Samantha Ruth Prabhu: వంటగదిలో సెలబ్రిటీల పోటీ.. ‘మాస్టర్‌చెఫ్ తమిళ్‌’కు సమంత హోస్ట్

Samantha Ruth Prabhu: ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ షోకు స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

Actress Samantha To Host Celebrity MasterChef Tamil

Samantha Ruth Prabhu: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కుకింగ్ ఫార్మాట్ ‘మాస్టర్‌చెఫ్’ ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌ రూపొందిస్తోంది. ఈ షోకు స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఫుడ్, సెలబ్రిటీలు, కాంపిటీషన్‌ను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి కిచెన్‌లోకి అడుగుపెట్టి విభిన్నమైన వంటల సవాళ్లను ఎదుర్కోనున్నారు. కఠినమైన టాస్కులు, ఊహించని ట్విస్టులు, సమయపాలన వంటి సవాళ్ల మధ్య రుచికరమైన వంటకాలను తయారు చేసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

బనిజె ఏషియా నిర్మిస్తున్న ఈ షోను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మాస్టర్‌చెఫ్’ ఫార్మాట్ ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్థానిక వంటకాలు, సంప్రదాయ రుచులు, తమిళ సంస్కృతి, సెలబ్రిటీల మధ్య ఉండే ప్రత్యేకమైన కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Also Read – Ananya Nagalla : జీన్స్ ప్యాంట్, టీ ష‌ర్టులో తెలుగు అందం.. జ్వ‌రంతో అన‌న్య నాగ‌ళ్ల‌.. నో మేక‌ప్‌.. ఫోటోలు..

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’లో భాగం కావడం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు తాను చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ఈ షో ఉండటమే తనను ఆకర్షించిందని చెప్పారు అంద‌రినీ ఒకేచోటికి తీసుకురావడంలో, మధురమైన జ్ఞాపకాలను సృష్టించడంలో, సాధారణంగా కెమెరాల ముందు కనిపించని మనలోని మరో కోణాన్ని బయటపెట్టడంలో ఫుడ్‌కు ఓ ప్రత్యేకమైన శక్తి ఉందన్నారు. షోలో పాల్గొనే సెలబ్రిటీల వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని, షో ప్రారంభ‌మైన‌ప్పుడు చూస్తూనే మ‌జా ఉంటుంద‌న్నారు.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ సోనీ విళా ఛానల్‌తో పాటు సోనీ లివ్‌లోనూ త్వ‌ర‌లోనే ప్రసారం కానుంది. ప్రధాన ఎపిసోడ్స్‌తో పాటు సెలబ్రిటీల కుకింగ్ జర్నీ, కిచెన్‌లోని ఆసక్తికరమైన సంఘటనలు, ఛాలెంజ్‌లకు సంబంధించిన ప్రత్యేక షార్ట్‌ఫార్మ్ కంటెంట్‌ను డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.