Constable Kanakam : ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఊళ్ళో అమ్మాయిలు మిస్సింగ్..
వర్ష బొల్లమ్మ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam). ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Constable Kanakam Web Series Review : వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కింది. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. శ్రీకాకుళం దగ్గర్లోని రేపల్లె అనే ఓ గ్రామంలో కనకమహాలక్ష్మి అలియాస్ కనకం(వర్ష బొల్లమ్మ)కు కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. తనకు ఆ ఊళ్ళో ఎవరూ తెలియకపోవడంతో హెడ్ కానిస్టేబుల్(రాజీవ్ కనకాల) ఇంట్లో ఉంటుంది. ఓ సీనియర్ కానిస్టేబుల్ సత్తిబాబు తన బామ్మర్దికి ఆ పోస్ట్ ఇప్పిద్దాం అనుకుంటే కనకం రావడంతో తనపై కక్ష కడతాడు. రేపల్లెలో అడవి గుట్ట వైపు ఎవరూ వెళ్ళొద్దని ఆదేశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఊరికి మంచి జరగాలని ఆ ఊళ్ళో జాతర జరిపిస్తాడు ప్రసిడెంట్(అవసరాల శ్రీనివాస్).
జాతరలో కనకం బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక(మేఘలేఖ) బాబ్జీతో గొడవ పడుతుంది. అదే రోజు రాత్రి చంద్రిక కూడా కనపడకుండా పోతుంది. తెల్లారి బాబ్జీ చనిపోయి ఉంటాడు. దీంతో SI, సత్తిబాబు తనని వ్యతిరేకిస్తున్నా కనకం తన ఫ్రెండ్ ఎలా మిస్ అయింది? ఏమైంది? మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు కనిపెట్టాలని ప్రయత్నం మొదలుపెడుతుంది. మరి కనకం తన ఫ్రెండ్ ని కనిపెట్టిందా? దాని కోసం చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ ప్రయాణంలో కనకం ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? సత్తిబాబు ఏం చేసాడు? బాబ్జీ ఎలా చనిపోయాడు? అడవి గుట్ట లోకి ఎందుకు వెళ్లొద్దు అంటున్నారు? కనకంకు ఎవరు సపోర్ట్ చేసారు.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
సిరీస్ విశ్లేషణ.. కొన్ని రోజుల క్రితం కానిస్టేబుల్ కనకం(Constable Kanakam) యూనిట్ జీ తెలుగులో విరాటపాలెం సిరీస్ మా కథ అని, కాపీ కొట్టారు అని ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి వైరల్ అయిన సంగతి తెలిసిందే. విరాట పాలెంలో లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్ ఇందులో కూడా లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్ ఇదొక్కటి తప్పితే ఇంకే పోలిక లేదు. ఈ సిరీస్ యూనిట్ కంగారు పడి ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసారు అనిపిస్తుంది కానిస్టేబుల్ కనకం సిరీస్ చూసాక.
కానిస్టేబుల్ కనకం ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పటికే చాలా సినిమాల్లో, సిరీస్ లలో అమ్మాయిలు మిస్ అవ్వడం అనే కాన్సెప్ట్ చివర్లో ఎందుకు అని ఒక కారణం చూపించడం జరిగాయి. అదే కథతో రెగ్యులర్ కథాంశంతో బాగా సాగదీసి కానిస్టేబుల్ కనకంను తెరకెక్కించారు. అసలు కథ ముందుకు నడవదు. ఇక కనకం తన బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక మధ్య ఉండే సీన్స్ చూస్తే క్లోజ్ ఫ్రెండ్స్ సీన్స్ లా ఉండవు. ఆ సీన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరూ లెస్బియన్స్ లవర్స్ అనే సందేహం రాక మానదు. ఆ రేంజ్ డ్రమాటిక్ గా రాసుకున్నాడు డైరెక్టర్. ఓ ఎపిసోడ్ మొదట్లో చిన్నపుడు ఒక అబ్బాయి గురించి చూపిస్తారు కానీ ఆ ఎపిసోడ్ లో మాత్రం ఆ అబ్బాయి గురించి ఏమి ఉండదు. మరి ఆ ఎపిసోడ్ లోనే ఆ సీన్స్ ఎందుకు చూపించాడో డైరెక్టర్ కే తెలియాలి.
కానీ కనకం తన ఫ్రెండ్ కోసం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నుంచి మాత్రం కాస్త ఇంట్రెస్ట్ గా నడుస్తుంది కథ. ఇక ఇలాంటి మిస్సింగ్ కథల్లో దొంగ అతనా, ఇతనా అని అనుమానాలు రేకెత్తించడం కామన్. ఆ అడవి గుట్ట సీన్స్ అన్ని ఏదో జరుగుతుందనే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి హారర్ అనుభవం అయితే ఇచ్చారు. క్లైమాక్స్ లో విలన్ ఎవరు అనేది మెయిన్ ట్విస్ట్.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో క్యూట్ గా కనిపించిన వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ఇందులో అమాయకంగా ఉండే కానిస్టేబుల్ పాత్రలో తన ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించే పాత్రలో బాగానే నటించి మెప్పించింది. రాజీవ్ కనకాలకు హెడ్ కానిస్టేబుల్ పాత్రతో మంచి పాత్రే వచ్చింది. కనకం ఫ్రెండ్ పాత్రలో హీరోయిన్ మేఘలేఖ క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది.
కాళ్ళు పడిపోయి వీల్ చైర్ లోనే సెటిల్ అయిన పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనపడ్డాడు. రచయిత రాకేందు మౌళి ఓ చిన్న పాత్రలో కనిపించి పర్వాలేదనిపించాడు. సత్తిబాబు పాత్రలో నటించిన నటుడు, SI పాత్రలో నటించిన నటుడు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. నైట్ విజువల్స్ కూడా బాగా చూపించారు. లొకేషన్స్ కేవలం రెండు లొకేషన్స్ లో సిరీస్ మొత్తం తీసేసారు. ఊరంతా ఒకే చోట సెట్ వేసి, అడివి సీన్స్ ఒక చోట తీశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు. కథలో ఏం లేకపోయినా మ్యూజిక్ తో అక్కడ ఏదో ఉందని ఓ రేంజ్ లో సీన్స్ ని ఎలివేట్ చేసారు. కథ, కథనం రొటీన్. ఎడిటింగ్ కి మాత్రం చాలా పని చెప్పాలి. చాలా ల్యాగ్ ఉంది సిరీస్ లో. చాలా వరకు కట్ చేయొచ్చు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. ఒక సారి ఫార్వార్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు.
గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.