Spider Man: Brand New Day Review : ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ.. ఈసారి స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు..?
Spider Man: Brand New Day Review : స్పైడర్ మ్యాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.
- Saketh U
- Updated on- July 30, 2026 / 07:11 AM IST
Spider Man Brand New Day Review
Spider Man: Brand New Day Review : టామ్ హాలెండ్, జెండ్యా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కన సినిమా స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వంలో మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. 2021 లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నేడు జులై 31న రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
గత సినిమాలో స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్(టామ్ హాలెండ్) తన అత్త మే పార్కర్ చనిపోవడంతో తనే స్పైడర్ మ్యాన్ అనే జ్ఞాపకాలని అందరిలో చెరిపేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ ఎంజే(జెండ్యా), ఫ్రెండ్ నెడ్(జాకబ్ బాటాలాన్) కూడా మర్చిపోయేలా చేసి ఒంటరిగా బాధపడుతూ బతుకుతూ ఉంటాడు. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని అందరూ మర్చిపోయినా తను మాత్రం ఓ పోలీస్ మహిళా అధికారికి టచ్ లో ఉంటూ న్యూయార్క్ ని పలు నేరాల నుంచి కాపాడుతూనే ఉంటాడు.
ఓ రోజు న్యూయార్క్ డ్యామేజ్ కంట్రోల్ సిస్టమ్ పై ఎవరో దాడి చేసి జైలులో ఉన్న స్కార్పియన్(మైఖేల్ మాండో) తప్పించుకునేలా చేస్తారు. ఆ తర్వాత కూడా ఓ అజ్ఞాత వ్యక్తి పలు మార్లు స్పైడర్ మ్యాన్ ని హెచ్చరించడం, డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ పై దాడి చేయడం చేస్తారు. V మ్యాక్స్ అనే దాన్ని వెతుకుతూ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ పై దాడి చేస్తున్నారని తెలుస్తుంది. అదే అజ్ఞాత వ్యక్తి స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ ఎంజే పై దాడి చేస్తానని చెప్పడంతో తనని కాపాడటానికి ప్రయత్నిస్తాడు స్పైడర్ మ్యాన్. ఈ క్రమంలో ఫ్రాంక్(జాన్ బెర్న్తాల్) సాయం అడుగుతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి మనుషుల మైండ్స్ లోకి దూరే జేన్ గ్రే(సాదీ సింక్) అని తెలుస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ హెడ్ బిల్ మెట్జర్ జేన్ గ్రే ని పట్టుకోడానికి స్పైడర్ మ్యాన్ సహాయం అడుగుతాడు. మరి స్పైడర్ మ్యాన్ జేన్ గ్రే ని పట్టించాడా? ఎంజే, నెడ్ లకు కి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయా? అసలు జేన్ గ్రే ఎవరు? అసలు V మ్యాక్స్ ఏంటి? దాని కోసం ఎందుకు వెతుకుతున్నారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Jaya Krishna Ghattamaneni : గురువారం మూవీ రిలీజ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జయకృష్ణ ఘట్టమనేని
సినిమా విశ్లేషణ..
స్పైడర్ మ్యాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయిదేళ్ల తర్వాత మళ్ళీ స్పైడర్ మ్యాన్ సినిమా వస్తుండటంతో దీనిపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. గత సినిమాలో అందరూ స్పైడర్ మ్యాన్ జ్ఞాపకాలు మర్చిపోవడంతో ఈ సినిమా అక్కడనుంచే మొదలవుతుందని ప్రమోట్ చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది.
స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ ని కాపాడటానికి అనేక ఫీట్స్ చేసే సీన్స్ తోనే సినిమా మొదలవుతుంది. సీక్రెట్ గా ఎవరికీ తెలియని ఓ ప్లేస్ లో ఉండి స్పైడర్ మ్యాన్ న్యూయార్క్ ని కాపాడుతుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎంజే, నెడ్ లను కలిసే ప్రయత్నాలు చేసినా వాళ్లకు ఇతను ఎవరో గుర్తుకురాకపోవడం, ఎంజే ఇంకో బాయ్ ఫ్రెండ్ తో ఉండటం చూసి బాధపడతాడు. దీంతో ఎప్పట్లాగే తన శరీరంలో బ్యాలెన్స్ కోల్పోయి స్పైడర్ మ్యాన్ గా ఇబ్బంది పడతాడు. అదే సమయంలో ఎవరో తెలియని వ్యక్తి అందరిలో దూరి డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ పై దాడి చేయడం, ఎంజే లో కూడా దూరడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. అలా ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా అక్కడక్కడా ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి జాన్ గ్రే ఎవరో కనుక్కోవడంతో ఏం చేస్తాడు స్పైడర్ మ్యాన్ అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ ఎక్కువగా జేన్ గ్రే పైనే నడిపించారు.
అయితే యాక్షన్ సీక్వెన్స్ లు ఊహించినన్ని ఉండవు. గత సినిమాల్లో స్పైడర్ మ్యాన్ బయటి శక్తులు, విలన్స్ తో పోరాడతాడు కాబట్టి ఆసక్తిగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఓ మంచి అమ్మాయి విలన్ గా మారితే ఆమెతో పోరాడటం సింపుల్ గా చూపిస్తాడు. అలాగే తనలో ఉన్న ఎమోషన్స్ తో పోరాడటంతో సినిమా యాక్షన్ పార్ట్ చాలా తగ్గిపోయింది. ఎక్కువగా డ్రామా, ఎమోషన్స్ మీద ఈ సినిమా నడిపించాడు.
జేన్ గ్రే ఎవరు, ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ తో తను ఇవన్నీ ఎందుకు చేస్తుందో చెప్పినా తన ఫ్లాష్ బ్యాక్, మరో అమ్మాయి పాత్రపై క్లారిటీ ఇవ్వలేదు. మరి జేన్ గ్రే పాత్ర తర్వాత మార్వెల్ సినిమాల్లో వస్తుందేమో చూడాలి. ఇక హల్క్, స్కార్పియన్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి. ఎంజేతో కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్స్ లో మాత్రం ఎమోషన్ అవుతాము. స్పైడర్ మ్యాన్ నుంచి ఎక్కువ యాక్షన్స్ ఊహించి వెళ్తే మాత్రం కష్టమే. అక్కడక్కడా కాస్త నవ్వించారు కూడా. ఎంజేతో స్పైడర్ మ్యాన్ రిలేషన్ పై కూడా క్లారిటీ ఇవ్వకుండానే ముగించారు. ఇక స్పైడర్ మ్యాన్ థ్రిల్లింగ్ జుంప్స్ మాత్రం ఎప్పట్లాగే అదరగొట్టారు. కానీ చివర్లో నెడ్ తో స్పైడర్ మ్యాన్ కి ఓ సీన్ పెట్టి మరో స్పైడర్ మ్యాన్ సినిమా అయితే ఉంటుంది అని లీడ్ ఇచ్చారు. సరదాగా ఓ సారి చూడాలి అనుకుంటే చూడొచ్చు. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా గత సినిమాలా రేంజ్ లో కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక అంశాలు..
టామ్ హాలెండ్ ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ గా మెప్పించాడు. ఇప్పుడు మరోసారి అదరగొట్టాడు. సాదీ సింక్ నెగిటివ్ షేడ్స్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. జెండ్యా, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్, మైఖేల్ మాండో.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
అన్ని మార్వెల్ సినిమాల్లాగే స్పైడర్ మ్యాన్ సాంకేతికంగా హై స్టాండర్డ్స్ తో చాలా బాగుంది. అయితే ఈసారి యాక్షన్ పార్ట్ కాస్త తగ్గించి డ్రామా, ఎమోషన్స్ పై కథని నడిపించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
