Jagamae Sangeetham : ఆక‌ట్టుకుంటున్న జ‌గ‌మే సంగీతం ట్రైల‌ర్‌..

జ‌గ‌మే సంగీతం ట్రైల‌ర్‌ (Jagamae Sangeetham) విడుద‌లైంది

Jagamae Sangeetham Official Trailer out now

Jagamae Sangeetham : గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాత‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె జగమే సంగీతం అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి కీలక పాత్రల్ని పోషించ‌గా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సిరీస్ కుటుంబం, సంప్రదాయం, ఆత్మశోధనకు సంబంధించిన ఒక హృద్యమైన కథను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఇందులో వారసత్వం, ప్రేమ, స్వీయ వాణిని కనుగొనడం గురించిన కథకు కర్ణాటక సంగీతం శాశ్వత సౌందర్యం భావోద్వేగ ప్రధానాంశంగా నిల‌వ‌నుంది.

ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో అందుబాటులో ఉండ‌నుంది. తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.‘ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది’ అంటూ తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.. ‘స్వచ్ఛమైన సంగీతమే నా ఉఛ్వాసం, నిశ్వాసం.. ఎన్ని పాశ్చాత్య సంగీత పిల్ల కాలువలు పుట్టినా.. అన్నింటికీ అమ్మ శాస్త్రీయ సంగీతమే’.. అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ ..‘‘జగమే సంగీతం’ చిత్రంలో అద్భుతమైన కథతో పాటు, ఆ కథకు ప్రాణం పోసే సంగీతం కూడా ఉంటుందన్నారు. ప్రేమ, ఆశలు, గుర్తింపు, జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి సంబంధించిన అంశాలను ఈ చిత్రం చూపిస్తుంద‌ని తెలిపారు. ప్రేక్షకులు కేవలం సంగీతంతోనే కాకుండా, ఈ పాత్రలు సాగించే భావోద్వేగ ప్రయాణంతో కూడా కదిలిపోతారని ఆశిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. సూర్య ప్రతాప్, అసాధారణమైన తారాగణం, ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మేము ఈ కథలోని ఆత్మతో ఎంతగానో మమేకమయ్యామో, ప్రేక్షకులు కూడా అంతే మమేకమవుతారని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

నటి మధుబాల మాట్లాడుతూ .. ప్రతి కుటుంబంలోనూ ప్రేమ, అపార్థాలు, త్యాగాలు ఉంటాయి. వాటిని తరచుగా బయటకు చెప్పుకోలేం. ఈ సిరీస్ ఆ భావోద్వేగాలను అద్భుతమైన సున్నితత్వంతో చిత్రీకరించింద‌న్నారు.