Gaayapadda Simham : ‘గాయపడ్డ సింహం’ రివ్యూ.. ట్రంప్ మీద కోపంతో తరుణ్ భాస్కర్ ఏం చేసాడు?

గాయపడ్డ సింహం సినిమా కోసం ట్రంప్ ని చూపించి చేసిన ప్రమోషన్స్, రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Gaayapadda Simham)

  • Published on- May 1, 2026 / 04:35 PM IST

Gaayapadda Simham

Gaayapadda Simham Movie Review : తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా గాయపడ్డ సింహం. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి, భాను కిరణ్, విజయ్ కృష్ణ, ఉమేష్ కుమార్ నిర్మాణంలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హీరో శ్రీవిష్ణు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. జెడి చక్రవర్తి, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గాయపడ్డ సింహం సినిమా నేడు మే 1న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

ఐజి విజయ్ కాంత్(శుభలేఖ సుధాకర్), పోలీసాఫీసర్ అశోక్ వర్ధన్(హర్షవర్ధన్) బ్రూటల్ ధర్మ(JD చక్రవర్తి)కు చెందిన ఇల్లీగల్ పనులు చేసే సత్య లాజిస్టిక్స్ ని మూసేస్తారు. విజయ్ కాంత్ తన కూతురు షాలిని(ఫరియా అబ్దుల్లా)కి ధరహస్(తరుణ్ భాస్కర్)కి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి వేడుకల్లో సత్య లాజిస్టిక్స్ నుంచి ఒక పార్సిల్ రావడంతో ధరహస్, విజయకాంత్ మాట్లాడుకుంటుంటే షాలిని వచ్చి వీళ్లిద్దరికీ ముందే పరిచయం ఉంది అని పసిగట్టి అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. దీంతో ఇద్దరూ ఫ్లాష్ బ్యాక్ ని షాలిని చెప్తారు.

ధరహస్ తను ప్రేమించిన అమ్మాయి(మానస చౌదరి)ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్న అమెరికా అబ్బాయి కావాలి అనడంతో అమెరికాకు బయలుదేరుతాడు. కానీ వెళ్లగానే ఏవో రూల్స్ అంటూ తిరిగి ఎయిర్ పోర్ట్ నుంచే పంపించేస్తారు. దీంతో ట్రంప్ పెట్టిన రూల్స్ వల్లే తన జాబ్, ప్రేమించిన అమ్మాయి పోయింది అని పగబట్టి ఫ్రెండ్(కశ్యప్ శ్రీనివాస్) సాయంతో ట్రంప్ మీద చేతబడి చేయించడానికి భైరవ్ దాస్(శ్రీవిష్ణు)ని కలుస్తారు. మరి ధరహాస్ ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకున్నాడా? అసలు బ్రూటల్ ధర్మ ధరహస్ జీవితంలోకి ఎలా వస్తాడు? ధరహాస్, ఐజి విజయకాంత్ ఎలా కలుస్తారు ? సత్య లాజిస్టిక్స్ నుంచి వచ్చిన పార్సిల్ లో ఏముంది? అసలు బ్రూటల్ ధర్మ ఎవరు? అసలు చేతబడులు చేసే భైరవ్ దాస్ ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Jetlee Review : ‘జెట్లీ’ మూవీ రివ్యూ.. కమెడియన్ సత్య హీరోగా చేసిన సినిమా.. ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ..

గాయపడ్డ సింహం సినిమా కోసం ట్రంప్ ని చూపించి చేసిన ప్రమోషన్స్, రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ధరహాస్ ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ మీద రివెంజ్, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ధరహాస్ జీవితంలోకి పోలీసులు, ధర్మ ఎలా వచ్చాడు, భైరవ్ దాస్ కథతో సాగుతుంది.

ఓ పక్క తరుణ్ భాస్కర్ ధరహస్ పాత్ర మీద కథ నడుస్తుంటే శ్రీవిష్ణు పాత్ర భైరవ్ దాస్ ని గెస్ట్ అప్పీరెన్స్ లా కాకుండా, సెకండ్ హీరోలా, దానికి ఇంకో కథ రాసుకొని, అతని ఫ్యామిలీ, అతని కథ చెప్పడం గమనార్హం. అయితే సినిమాకు శ్రీవిష్ణు పాత్ర, అతని ఫ్యామిలీనే హైలెట్ గా నిలిచినా ఈ కథని డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్రతో సపరేట్ సినిమా తీసుకోవచ్చు. క్లైమాక్స్ లో శ్రీవిష్ణు, జెడి చక్రవర్తి పాత్రలని చూపించడంతో పాటు పార్ట్ 2 అని ‘పోరాట సింహం’ టైటిల్ అనౌన్స్ చేసారు కాబట్టి అది శ్రీవిష్ణు మీదే ఫుల్ సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది.

ట్రంప్ ఎపిసోడ్స్ అన్ని నవ్వు తెప్పిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకి వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా కొంచెం సాగదీశారు. కథకు సంబంధం లేని సీన్స్, అక్కర్లేకపోయినా సాంగ్స్ తో నడిపించారు. ఈ సినిమా అంతా KGF లాగా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం గమనార్హం. చాలా సినిమాల్లోని సీన్స్ ని స్పూఫ్ లాగా చేసారు. ఆర్జీవీ, జెడి చక్రవర్తి సూపర్ హిట్ సినిమా సత్య ని ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా లింక్ చేసిన సీన్స్ అదిరిపోయాయి. ఆ ఆలోచనకు మాత్రం డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. అక్కడక్కడా బోర్ కొట్టినా బాగానే నవ్వుకోవచ్చు. అమెరికాలో ట్రంప్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే మాత్రం మూవీ టీమ్ కి కష్టమే.

నటీనటుల పర్ఫార్మెన్స్..

తరుణ్ భాస్కర్ మెయిన్ పాత్రలో పర్వాలేదనిపించారు. శ్రీవిష్ణు మాత్రం ఎప్పట్లాగే తన మార్క్ యాక్టింగ్ స్టైల్ తో అదరగొట్టాడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి క్యూట్ గా మెప్పించారు. ఫ్రెండ్ పాత్రలో డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కూడా బాగానే నటించి నవ్వించాడు. హర్షవర్ధన్ పోలీస్ పాత్రలో అక్కడక్కడా నవ్వించారు. జెడి చక్రవర్తికి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్ర పాడింది అని చెప్పొచ్చు. శుభలేఖ సుధాకర్, విష్ణు, అనిత చౌదరి, వాసు ఇంటూరి, కామ్నా జెటల్మని.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Bellamkonda Sai Sreenivas : ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్యరెడ్డి వివాహం.. పెళ్లి ఫోటోలు చూశారా..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్, సాంగ్స్ కట్ చేస్తే బెటర్. కొత్త కథని తీసుకొని దర్శకుడు ఆసక్తికర స్క్రీన్ ప్లేతో గాయపడ్డ సింహంని బాగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల ఆగిపోవడంతో ట్రంప్ మీద కోపంతో ఏం చేసాడు, దాంతో అతని చుట్టూ ఏం జరిగింది అని కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.