Maa Election
MAA Election: తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తుంది. నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అయితే, మా జనరల్ బాడీ మీటింగ్ అనంతరం ఎన్నికలపై ప్రకటన ఉండొచ్చని భావించినా అది జరగలేదు. ఈ సమావేశంలో ఏకగ్రీవంపై కూడా చర్చ జరిగినా తుది నిర్ణయం ఏంటన్నది మాత్రం జరగలేదు.
ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఇప్పటికే ముగియగా మా సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే లేఖల ద్వారా ఇదే విషయాన్ని తెలిపిన మా సభ్యులు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కొందరు సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కోరితే.. మరికొందరు నవంబర్ లో ఎన్నికలు జరపాలని కోరినట్లుగా తెలుస్తుంది. అందరి అభిప్రాయాలు విన్న క్రమశిక్షణ కమిటీ మరో వారం రోజులలో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
ఇక, జనరల్ బాడీ మీటింగ్ అనంతరం మాట్లాడిన మోహన్ బాబు.. మా భవనం గురించి మా సభ్యులు మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో మా భవనం కోసం బిల్డింగ్ కొని అది మళ్ళీ అమ్మేశారని.. రుపాయికి కొన్న బిల్డింగ్ అర్ధ రూపాయికి అమ్మేశారని.. దాని గురించి మీటింగ్ లో సభ్యులెవరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బిల్డింగ్ విషయం తనను ఎంతగానో కలచివేస్తుందని.. ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారని.. కానీ మా గొప్ప సంస్థ అందరూ కలసి సముచిత నిర్ణయం తీసుకోవాలని మోహన్ బాబు కోరారు.
మా ఎన్నికలలో పోటీకి సిద్దమైన నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మా బైలాస్ ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ అయిన 21 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని, ఎంత తొందరలో అయితే అంత తొందరగా ఎలక్షన్స్ జరిపించాలని కోరినట్లు తెలిపారు. సెప్టెంబర్ 12న కాకపోతే కనీసం సెప్టెంబర్ 19న ఎలక్షన్స్ జరిగేలా చూడాలని ప్రకాష్ రాజ్ కోరారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన కృష్ణంరాజు మాట్లాడుతూ.. అందరి మెంబెర్స్ చెప్పిన అంశాలను విన్నామని.. మా నిర్ణయాన్ని ఒక వారంలో తెలియజేస్తామని చెప్పారు.
ప్రస్తుత మా అధ్యక్షుడు నటుడు నరేష్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఎన్నికలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా జరపాలని కోరుకుంటున్నామని.. కొందరు సెప్టెంబర్ అని మరికొందరు అక్టోబర్ అని అంటున్నారని.. క్రమశిక్షణ కమిటీ ఎలా చెపితే ఆ విధంగా నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరో క్రమశిక్షణ కమిటీ సభ్యులు మురళి మోహన్ మాట్లాడుతూ.. చాలా చక్కగా మీటింగ్ జరిగిందని.. క్రమ శిక్షణ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని.. అందరూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.