Venkat K. Narayana : ఎట్టకేలకు విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్.. మీడియాతో మాట్లాడిన నిర్మాత..
సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ తాజాగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Venkat K. Narayana)
Venkat K. Narayana
Venkat K. Narayana : తమిళ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి సినిమా జన నాయగాన్. మన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా గత సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సెన్సార్ ఇబ్బందులతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రేపు జులై 23న జన నాయగాన్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా జననాయకుడు పేరుతో రానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మాణంలో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ తాజాగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
జన నాయగన్ రిలీజ్ విషయంలో వచ్చిన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. ముందుగానే ఇబ్బందులు వస్తాయని మేము అనుకున్నాం. విజయ్ గారు కూడా ఇది నా చివరి సినిమా. దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాను. అందువల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని ముందే చెప్పారు. అయితే థియేటర్స్ విషయంలో, రిలీజ్ విషయంలో ఇబ్బందులు వస్తాయని అనుకున్నాము కానీ రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు, సెన్సార్ ఇబ్బందులు… ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని అనుకోలేదు. ఈ సినిమాకు మొదట U/A సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత A సర్టిఫికెట్ ఇవ్వడం బాధ కలిగించింది అని తెలిపారు.
సినిమాల్లోకి రావడం గురించి మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. బిజినెస్ లో సక్సెస్ అయినా సినిమా రంగంలోకి రావడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. కోవిడ్ సమయంలోనే మేము ఎంటర్ అయ్యాము. ఆ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎన్ని సినిమాలు ఆగిపోయాయో, ఎంతమంది ఉపాధి కోల్పోయారో తెలిసింది. ముందు ఫిల్మ్ ఫైనాన్స్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసాము. రాజమౌళి RRR సినిమాను కర్ణాటకలో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ తర్వాత నిర్మాతగా మారాను అం తెలిపారు.
విజయ్ గురించి మాట్లాడుతూ.. విజయ్ మేనేజర్‌తో నాకు పరిచయం ఉంది. లియో సినిమా సమయంలో మా మధ్య చర్చలు జరిగాయి. ఒక్క మీటింగ్‌లోనే ఈ సినిమా ఓకే అయింది. సీఎం అయ్యాక ఆయన సినిమా థియేటర్లలో విడుదల కావడం ప్రేక్షకులకు, అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. విజయ్ గారు చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. అనుకున్న సమయానికి తన పని పూర్తి చేస్తార. విజయ్ గారి సినీ ప్రయాణానికి ఓ ట్రిబ్యూట్‌లా ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేశాం. ప్రస్తుతం విజయ్ గారి దృష్టంతా ప్రజా సేవపైనే ఉంది. ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటే మాత్రం కచ్చితంగా చేస్తాను. ఆయన నాకు ఒక ముఖ్యమైన బాధ్యత కూడా అప్పగించారు. నా అనుభవాన్ని ఉపయోగించి ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నాను అని తెలిపారు.
భగవంత్ కేసరి రీమేక్ పై స్పందిస్తూ.. భగవంత్ కేసరి సినిమా విజయ్ గారికి చాలా నచ్చింది. అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రాసుకున్నాం. ట్రైలర్ చూసి ఒక అభిప్రాయం ఏర్పడొచ్చు కానీ సినిమా చూస్తే పూర్తిగా కొత్త ప్రపంచం, కొత్త కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయాలనే థ్రెడ్ తప్పితే మిగతాదంతా పూర్తిగా కొత్త కథ అని తెలిపారు.
