Asha Bhosle: భారతీయ సినిమాకు ఆమె స్వరం ప్రాణనాడి.. ఆశా భోంస్లేకి చిరు, ఎన్టీఆర్ నివాళులు
లెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ ఆశా భోంస్లే (Asha Bhosle)(92) ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
- V Santhosh Kumar
- Updated on- April 12, 2026 / 05:10 PM IST
Chiru and NTR Pay Tributes to Asha Bhosle
Asha Bhosle: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ ఆశా భోంస్లే(Asha Bhosle) (92) ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. శనివారం ఛాతీ ఇన్ఫెక్షన్, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే ధృవీకరించారు. ఏడు దశాబ్దాలకు పైగా తన మధుర గాత్రంతో వేల పాటలకు ప్రాణం పోసిన ఆశా భోంస్లే మరణవార్త యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.
Monalisa Missing: కుంభమేళా మోనాలిసా మిస్సింగ్.. అదృశ్యంపై భర్త సంచలన వీడియో
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక శాశ్వతమైన తోడుగా నిలిచిందని, ఆమె ప్రతి పాటలో చూపించే అప్రయత్నమైన సౌందర్యం, బహుముఖ ప్రజ్ఞను తాను ఎప్పుడూ ఆరాధిస్తానని పేర్కొన్నారు. సంగీత ప్రపంచం ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆశా భోంస్లే లేని లోటు సంగీత రంగానికి తీరనిదని ఆయన కొనియాడారు.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆశా భోంస్లే మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ఆమె స్వరం ప్రాణనాడిగా నిలిచిందని, లక్షలాది హృదయాలను తాకిన ఆమె గాత్రం తరతరాలకు నిలిచిపోయే గొప్ప వారసత్వాన్ని వదిలివెళ్లిందని ట్వీట్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ వంటి యువ హీరోలు కూడా ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఒక లెజెండరీ గాయనిగా మాత్రమే కాకుండా, వెర్సటిలిటీకి మారుపేరుగా నిలిచిన ఆమె జ్ఞాపకాలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
