Sarath Chandra Naidu : నిర్మాతగా మారిన అల్లు అర్జున్ మేనేజర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ అంటూ ఇంటర్వ్యూ..

ఈ సిరీస్ విజయంతో తాజాగా శరత్ చంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (Sarath Chandra Naidu)

  • Updated on- July 17, 2026 / 04:30 PM IST

Sarath Chandra Naidu

Sarath Chandra Naidu : అల్లు అర్జున్ మేనేజర్ గా, అనేక సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ వ్యూహకర్తగా ఉన్న శరత్ చంద్ర నాయుడు ఇటీవల నిర్మాతగా మారారు. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా తెరకెక్కిన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ ని నిర్మించారు. 90s కిడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో వినోద్ గాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చి మంచి హిట్ అయింది. 90s కిడ్స్ అంతా ఈ సిరీస్ కి కనెక్ట్ అవుతున్నారు.

ఈ సిరీస్ విజయంతో తాజాగా శరత్ చంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రయాణం నా ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్ పేజ్ ‘రేలంగి మావయ్య’తో ప్రారంభమైంది. అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా వాయిస్ ఓవర్ తో చెప్పేవాడిని. దానికి మంచి రీచ్ వచ్చింది. ఆ కంటెంట్‌ను చూసిన ఈటీవీ విన్‌కు చెందిన సాయి, నితిన్ ఆ భావోద్వేగాలను వెబ్ సిరీస్‌గా మార్చొచ్చు కదా అనే హింట్ ఇవ్వడంతో ఆ సిరీస్ మొదలయింది.

Also Read : Gurthukosthunnayi Review: ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ రివ్యూ.. 90s కిడ్స్ కనెక్ట్ అవ్వాల్సిందే.. ఫుల్‌గా నవ్వించి చివర్లో ఏడిపించి..

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. నాకు ఈ సిరీస్ ని ప్రత్యేకంగా నిలిపింది అల్లు అర్జున్ నుంచి లభించిన ప్రోత్సాహం. నా కొత్త ప్రయాణంపై ఐకాన్ స్టార్ నన్ను వ్యక్తిగతంగా అభినందించడంతో పాటు ట్వీట్ కూడా చేసారు. ఆయన దగ్గర పనిచేసినవాళ్లలో నేను నిర్మాత అయినందుకు సంతోషించారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్‌ ఎంకరేజ్ చేశారు. సినీ నిర్మాణ రంగంలో ఇది నా కొత్త జర్నీకి శ్రీకారం అని తెలిపారు.

అలాగే.. నా మార్కెటింగ్ అనుభవం ఈ సిరీస్ కి బాగా పనికొచ్చింది. నాకు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారు, వారిని ఏది ఆకట్టుకుంటుంది అని తెలుసుకున్నాను. ఈ సిరీస్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సిరీస్‌ను నిర్మించడమే కాక దర్శక రచయితల బృందంతో కలిసి సిరీస్‌లోని పలు భాగాలకు రచనలో కూడా పాల్గొన్నాను అని తెలిపారు.