Dacoit : ‘డెకాయిట్’ మూవీ రివ్యూ.. అడివి శేష్ లవ్, యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..?
అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. (Dacoit Movie Review)
Dacoit Movie Review
Dacoit Movie Review : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా షానియల్ డియో దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి, సునీల్, ప్రకాష్ రాజ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
హరి(అడివి శేష్), సరస్వతి(మృణాల్ ఠాకూర్)ప్రేమించుకుంటారు. హరి ఇంటి ఓనర్ మల్లి(కామాక్షి భాస్కర్ల)ని సరస్వతి అన్నయ్య, అతని మనుషులు రేప్ చేస్తారు. కానీ ఆ కేసు హరి మీద పెడతారు. సరస్వతి కూడా అతనే చేసాడు అని చెప్తుంది. దాంతో హరి జైలుకు వెళ్తాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే అబద్దం చెప్పి జైలులో పెట్టించడంతో సరస్వతిపై పగ పెంచుకుంటాడు హరి. ఓ 13 ఏళ్ళ తర్వాత హరి తన పాత జైలుఖైదీ అయిన ఇషాక్ భాయ్(అతుల్ కులకర్ణి) సాయంతో జైలు నుంచి తప్పించుకొని దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటాడు.
కానీ వెళ్లేముందు పగ తీర్చుకోవాలని సరస్వతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ సరస్వతి తన భర్తకి హార్ట్ మార్చాలని, భర్తని బతికించుకోవాలని డబ్బుల కోసం కష్టపడుతూ, కూతురితో కలిసి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది చూసి హరి సరస్వతిని కలిసి ఆ హాస్పిటల్ డబ్బే కొట్టేసి నువ్వు సగం నేను సగం తీసుకుందాం అని డీల్ మాట్లాడుకుంటాడు. ఏ అవకాశం లేకపోవడంతో డబ్బుల కోసం సరస్వతి దొంగతనానికి ఒప్పుకుంటుంది. మరి హరి, సరస్వతి దొంగతనం చేసారా? హరి పగ తీర్చుకున్నాడా? సరస్వతి ఎందుకు అబద్దం చెప్పి హరిని జైలులో పెట్టించింది? మల్లి ఏమైంది? హార్ట్ సర్జరీ జరుగుతుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also See : Rashmika Mandanna: నా 30వ పుట్టినరోజు చాలా స్పెషల్.. నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక ఫ్యామిలీ ఫోటోలు
సినిమా విశ్లేషణ..
అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. అయితే ఇది లవ్ యాక్షన్ అని చెప్తూ ప్రమోట్ చేసారు. టీజర్, ట్రైలర్ కట్స్ బాగుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ కథ 2005 సమయంలో చూపించి ప్రస్తుత కథ కరోనా సమయంలో 2021లో చూపించారు.
ఫస్ట్ హాఫ్ లో హరి-సరస్వతి ప్రేమకథ, జైలు జీవితం, హరి తప్పించుకోవడం, సరస్వతిని కలిసి దొంగతనానికి ప్లాన్ చేసి వెళ్లడంతో అక్కడక్కడా ప్రేమకథతో ఛేజింగ్, యాక్షన్ సీన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎమోషనల్ యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఒక్కోటి రివీల్ చేస్తారు. కొన్ని ట్విస్టులు మనం ఊహించేయొచ్చు. ఓ రెండు ట్విస్టులు, హార్ట్ ఆపరేషన్ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఫ్లాష్ బ్యాక్ లో హరిపై ఇదంతా చేసింది ఎవరు అనేది అస్సలు ఊహించలేము, ఆ పాత్రపై కోపం కూడా వచ్చేలా ఎమోషన్ ని పండించారు. అందుకు స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు.
ఇక సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఛేజింగ్ సీన్స్ తో పాటు లవ్ ఎమోషన్ ని బాగా పండించారు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించేయొచ్చు. లవ్ సీన్స్ మాత్రం కొన్ని చోట్ల సాగదీశారు అనిపిస్తుంది. కరోనా సమయంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకున్నాయి, పేషేంట్స్ ఎంత ఇబ్బంది పడ్డారు అనే సీన్స్ కథకి బాగానే లింక్ చేసి చూపించారు. దేవుడి మీద, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పోలీస్ ని తిట్టడం వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. దొంగతనాలు, ఛేజింగ్ సీన్స్, హార్ట్ సర్జరీ.. ఇవన్నీ చాలా సినిమాల్లో ఉన్నవే. కానీ వీటన్నిటిని ఒక ఘాడమైన ప్రేమకథకు కనెక్ట్ చేసి ఎమోషనల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. డెకాయిట్ కి ట్యాగ్ లైన్ ఒక ప్రేమ కథ అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఇక డెకాయిట్ అంటే దొంగ. అడివి శేష్ మార్క్ కనిపించదు కానీ బోర్ కొట్టకుండా బాగానే ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
అడివి శేష్ లవ్ ఎమోషన్ ని బాగా పండించారు. మొదటి సారి ఈ సినిమాలో డ్యాన్స్ కూడా వేసి మెప్పించారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాని తన భుజాలపై నిలబెట్టింది అని చెప్పొచ్చు. సినిమా అంతా తన ఎమోషనల్ నటనతో అదరగొట్టేసింది. కొన్ని సీన్స్ లో శేష్ ని మృణాల్ డామినేట్ చేసిందని చెప్పొచ్చు.
అనురాగ్ కశ్యప్ అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు. అమీర్ ఖాన్ మేనకోడలు, బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్ కానిస్టేబుల్ పాత్రలో కాసేపు కనిపించి మెప్పించింది. కామాక్షి భాస్కర్ల తన పాత్రలో కాసేపే కనిపించినా బాగానే నటించింది. సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునయన.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చాలా ప్లస్ అయ్యాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కట్ మాత్రం అదిరిపోయింది. గ్యాని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరింత ఎలివేట్ చేసింది. భీమ్స్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. ప్రేమకథకు యాక్షన్ జోడించి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో బాగా రాసుకున్నారు. డైలాగ్స్ కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో దర్శకుడిగా మారి మొదటి సినిమా బాగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘డెకాయిట్’ సినిమా ఎమోషనల్ ప్రేమ కథతో పాటు ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆసక్తికరంగా తెరకెకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
