రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో అయ్యప్ప స్వామి ఫేమస్ సాంగ్ మల్లెపూల పల్లకి ఉండటం, దాంతో పాటు మరో అయ్యప్ప స్వామి సాంగ్ ఉండటం, ట్రైలర్ కూడా కొత్తగా బాగుండటం, వేరే సాంగ్స్ కూడా రిలీజయి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ నెలకొని ముందు నుంచి భారీ హైప్ నెలకొంది.
ఫస్ట్ హాఫ్ అందమైన ఊరు, అందమైన కుటుంబం, తండ్రీకూతుళ్ల అనుబంధంతో, త్రినాథ్ రెగ్యులర్ గా మందు తాగడం, అయ్యప్ప మాల వేసి రావడం.. ఇలా హాయిగా సాగుతుంది. మణికంఠ ఊళ్ళో జరిగిన సంఘటనలు తండ్రికి చెప్పడం త్రినాథ్ వెళ్లి కొట్టే సీన్స్ తో ఆసక్తిగా నడుస్తుంది. మరోవైపు కొంతమంది అమ్మాయిలు ఇబ్బందిపడటం, స్కూల్ సీన్స్ తో ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇంటర్వెల్ లో ఓ వ్యక్తి చనిపోవడంతో ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ షాట్ కూడా బాగుంది. దాంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మల్లెపూల పల్లకి సాంగ్, దాని వెంటనే వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయింది అనిపిస్తుంది. ఆ తర్వాత కథ ఒక్కసారిగా మలుపులు తిరగడం, ఆడపిల్ల అనే ఎమోషన్ మీద సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించలేము. ఒక విలన్ ని మాత్రం ముందే ఊహించేయొచ్చు. క్లైమాక్స్ అయితే ఏడ్చేస్తాము.
అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి డీజే సాంగ్ తో వచ్చే ఛేజింగ్ సీన్ అదిరిపోతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. సినిమా మొత్తం ఓ మూడు నాలుగు సీన్స్ లో కన్నీళ్లు పెడతారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని మెసేజ్ ని చాలా చక్కగా చూపించారు. అయితే ఆ అమ్మాయిల సంబంధించిన సీన్స్ కొంత ఇబ్బందిగా, హార్డ్ హిట్టింగ్ గా అనిపించవచ్చు కొంతమందికి. అయితే ఊళ్ళో ఇన్ని జరుగుతున్నా పోలీసులు ఆ ఊళ్ళో ఉండరా అనే ఓ లాజిక్ సందేహం కలుగుతుంది.
అయ్యప్ప మాలలో ఉన్న 41 రోజులు మాత్రమే మందు మానేయడం కాదు, మందు తాగితే తెలియకుండానే జరిగే నష్టాలను ప్రస్తావించారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. కానీ చివర్లో మణికంఠ పాత్ర చెప్పిన ఒక్క డైలాగ్ తో సినిమా పరిపూర్ణం అయింది అనే ఫీల్ వస్తుంది. ఇటీవల సినిమా థియేటర్స్ నుంచి ఏడుస్తూ బయటకువచ్చిన సినిమాలు రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏడుస్తూ బరువైన హృదయంతో బయటకు వస్తారు. పల్లెల్లో, బి, సి సెంటర్స్ లో సినిమా బాగా ఆడుతుంది. మహిళలు, అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు, కూతుళ్లు ఉన్న తండ్రులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. అయితే కమర్షియల్ గా చూస్తే ఈ సినిమాని కార్తీక మాసం, అయ్యప్ప మాల సీజన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ హైప్, రీచ్ వచ్చేది. చాన్నాళ్ల తర్వాత రవితేజ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
రవితేజ చాన్నాళ్ల తర్వాత తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. కామెడీ, ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్నిట్లో మెప్పించాడు రవితేజ. ఇక అయ్యప్ప మాలలో అయితే నిజం అయ్యప్ప మాల వేసిన భక్తుడిలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో, ఒక మాములు వ్యక్తిగా, బాగా మందు తాగే వ్యక్తిగా చాలా బాగా నటించాడు. చాన్నాళ్ల తర్వాత రవితేజ ఎమోషన్ ని పండించాడు. ఇది కదా మన రవితేజ అని ఫ్యాన్స్ అనుకోవడం ఖాయం. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర చాలా బాగా చేసింది. మలయాళం పాప అయినా తన పర్ఫార్మెన్స్ తో తెలుగు డబ్బింగ్ చెప్పి మరీ మెప్పించింది. రవితేజ – నక్షత్ర తండ్రీకూతుళ్ల బంధం అందర్నీ అలరిస్తుంది. నక్షత్ర ప్రేక్షకులను ఏడిపిస్తుంది.
ప్రియా భవాని శంకర్ మిడిల్ క్లాస్ గృహణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. గురుస్వామిగా సాయికుమార్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. అచ్చం ఊళ్ళల్లో గురుస్వాములను చూసినట్టే ఉంటుంది. శ్వాసిక నెగివె షేడ్స్ లో టీచర్ పాత్రలో బాగానే మెప్పించింది. ఇన్నాళ్లు నవ్వించిన జబర్దస్త్ కొమరం కొత్తగా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టేసాడు. ఈ సినిమా తర్వాత కొమరంకు కూడా మంచి పాత్రలు వస్తాయి. చైల్డ్ ఆర్టిస్ట్ లాస్య కూడా మంచి ఎమోషన్ పండించింది. కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ లోకేష్ కి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. అజయ్ ఘోష్, రమణ భార్గవ్, మహేష్, లక్ష్మణ్ మీసాల, MLA పాత్రలో నటించిన నటుడు.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Irumudi Censor Review: ‘ఇరుముడి’ సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్..
సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. గోదావరి, కేరళ లాంటి అందమైన లొకేషన్స్ ని సీలేరులో పట్టుకొని అక్కడ ప్రకృతిలో అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించారు. అయ్యప్ప స్వామి గుడి, బ్రిడ్జ్, డ్యామ్, అడవులు, అరటి తోటలు.. ప్రతిదీ సన్నివేశాలకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది విజువల్స్ చూస్తుంటే.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. మూడు అయ్యప్ప స్వామి పాటలతో థియేటర్స్ హోరెత్తుతాయి. మల్లెపూల పల్లకి సాంగ్, ఆ వెంటనే వచ్చే డీజే వర్షన్ తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. పాత క్రైమ్ కథే అయినా అయ్యప్ప స్వామి పాయింట్ ని జత చేసి చాలా కొత్త కథనంతో ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ఇరుముడి’ తన కూతురు, ఊళ్ళో ఆడపిల్లల కోసం నిలబడే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కథ అయ్యప్ప స్వామి మాలతో యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ సినిమాగా మెప్పిస్తుంది. ఈ సినిమాకు 3.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
