ఎఫ్2 మూవీ రివ్యూ

F2..ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఎంటర్ టైనర్‌..

  • Publish Date - January 12, 2019 / 09:46 AM IST

F2..ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఎంటర్ టైనర్‌..

రొటీన్ కథలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నాలుగో సినిమాగా ..అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో F2 సినిమాను స్టార్ట్ చేశాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఫిక్స్ అవ్వడంతోనే ఈ సినిమాకి బజ్ క్రియేట్ అయిపోయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఢోకా ఉండదు.. కితకితలు పెట్టే కామెడీతో కడుపుబ్బా నవ్విస్తామంటూ స్ట్రాంగ్ హింట్స్ ఇచ్చింది చిత్ర యూనిట్. సంక్రాంతి రేసులో  చివరి సినిమాగా ప్రేక్షకుల ముందకు వచ్చిన  F2 ఆడియన్స్‌కి ఫన్
పంచిందా..? లేక, ఫ్రస్టేట్ చేసిందా..? అనేది ఇప్పుడు చూద్దాం…   

 

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హారిక అండ్ హనీ.. హై యాటిట్యూడ్ ఫ్యామిలీకి చెందిన అక్కా, చెల్లెళ్లు. హారిక ఎమ్మెల్యే దగ్గర పి.ఏగా ఉన్న వెంకీని పెళ్లి చేసుకుంటుంది. హనీకి తన బాయ్ ఫ్రెండ్ అయిన వరుణ్‌తో నిశ్చితార్దం అవుతుంది.  హారికను పెళ్లి చేసుకున్న దగ్గరనుంచి ఆమె టిపికల్ క్యారెక్టర్‌తో ఫ్రస్టేట్  అవుతున్న వెంకీ, పెళ్లాడబోతున్న వరుణ్‌ని కూడా ఇన్ ఫ్లూయెన్స్ చేస్తాడు. భార్యతో వేగలేక వెంకీ..పెళ్లికి ముందే హనీ వల్ల టార్చర్ మొదలైన వరుణ్ , ఎదురింట్లో ఉంటున్న ప్రసాద్ మాటలు విని, ఎవరికీ చెప్పకుండా యూరప్ వెళ్లిపోతారు.  వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన హారిక అండ్ హనీలను తమ కాళ్ల దగ్గరే పడుండాలని కండీషన్ పెడతారు. దానికి ఒప్పుకుని హారిక అండ్ హనీ వెంకీ అండ్ వరుణ్‌లను దారికి తెచ్చుకోవడానికి ఎలాంటి ప్లాన్ వేశారు..? దాంతో వెంకీ అండ్ వరుణ్ ఫ్రస్టేట్ అవుతూ.. వారికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు..? వెంకీ హారిక, వరుణ్ అండ్ హనీ, తిరిగి ఎలా కలుసుకున్నారు? అనేది సినిమా చూసి  తెలుసుకోవాల్సిందే.     

 

నటీనటుల, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే…
గతంలో టిపికల్ కామెడీ టైమింగ్‌తో భారీ విజయాలు సొంతం చేసుకున్న వెంకటేష్, ఈ మధ్య కాలంలో ఎక్కువ సీరియస్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. కానీ అతనిలోని ఆ హిలేరియస్ స్పార్క్ తిరిగి చూడాలనుకున్న అనిల్ రావిపూడి వెంకీకి టైలర్ మేడ్‌లా ఉండే ఫ్రస్టేటెడ్ హజ్బెండ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. అనిల్ రాసుకున్న ఆ పాత్రను , డైలాగ్స్‌ని తన స్టైల్‌తో పదిరెట్లు పెంచుతూ.. హిలేరియస్ కామెడీతో సినిమాని అలవోకగా  అవుట్ ఆఫ్ డేంజర్ జోన్‌లోకి తెచ్చేశాడు వెంకటేష్. ఇక ఈ మధ్య వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ తెలంగాణ యాసతో సగటు కుర్రాడిగా బాగా నటించాడు. కామెడీ టైమింగ్‌తో వెంకీని మ్యాచ్ చెయ్యలేకపోయినా.. ఫుల్ సపోర్ట్‌గా నిలిచాడు.

వరుణ్ వల్ల సినిమా రేంజ్ పెరిగింది. రాజేంద్ర ప్రసాద్ తనకు అలవాటైన పాత్రను మరోసారి అలవోకగా పోషించి మెప్పించాడు. ఇక తమన్నా, మెహరీన్‌ల గ్లామర్ సినిమాకి స్పెషల్
ఎట్రాక్షన్‌గా నిలిచింది. వెంకీ , వరుణ్‌లతో వాళ్ల కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యింది. ప్రకాష్ రాజ్, నాజర్, పృధ్వి , ప్రగతి,ఈశ్వరీ రావు, రఘబాబు, అన్నపూర్ణ, వై.విజయ కనిపించినప్రతిసారీ కడుపుబ్బా నవ్వించారు. మిర్చి కిరణ్ క్యారెక్టర్ పేల్చిన పంచ్‌లు బావున్నాయి.  బిగ్ బాస్ నూతన్ నాయుడు, హరితేజ, శ్రీనివాసరెడ్డి కూడా
కామెడీకి కలరింగ్ తెచ్చారు. ఇక చివరిలో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా..  F2 కి ఫుల్ ఫిల్ మెంట్ ఇచ్చాడు. తన ఎండ్ పంచ్‌తో సినిమాకి ఎండ్ కార్డ్ పడింది.  ప్రియదర్శి తెలంగాణ యాసలో పేల్చిన పంచ్‌లు పటాసుల్లా పేలాయి. చాలా కాలం తర్వాత అతని కామెడీ వర్కవుట్ అయ్యింది.        

టెక్నీషియన్స్ విషయానికొస్తే..  తన మొదటి సినిమా నుంచి కూడా కామెడీ ఎలివేషన్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటూ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి,
ఈ సినిమాలో కూడా కన్ఫ్యూజన్ లేని సింపుల్ స్టోరీ లైన్‌ని ఎంచుకున్నాడు. తన ట్రీట్ మెంట్‌‌తో తనకు బలంగా నిలిచిన కామెడీ డైలాగ్స్‌తో సినిమాని ఆద్యంతం నవ్వులు పూయించేలా మలచగలిగాడు. ఫస్టాఫ్ వరకూ భారం మొత్తం వెంకటేష్ మోయడంతో, సినిమా ఉరకలెత్తే కామెడీతో పరుగులు తీసింది. ఇంటర్‌వెల్ తర్వాత మాత్రం అనిల్ రొటీన్ పాయింట్‌ని టచ్ చెయ్యడంతో, కాస్త నెమ్మదించినా.. క్లైమాక్స్ మాత్రం సినిమాకి పర్‌ఫెక్ట్ కామెడీ కన్ క్లూజన్‌గా నిలిచింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్‌ని తెచ్చింది. అలాగే కామెడీ కటింగ్స్‌కి అతని అనుభవం బాగా పనికొచ్చింది. ముఖ్యంగా ఎబ్రాడ్ సీన్స్‌లో సమీర్ రెడ్డి కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమాకి మ్యూజిక్‌తో పెద్దగా అవసరం పడకపోవడంతో..మామూలు ట్యూన్స్ అందించాడు దేవీ శ్రీ ప్రసాద్. ఆర్.ఆర్ పరంగా కేర్ తీసుకున్నాడు. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. శిరీష్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే..  ముందునుండీ కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్తూ వచ్చిన F2..ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఎంటర్ టైనర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. పొంగల్ విన్నర్ అని అందరూ పొగిడేస్తున్న F2, పండగ అండతో బాక్సీఫీస్ దగ్గర  అద్భుతాలు చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్లస్ 
వెంకటేష్, వరుణ్‌ల నటన
ఫుల్‌గా పేలిన కామెడీడైలాగ్స్,
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్ 
పలుచని కథ
సెకండాఫ్‌లో రొటీన్ టచెస్
 

ట్రెండింగ్ వార్తలు