Dooradarshini : ‘దూరదర్శిని’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ అస్సలు ఊహించలేరు..
అరుణాచలంలో ఓ యాచకుడి లైఫ్ లో రియల్ గా జరిగిన అతని కొడుకు కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని ప్రచారం చేసారు.(Dooradarshini)
- Saketh U
- Updated on- May 14, 2026 / 11:25 PM IST
Dooradarshini Movie Review : సువిక్షిత్, గీతికా రతన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని అనేది ట్యాగ్ లైన్. వరాహ మూవీ మేకర్స్ బ్యానర్ పై జయశంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మాణంలో కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దూరదర్శిని సినిమా నేడు మే 15న రిలీజ్ అవుతుండగా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్ వేశారు.
కథ విషయానికొస్తే..
ఈ కథ 90s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. మట్టిపర్రు అనే ఊళ్ళో హరి(సువిక్షిత్)- వాణి(గీతికా రతన్) లు ఎప్పట్నుంచో ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ ఎవరూ బయటపడరు. ఆ ఊళ్ళో పేకబాబు(భాస్కర్) ఇంట్లో ఉండే టీవీ దగ్గర చిత్రలహరి చూడటానికి వచ్చి రోజూ అక్కడ కలుసుకునేవాళ్ళు. హరి ఎంతకీ చెప్పకపోవడంతో వాణినే తన ప్రేమ విషయాన్నీ బయటపెడుతోంది. అప్పట్నుంచి హరి – వాణి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. ఇదంతా తెలిసి పేకబాబు వాణిని దక్కించుకోవాలని హరి – వాణి కలుసుకోకూడదు అని ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తూ ఉంటాడు. వాణి అన్నయ్య పరుశురామ్(విజయ్ కృష్ణ రెడ్డి) ఆ ఊరిపెద్ద.
మరి పేకబాబు వాణి కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు? వాణి – హరి ప్రేమకథ ఏమైంది? వీళ్ళ ప్రేమకథ తెలిసి పరుశురామ్ ఏం చేసాడు? అదే ఊళ్ళో ఉండే మిలట్రీ వ్యక్తి(జెమిని సురేష్) కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Sai Pallavi: ‘ఏక్ దిన్’ మూవీ సెట్స్ లో న్యాచురల్ బ్యూటీ.. సాయి పల్లవి ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సినిమా విశ్లేషణ..
దూరదర్శిని అనే టైటిల్ తో, 90s బ్యాక్ డ్రాప్ సినిమా అని, క్లైమాక్స్ ఏడుస్తారు కానీ హ్యాపీ ఎండింగ్ అంటూ సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ వెనక పడటం, వాళ్ళ ప్రేమకథ, మధ్యలో విలన్ ఇబ్బంది పెట్టాలనుకోవడంతో రొటీన్ గానే సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ చిన్న గొడవతో నెక్స్ట్ వీళ్ళ ప్రేమకథ ఏమవుతుంది అనే ఆసక్తి నెలకొల్పేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీళ్ళ ప్రేమకథకు వచ్చే కష్టాలతో పాటు ఊళ్ళో మిలట్రీ వ్యక్తి – అతని భార్య కథ, కులం గొడవలతో ఎమోషనల్ గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ ఉన్నా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం.
ఇది అరుణాచలంలో ఓ యాచకుడి లైఫ్ లో రియల్ గా జరిగిన అతని కొడుకు కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని ప్రచారం చేసారు. అయితే క్లైమాక్స్ మాత్రం సినిమాటిక్ గా మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ రెగ్యులర్ సాగదీస్తూ సాగిన ప్రేమకథ. అక్కడక్కడా హీరో ఫ్రెండ్స్ నవ్వించే ప్రయత్నం చేసారు. ఫస్ట్ హాఫ్ లో అక్కర్లేని సీన్స్, అక్కర్లేని కామెడీ ట్రాక్స్ తీసేయడం బెటర్.
ఇక సెకండ్ హాఫ్ మాత్రం లవ్ ఎమోషన్ తో నడిపించారు. జరుగుతున్న ప్రేమకథకు ఆల్రెడీ కులం ముడిపెట్టి కథని నడిపిస్తున్నారు కానీ మధ్యలో రాజకీయం తీసుకొచ్చి కులం గొడవలు అంటూ అక్కర్లేని సపరేట్ ట్రాక్ నడిపించారు. క్లైమాక్స్ అయితే కచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఈ సినిమాకి దూరదర్శిని అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో హీరోయిన్స్ టీవీ చూడటానికి వెళ్లి అక్కడ కలిసేవాళ్ళు తప్ప కథకి, దానికి సంబంధం లేదు. ఇక ఆ టీవీ చుట్టూ రాసుకున్న సీన్స్ అన్ని కూడా ఇటీవల వచ్చిన తిమ్మరాజు పల్లి టీవీ సినిమాని గుర్తుచేస్తాయి. కథ పరంగా డబ్బున్న అమ్మాయి వేరే కులం డబ్బు లేని అబ్బాయి మధ్య ప్రేమ అనే రొటీన్ పాత కథే అయినా క్లైమాక్స్ కొంచెం కొత్తగా రాసుకున్నారు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
కొత్త హీరో సువిక్షిత్ బాగానే మెప్పించాడు. హీరోయిన్ గీతికా రతన్ హాఫ్ శారీస్ లో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా క్యూట్ గా కనిపిస్తూ నటనతోనూ మెప్పించింది. హీరో ఫ్రెండ్స్ పాత్రలో బాలరాజు, తేజ విహన్ బాగానే నవ్వించారు. నెగిటివ్ షేడ్స్ లో భాస్కర్, విజయ్ కృష్ణ రెడ్డి పర్వాలేదనిపించారు. జబర్దస్త్ సత్తిపండు, భద్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. హీరో తండ్రి పాత్రలో కిట్టయ్య తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో, క్లైమాక్స్ లో చాలా బాగా నటించి మెప్పించారు. లావణ్య రెడ్డి, జెమిని సురేష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Karuppu: సూర్య ‘కరుప్పు’ రిలీజ్ కి అడ్డంకులు.. కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు బాలాజీ
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని పాటలు మెప్పిస్తాయి. డబ్బింగ్ మాత్రం చాలా చోట్ల లిప్ సింక్ కుదర్లేదు. షూటింగ్ అయ్యాక డబ్బింగ్ లో మళ్ళీ డైలాగ్స్ మార్చారు అనిపిస్తుంది. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ లో ల్యాగ్ సీన్స్, కొన్ని అక్కర్లేని షాట్స్ కట్ చేస్తే బెటర్. రొటీన్ కథని కొత్త క్లైమాక్స్ తో సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘దూరదర్శిని’ సినిమా ఓ రియల్ సంఘటన ఆధారంగా రెగ్యులర్ ప్రేమకథగా 90s బ్యాక్ డ్రాప్ లో అందంగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
