The Court Review : ‘ది కోర్ట్’ వెబ్ సిరీస్ రివ్యూ.. నత్తి ఉన్న అమ్మాయి లాయర్ అవుతుందా?
సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే వాదనలు, సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటాయి. కానీ ఈ సిరీస్ అలా కాదు.
- Saketh U
- Published on- September 13, 2026 / 04:44 PM IST
The Court Review
The Court Review : యోగలక్ష్మి, అర్జున్ శ్యామ్ గోపన్, ముక్త జార్జ్, వివేక్ ప్రసన్న.. పలువురు మెయిన్ లీడ్స్ గా గా తమిళ్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది కోర్ట్’. జియో హాట్ స్టార్ ఓటీటీలోకి ఇటీవలే స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రాజవేలు, పద్మిని రాజవేలు నిర్మాణంలో బాల SB దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
కథ విషయానికొస్తే..
యాలిని(యోగలక్ష్మి) ఇంట్లో గొడవపడి బయటకు వచ్చి ఒక హాస్టల్ లో ఉంటుంది. లాయర్ చదువు పూర్తి చేసి ఎవరి దగ్గరైనా జూనియర్ గా జాయిన్ అవ్వాలని హైకోర్టులో లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ యాలినికి స్ట్రెస్, కంగారు వచ్చినప్పుడు నత్తి వస్తుంది. దీంతో లాయర్ కి మాటే ఆయుధం అని ఎవరూ ఆమెని చేర్చుకోరు. అదే కోర్టులో లాయర్ వేణి(ముక్త)కు – లాయర్ దేవా(అర్జున్ శ్యామ్ గోపన్)కు పడదు. అదే కోర్టులో క్యాంటిన్ నడుపుకుంటున్న మాజీ లాయర్ సత్యం(వివేక్ ప్రసన్న) వేణిని ఇష్టపడుతూ ఉంటాడు. దేవా ఛాంబర్ కొన్ని పనుల వల్ల మూసేయడంతో కోర్టులో వేరే లాయర్ల వద్ద రాజకీయాలు చేసి వేణి ఛాంబర్ లో తన సీట్ వేయించుకుంటాడు. ఇది వేణి కి ఇష్టం ఉండదు.
యాలిని ట్యాలెంట్ ని వాడుకొని ఒక లాయర్ ఆమె పేరు చెప్పకుండా మోసం చేస్తాడు. ఆ కేసు ప్రత్యర్థి లాయర్ దేవా కావడంతో అతను యాలిని టాలెంట్ ని గ్రహిస్తాడు. వేణికి ఒక జూనియర్ లాయర్ అవసరం ఉండటంతో క్యాంటిన్ లో పనిచేసే సుడల్(వెంకట్ సెంగుట్టువన్) యాలినిని ఆమె ఛాంబర్ నెంబర్ చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళమంటాడు. కానీ ఆ సమయానికి వేణి లేకపోవడం, దేవా ఇదే ఛాన్స్ అనుకోని యాలినిని ఇంటర్వ్యూ చేసి తన జూనియర్ గా చేర్చుకుంటాడు. ఇది వేణి, సత్యంకు తెలిసి గొడవ అయినా యాలిని దేవా దగ్గరే పనిచేస్తా అంటుంది. యాలిని – దేవా కలిసి కేసులు సాల్వ్ చేస్తారా? అసలు వేణి – దేవాకు మధ్య ఉన్న గొడవ ఏంటి? చివర్లో యాలిని గురించి అందరికి తెలిసే నిజం ఏంటి? సత్యం – వేణి మధ్య లవ్ ట్రాక్ ఏమైంది? వేణి జూనియర్స్ కి – యాలిని మధ్య గొడవ ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
Also Read : Kashi Majili : ‘కాశీ మజిలీ’ రివ్యూ.. రేణు దేశాయ్ నటించిన సినిమా ఎలా ఉందంటే..? ఏడేళ్లు చిన్నవాడితో ప్రేమ..
సిరీస్ విశ్లేషణ..
సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే వాదనలు, సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటాయి. కానీ ఈ సిరీస్ అలా కాదు. కోర్టులో ఉండే జనాలు, వాళ్ళ మధ్య జరిగే గొడవలు, లవ్ స్టోరీలు, అక్కడ జరిగే రాజకీయాలతో సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో మంచి బ్యాంగ్ అయితే ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొల్పారు. అయితే ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ లో ఇది కూతురు – తండ్రికి మధ్య జరిగే కోర్ట్ పోరాటం అన్నట్టు చూపించారు. కానీ ఇందులో అదేమీ ఉండదు. చివర్లో యాలిని తండ్రి ఇతను అనే ట్విస్ట్ ఇచ్చి సీజన్ 2 కి లీడ్ ఇచ్చారు. మరి ప్రమోషన్స్ లో ఆ కంటెంట్ ఎందుకు చూపించారో సిరీస్ టీమ్ కి తెలియాలి.
హీరోయిన్ యాలిని పాత్ర పరిచయంతో అసలు ఆమె ఎవరు, ఎందుకు ఇంట్లోంచి వచ్చేసి సింగిల్ గా ఉంటుంది అని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు చివరి ఎపిసోడ్ వరకు కూడా క్లియర్ అవ్వవు. అవి తెలియాలంటే సీజన్ 2 కోసం వేచి చూడాల్సిందే. మొదట్లోనే హీరోయిన్ ఎంత ట్యాలెంటెడ్ అనేది ఓపెనింగ్ సీన్ లోనే చూపించేసారు. హీరోయిన్ జూనియర్ లాయర్ జాబ్ కోసం వెతికే సన్నివేశాలు కాస్త సరదాగా, కాస్త ఎమోషనల్ గా సాగుతాయి. వేణి – సత్యం లవ్ ట్రాక్ బాగుంటుంది. వేణి – దేవా మధ్య గొడవలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వేణి జూనియర్స్ చేసే పనుల్లో కాస్త నవ్వు తెప్పిస్తాయి, తర్వాత కోపం కూడా తెప్పిస్తాయి. వాదనలు జరిగే కేసులు లేకపోయినా ఒక రెండు కేసులు మాత్రం ఆసక్తిగానే చూపించారు.
చివర్లో ఇంకో కేసు వస్తుంది. అది సెకండ్ సీజన్ లో చూడాలేమో. అలాగే లాయర్ సత్యం ఎందుకు క్యాంటిన్ నడుపుకుంటున్నాడు అనేది కూడా సెకండ్ సీజన్ లో చూడాలి. వేణికి కూడా ఏదో పర్సనల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఒక సీన్ చూపించారు. అది తెలియాలన్నా సెకండ్ సీజన్ కోసం ఆగాల్సిందే. యాలిని నత్తి ఉంటుందా పోయిందా కూడా సెకండ్ సీజన్ లోనే చూడాలి. క్లైమాక్స్ లో అసలు యాలిని – తన తండ్రికి మధ్య ఏం జరిగింది అని సెకండ్ సీజన్ పై ఆసక్తి కలిగించారు. అక్కడక్కడా బాగా సాగదీశారు. ఫార్వడ్ చేసుకుంటూ చూడొచ్చు కొన్ని చోట్ల. మొత్తానికి ఫస్ట్ సీజన్ కేవలం పాత్రలు, కోర్టులో పరిస్థితులు పరిచయం చేసి అన్ని సెకండ్ హాఫ్ లోనే చూడండి అన్నట్టు తెరకెక్కించారు. ది కోర్ట్ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన యోగలక్ష్మి మెయిన్ లీడ్ లోఅదరగొట్టేసింది. నత్తి వచ్చే లాయర్ పాత్రలో చాలా బాగా నటించింది. కామెడీ, ఎమోషనల్ సీన్స్ ని పండించింది. అర్జున్ శ్యామ్ గోపన్ దేవా పాత్రలో బాగానే నటించాడు, ముక్త జార్జ్ సీనియర్ లాయర్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తూనే క్యూట్ లవ్ స్టోరీతో కూడా మెప్పించింది. వివేక్ ప్రసన్న క్యాంటిన్ వ్యక్తిగా బాగానే నటించాడు.
వెంకట్ సెంగుట్టువన్ అక్కడక్కడా నవ్వించాడు. గురుఫరాన్ కార్తికేయన్, VJ కళ్యాణి, సుభాష్ కన్నన్.. వేణి టీమ్ లాయర్లు గా పర్వాలేదు అనిపించారు. జయప్రకాశ్ యాలిని తండ్రిగా క్లైమాక్స్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. సెకండ్ సీజన్ మొత్తం ఈయన మీదే ఉండబోతుందని తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ ఆజ్హియా అక్కడక్కడా కనిపించి మెప్పించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Irumudi : రవితేజ ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ చెన్నై హైకోర్టులాగే కనపడేలా సెట్ బాగా వేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కోర్టు అంటే కేసులు, వాదనలు కాకుండా కోర్టులో మనుషులు, అక్కడ జరిగే పనులు, పరిస్థితులు నేపథ్యంలో కొత్తగా రాసుకొని సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ది కోర్ట్’ వెబ్ సిరీస్ కోర్టులో ఉండే లాయర్లు, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో సింపుల్ గా సరదాగా సాగే సిరీస్. సెకండ్ సీజన్ కోసం ఎదురు చూసేలా చేసిన సిరీస్.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
