Secret Soldier Review : ‘సీక్రెట్ సోల్జర్’ రివ్యూ.. దేశభక్తుడిని ఉగ్రవాది అంటే ఏం చేసాడు..?
సీక్రెట్ సోల్జర్ సినిమా నేడు సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది. (Secret Soldier Review)
- Saketh U
- Published on- September 18, 2026 / 03:41 PM IST
Secret Soldier Review
Secret Soldier Review : నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీశ నూలు, హర్షిత.. పలువురు కీలక పాత్రలు పోషించారు. సీక్రెట్ సోల్జర్ సినిమా నేడు సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
ఇండియాకు సంబంధించిన కొన్ని సీక్రెట్ కోడ్స్ జనరేట్ చేసే ఒక డిస్క్ మిస్ అవుతుంది. శత్రుదేశాలు మన సైన్యాన్ని చంపడానికి ఓ దాడి కోసం హనీ ట్రాప్ తో ఈ పని చేయిస్తాయి. ఇందులో ఉగ్రవాది మీరా వలి (నిహాల్ కోదాటి) హస్తం కూడా ఉందని తెలుస్తుంది. అతని గురించి ఆరా తీస్తే ఒకప్పుడు నెల్లూరులో పృథ్వీ(సూర్య శ్రీనివాస్) తో తిరిగాడని తెలుస్తుంది. దీంతో ఇంటిలిజెన్స్ వాళ్ళు పృథ్వీని లాక్కొచ్చి మీరా వలి గురించి అడగడంతో వాళ్ళిద్దరి స్నేహం గురించి చెప్తారు.
మీరా వలి, పృథ్వీ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకపుడు మీరా వలి తన ప్రాణం కాపాడాడు అని మరింత కృతజ్ఞతగా ఉంటాడు. మీరా వలికి డబ్బు పరంగా, అన్నిట్లో సపోర్ట్ చేస్తూ ఉంటాడు పృథ్వీ. కానీ అతను ముస్లిం అని కొంతమంది దేశభక్తి లేదనడంతో మీరా వలి ఎప్పటికైనా ఇండియన్ ఆర్మీలో చేరాలి అనుకుంటాడు. ఓ ఘటనతో మీరా వలి స్పైగా మారి TAW (థ్రెట్ అనాలసిస్ వింగ్) ఏజెన్సీలో చేరి దేశం కోసం పని చేయాలి అనుకుంటాడు. అనుకోకుండా సరదాగా చేసిన ఓ పనితో మీరావలి పై టెర్ర*రిస్ట్ అనే ముద్ర పడటంతో నెల్లూరులో అందరూ అతన్ని టెర్ర*రిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. దాంతో మీరా వలి హైదరాబాద్ వెళ్లిపోయాడని, అప్పట్నుంచి తనకు కాంటాక్ట్ లో లేడు అని చెప్తాడు పృథ్వీ. దేశభక్తుడు, స్పై గా మారాలి అనుకున్న మీరా వలి ఎందుకు టెర్ర*రిస్ట్ గా మారతాడు? దేశానికి ద్రోహం ఎందుకు చేయాలనుకుంటాడు? అసలు మీరా వలి ఏం చేసాడు? అతని లైఫ్ లో ఏం జరిగింది? సీక్రెట్ కోడ్స్ ఇచ్చే డిస్క్ దొరుకుతుందా? శత్రుదేశాల నుంచి ఇండియా ఆర్మీని కాపాడతారా? స్నేహితుడు కోసం పృథ్వీ ఏం చేస్తాడు.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
స్పై జానర్ లో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. చాలా వరకు స్పై సినిమాలు అంటే యాక్షన్, ఆర్మీ, రా సంస్థలు అంటూ సాగుతాయి. ఈ సీక్రెట్ సోల్జర్ సినిమా మాత్రం స్పై డ్రామాగా స్నేహం, దేశభక్తి అంశాలతో సాగుతుంది. మొదట చైనా పీస్ అనే టైటిల్ తో మొదలయి ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా తర్వాత సెన్సార్ అభ్యంతరాలతో సీక్రెట్ సోల్జర్ అనే టైటిల్ మార్చుకున్నారు. టైటిల్ మార్పుతో చేసిన ప్రమోషన్స్ వల్ల ఈ సినిమాపై కాస్త బజ్ అయితే నెలకొంది.
ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఇండియాకు ఏదో నష్టం జరగబోతుంది అనే ఆసక్తి కలిగించి, హనీ ట్రాప్ చూపించి ఇంటిలిజెన్స్ టీమ్ దీని గురించి చర్చ చేయడంతో సాగుతుంది. పృథ్వీ ఎంట్రీతో ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి వీళ్ళ స్నేహం, మీరావలి ఎదుర్కునే సంఘటనలతో కామెడీగా, సింపుల్ గా సాగదీశారు. ఇంటర్వెల్ కి ఇచ్చే ఓ బ్యాంగ్ తో అసలు ఏం జరిగింది? మీరావలి ఏం చేసాడు అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా మీరా వలి హైదరాబాద్ వచ్చాక జరిగే సంఘటనలు, అనుకోకుండా TAW ఎంట్రీ, ఓ మిషన్ కోసం మీరా వలిని స్పై గా మార్చడం, దేశ వ్యతిరేకుల వద్ద మీరా వలి పనిచేయడం, మిస్ అయిన డిస్క్ చుట్టూ కథ ఆసక్తిగా తిరుగుతుంది. క్లైమాక్స్ ట్విస్టుల మీద ట్విస్టులతో ఆ డిస్క్ ని కాపాడి, సీక్రెట్ కోడ్స్ తో ఇండియాని కాపాడే రొటీన్ గానే ముగించారు.
ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. అసలు కథలోకి వెళ్లకుండా మీరా వలి, పృథ్వీ స్నేహం కోసం ఎక్కువ సీన్స్ తీసుకున్నారు. మీరా వలి చేసే ప్రయత్నాల్లో అక్కర్లేకపోయినా కామెడీ సీన్స్ ట్రై చేసారు. అసలు ఓ బిచ్చగాడిని టెర్రరిస్ట్ అనుకోని పోలీసులు అరెస్ట్ చేయడం, అతను బిచ్చగాడు అని తెలిసి అతని బదులు మీరా వలిని టెర్రరిస్ట్ అని పోలీసులు చెప్పే లాజిక్ లేని సీన్స్, అది పట్టుకొని ఊరంతా అతన్ని టెర్ర*రిస్ట్ అని పిలిచే సీన్స్ చూస్తే కామెడీ లేకపోయినా నవ్వొస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగించారు. సెకండ్ హాఫ్ లో స్పై జీవితాలు రియల్ గా ఎలా ఉంటాయి అని సినిమాటిక్ గా కాకుండా కాస్త రియాల్టీగా చూపించి సక్సెస్ అయ్యారు. దేశవ్యతిరేకులు, TAW సంస్థ, ఇంటిలిజెన్స్ అధికారులు, మీరా వలి.. ఇలా అందరి మధ్య సీన్స్ నడిపిస్తూ చివరకు వచ్చేసరికి ఎవరు ఎవరి వైపు పనిచేస్తున్నారో అర్ధం కానీ ఓ కన్ఫ్యూజన్ లో పడేసారు. అంతమంది మనుషులు వేరియేషన్స్ చూపిస్తే ట్విస్టులు వర్కౌట్ అవుతాయి అనుకున్నారు కానీ అవ్వలేదు. గూఢచారులు ఎంత కష్టపడినా వాళ్లకు గుర్తింపు రాదు అనే ముగింపు సీన్స్ బాగున్నాయి. ఆ రకంగా టైటిల్ జస్టిఫికేషన్ రాయితీ ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
నిహాల్ కోదాటి మెయిన్ లీడ్ లో అదరగొట్టాడు అని చెప్పొచ్చు. రెండు వేరియేషన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సూర్య శ్రీనివాస్ కూడా బాగానే మెప్పించాడు. శ్రీశ నూలు, హర్షితలు వారి పాత్రల్లో బాగానే నటించి మెప్పించారు. కమల్ కామరాజు యాంగ్రీ ఆఫీసర్ గా బాగానే నటించారు. రఘుబాబు ఓ గెస్ట్ పాత్రలో కామెడీ పండించే ప్రయత్నం చేసారు. మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ తిరందాస్, వినోద్ సాగర్, దీక్ష పంత్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. స్పై కథకు తగ్గట్టు డార్క్ కలర్ ప్యాలెట్ తో మంచి విజువల్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. కొన్ని AI విజువల్స్, గ్రాఫిక్స్ ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇవ్వాల్సింది. స్పై కథని కొత్తగా స్నేహం, దేశభక్తి పాయింట్స్ లో బాగానే రాసుకొని క్లైమాక్స్ లో కాస్త కన్ఫ్యూజ్ అయినా సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సీక్రెట్ సోల్జర్’ అందరితో ఉగ్రవాది అనిపించుకున్న హీరో దేశం కోసం ఏం చేసాడు అని స్నేహం, దేశభక్తి కాన్సెప్ట్ తో స్పై డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
