సమ్మర్ లో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్

  • Publish Date - April 3, 2019 / 08:32 AM IST

టాలివుడ్ లో సమ్మర్ హడావిడి మొదలైంది. సమ్మర్ లో హాట్ హాట్ గా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు తెలుగు హీరోలు రెడీ అవుతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక్కో హీరో ఒక్కో కమర్షియల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రాబోతున్నారు. పెద్ద హీరోల సినిమాలు పెద్దగా లేకపోయినా ఎండాకాలంలో ఎంటర్టైన్మెంట్ కి కొదవలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతోన్న మహర్షి సినిమా మే 9న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈసారి సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరో సినిమా ఒక్క మహర్షి మాత్రమే. ఇక మహర్షి మహేశ్ 25వ సినిమా కావడంతో ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న మజిలీ మూవీతో నాగచైతన్య, సమంత ఆడియన్స్ ని అలరించబోతున్నారు. అంతేకాదు నానీ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న జెర్సీ సినిమా కూడా ఏప్రిల్ 19న విడుదలకి సిద్దమవుతోంది. నానీ క్రికెటర్ గా నటిస్తోన్న..జెర్సీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాలే కాదు ఏప్రిల్ 6న ప్రేమకథా చిత్రం 2, ఏప్రిల్ 19న హర్రర్ మూవీ కాంచన 3, ఏప్రిల్ 25న సీత, ఏప్రిల్ 26న హాలివుడ్ మూవీ అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ కానున్నాయి.

ఇక మే నెలలో మహర్షితో పాటుగా మరో నాలుగు సినిమాలు ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మే 1న నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం రిలీజ్ కానుంది. మే17న రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇస్మార్ట్ శంకర్, మే 31న తమిళ్ హీరో సూర్య నటించిన ఎన్జీకే, దేవరకొండ నటించిన డియర్ కామ్రెడ్ సినిమాలు రిలీజ్ కి సిద్దమవుతున్నాయి.