Kannada Singer Rakshita Suresh Injured In Car Accident
Rakshita Suresh: ప్రముఖ కన్నడ నేపథ్య గాయని రక్షిత సురేష్ మలేషియాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో గాయపడింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 కన్నడ వర్షన్‌లో ఓ పాట పాడిన రక్షిత సురేష్ మంచి ఫేంను తెచ్చుకుంది. ఈ సింగర్ కన్నడలో పలు హిట్ సాంగ్స్‌ను పాడి అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె కారు ప్రమాదంలో గాయపడిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఆదివారం నాడు మలేషియా ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న రక్షిత సురేష్ కారు, అదుపుతప్పతి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందట. ప్రమాదం జరిగిన సమయంలో తన జీవితం మొత్తం కళ్ల ముందు రెండు క్షణాల్లో కనిపించిందని.. కారులో ఏర్పర్చిన ఎయిర్ బ్యాగ్స్ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని.. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన తీరుకు తాను ఇంకా వణికిపోతున్నానని.. కారు డ్రైవర్, ముందు సీటులో ఉన్న కో-ప్యాసెంజర్‌తో పాటు తనకు కూడా కొన్ని స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చింది.
రక్షిత సురేష్ కారు ప్రమాదం గురించి తెలుసుకుని, ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఉలిక్కి పడ్డారు. అయితే, ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయని ఆమె తెలియజేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.