Veerabhadrudu Review : సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ.. దేవుడే దిగి లాయర్ గా వస్తే..

ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం. (Veerabhadrudu Movie Review)

  • Published on- May 15, 2026 / 04:31 PM IST

Veerabhadrudu Movie Review

Veerabhadrudu Review : సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కరుప్పు. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో నేడు మే 15న రిలీజ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రభు, ప్రకాష్ బాబు నిర్మాణంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, అనఘా మాయ రవి, ఇంద్రాన్స్, సుప్రీత్ రెడ్డి, శివధ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

కథ విషయానికొస్తే..

మీను(అనఘా మాయ రవి) కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆపరేషన్ కి డబ్బులు కోసం తమ దగ్గర ఉన్న బంగారం అమ్ముదాం అని అంతా తీసుకొని తన తండ్రి(ఇంద్రాన్స్)తో కలిసి హైదరాబాద్ వస్తుంది. ట్రైన్ దిగగానే దొంగలు ఆ బంగారాన్ని ఎత్తుకెళ్తారు. పోలీసుల దగ్గరికెళ్తే ఎలాగోలా పట్టుకొస్తారు కానీ అది తిరిగి ఇవ్వాలంటే కోర్టు ద్వారే ఇవ్వాలి అని ఫేమస్ లాయర్ బేబీ కృష్ణ(ఆర్జే బాలాజీ) దగ్గరికి వెళ్ళమని చెప్తారు. బేబీ కృష్ణ డబ్బుల కోసం ఏదైనా చేసే ఓ అవినీతి లాయర్. మీను, అతని తండ్రిని కూడా ఈజీగా అవ్వాల్సిన కేసుని డబ్బుల కోసం వాయిదాల మీద వాయిదాలు వేపిస్తూ తిప్పిస్తాడు. దీంతో మీను తండ్రి వీరభద్రుడుని వేడుకోవడంతో ఆ దేవుడే లాయర్ సూర్య(సూర్య)గా వస్తాడు.

మొదట బేబీ కృష్ణని దేవుడిగానే కనపడి భయపెట్టిస్తే ఇక్కడ సిస్టమ్ అలా ఉంది, దేవుడు వచ్చినా మార్చలేడు, కావాలంటే నువ్వే వచ్చి నీ దేవుడి పవర్స్ వాడకుండా నిజాయితీగా కేసు గెలువు అని వీరభద్రుడుతోనే ఛాలెంజ్ చేస్తాడు బేబీ కృష్ణ. మరి లాయర్ సూర్యగా వచ్చిన వీరభద్రస్వామి ఏం చేస్తాడు? మీను గోల్డ్ తిరిగొచ్చి ఆమె బతుకుతుందా? మధ్యలో లాయర్ ప్రీతీ(త్రిష) ఏం చేసింది? లాయర్లు అవినీతిని మానేలా వీరభద్ర స్వామి ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Dooradarshini : ‘దూరదర్శిని’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ అస్సలు ఊహించలేరు..

సినిమా విశ్లేషణ..

సూర్య గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉండటం, ఈ సినిమా ట్రైలర్ కూడా బాగుండటంతో ఇదేదో కోర్ట్ సస్పెన్స్ డ్రామా అనుకోని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. మే 14నే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫైనాన్స్ ఇబ్బందులతో మే 15 రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు, సినిమాపై హైప్ కూడా తగ్గింది. ఈ సినిమాలో సూర్య దేవుడిగా కనపడటం విశేషం.

ఫస్ట్ హాఫ్ అంతా మీను గోల్డ్ కేసుతోనే సాగి వీరభద్ర స్వామి లాయర్ గా దిగి రావడం, ఆ కేసుతో సాగుతుంది. ఇంటర్వెల్ కి మీను కేసు అనంతరం మరో కేసుని జతచేసి ఫస్ట్ హాఫ్ లో పవర్స్ వాడకుండా మనిషిలా కనపడిన సూర్య దేవుడిలాగానే కనిపించబోతున్నాడు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచారు. ఫస్ట్ హాఫ్ ఇంటరెస్ట్ గా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం తల తోక లేకుండా కేసుల గురించి కాకుండా లాయర్లు, కోర్టు చుట్టూ, దేవుడు వీరభద్రుడు మీదే బేబీ కృష్ణ రివెంజ్ అన్నట్టు రొటీన్ డ్రామాగా సాగుతుంది.

ఈ సినిమాలో హీరో సూర్య అయినా కథ మొత్తం నడిచేది ఆర్జే బాలాజీ చుట్టూనే. అసలు సూర్య కంటే ఆర్జే బాలాజీనే ఎక్కువ సేపు కనిపిస్తాడు. అసలు హీరో సూర్యనా, ఆర్జే బాలాజీనా అనే సందేహం రాక మానదు. ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్టులో కేసు తేలక బాధ పడే పేదవాళ్ళు, తండ్రి ఎమోషన్, దేవుడి ఎమోషన్.. ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రస్తుతం సమాజంలో కోర్టులు ఎలా నడుస్తున్నాయి? కోర్టులో కేసులు ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయి, కోర్టులలో అవినీతి ఎలా జరుగుతుంది అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.

గతంలో దేవుడే మనిషిగా రావడం, మాయలు చేయడం, విలన్స్ ని చంపడం.. లాంటివి చాలా సినిమాల్లో చూసాం. ఇది కూడా అంతే. అయితే కోర్ట్ రూమ్ సస్పెన్స్ డ్రామా అనుకోని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. మొత్తంగా దేవుడే దిగివచ్చినా ఇక్కడ సమాజంలో, కోర్టు, లాయర్లలో ఉన్న అవినీతిని, చెడుని తీసేయడం కష్టం, ఒక కోర్టు మారిస్తే సరిపోదు దేశంలో చాలా కోర్టుల్లో ఇదే పరిస్థితి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాతో చేసారు. మరి ఈ సినిమా చూశాక లాయర్లు, జడ్జీలు విమర్శలు చేస్తారేమో చూడాలి. ఇక సూర్య ఫ్యాన్స్ కి మాత్రం పండగే. గజినీ, సింగంతో పాటు పలు సూర్య సినిమాల రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సూర్య దేవుడి పాత్రలో, లాయర్ పాత్రలో బాగానే నటించారు. క్లైమాక్స్ ఫైట్ లో వీరభద్ర స్వామిగా సూర్య అదరగొట్టాడు. త్రిష లాయర్ పాత్రలో పర్వాలేదనిపించింది. ఆర్జే బాలాజీ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. ఓ పక్క డైరెక్షన్ చేస్తూనే మరో పక్క విలన్ గా బాగా నటించాడు. మీను పాత్రలో అనఘా మాయ రవి ఎమోషనల్ గా మెప్పిస్తుంది. ఆమె తండ్రి పాత్రలో ఇంద్రాన్స్ కూడా కన్నీళ్లు తెప్పిస్తాడు. శ్వాసిక, సుప్రీత్ రెడ్డి, మన్సూర్ అలీ ఖాన్, నట్టి సుబ్రహ్మణ్యం, శివధ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Anasuya Bharadwaj Birthday: అన‌సూయ బ‌ర్త్ డే స్పెష‌ల్.. పాత ఫోటోలు వైర‌ల్‌

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం యావరేజ్. వీరభద్ర స్వామిని చూపించే సీన్స్ లో గ్రాఫిక్స్ పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. డైరెక్టర్ ఆర్జే బాలాజీ మంచి కాన్సెప్ట్ తీసుకొని సెకండ్ హాఫ్ లో తడబడ్డా సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘వీరభద్రుడు’ సినిమా కోర్టుల్లో జరిగే అవినీతిని అంతం చేయడానికి దేవుడే దిగి వస్తే ఏం జరిగింది అని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.