Kiku Chiranjeevi Review : కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడి వైపు ఉంటే..

కికు చిరంజీవి మూవీ (Kiku Chiranjeevi Review )నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

  • Updated on- August 28, 2026 / 03:10 PM IST

Kiku Chiranjeevi Movie Review and Rating Cast Kiku Yanamala Kashish Khan

Kiku Chiranjeevi Review : కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘కికు చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మాణంలో శుభ సాయి వెంకట్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా రాఘవ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. కికు చిరంజీవి సినిమా నేడు ఆగస్టు 28న థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే..

చిరంజీవి(కికు యనమల) ఒక అనాథగా పెరిగి ఫోటోగ్రాఫర్ అవుతాడు. ఇతనికి గుండె కుడివైపు ఉంటుంది. దానివల్ల ఓ సమస్యతో బాధపడుతూ ఉంటాడు. మను(కశిష్‌ ఖాన్‌) కూడా ఓ అనాథ. ఆమెని శ్రీకాంత్ అయ్యంగార్‌ దత్తత తీసుకొని పెంచుతాడు. మనుకి ఒక పెళ్లి సంబంధం చూస్తే ఆ అబ్బాయిని కలవడానికి, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి టూర్‌ కి వెళ్తుంది. వీళ్ళ టూర్‌ని కవర్‌ చేయడానికి చిరంజీవి వెళ్తాడు. మనుని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి బస్‌ కింద పడి చనిపోతాడు. అనుకోకుండా బస్సులో వాళ్లంతా అడవిలోకి వెళ్తారు. అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో చిరంజీవి పరిగెత్తడం వల్ల ఆక్సిజన్‌ అందక అతని ఒళ్లంతా నీలిరంగులోకి మారుతుంది. చిరు, మను ఫారెస్ట్ లో తప్పిపోవడం, అక్కడ కొని సంఘటనలు జరగడం, వీరిద్దరూ ప్రేమించుకోవడం జరుగుతుంది. చిరంజీవిపై పలువురు దాడి చేయడంతో ఈశ్వరీరావు కారులో వస్తూ లిఫ్ట్ ఇచ్చి చిరంజీవిని హాస్పిటల్ లో చేరుస్తుంది. అసలు చిరంజీవికి గుండె ఎందుకు కుడివైపు ఉంది? ఎడమవైపుకు మారుతుందా? ఈశ్వరరావుకు చిరంజీవికి ఉన్న సంబంధం ఏంటి? చిరంజీవి -మను ప్రేమ ఫలిస్తుందా? చిరంజీవి, మను పై దాడి చేసింది ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

సినిమా విశ్లేషణ..

గుండె కుడివైపు ఉందనే కాన్సెప్ట్ తో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. హీరోయిన్ సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదంటూ స్టేజిపై మాట్లాడి బాగా బజ్ క్రియేట్ చేసారు ఈ సినిమాకు. ఫస్ట్ హాఫ్ హీరోహీరోయిన్ల పాత్రల పరిచయం, హీరోయిన్ పెళ్లి టాపిక్ తో సింపుల్ గా సాగుతుంది. ఓ వ్యక్తి బస్సు కింద పడి చనిపోవడం, హీరో హీరోయిన్స్ ఫారెస్ట్ లోకి వెళ్లడంతో కథ ఆసక్తిగా మారినా మధ్యలో ఓ కోయజాతి సీన్ రొటీన్. హీరో సమస్య చెప్పిన తర్వాత, దుండగులు వీరి వెంటపడ్డ దగ్గర్నుంచి మళ్ళీ సన్నివేశాలు ఆసక్తిగా నడుస్తాయి. ఇంటర్వెల్ కి ఆసక్తికర ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, అసలు చిరంజీవి ఎవరు? అతను సైకోలా ప్రవర్తించే సీన్స్ తో సెకండ్ హాఫ్ అంతా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంత సాగదీసినా, సెకండ్ హాఫ్ బాగానే తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సీన్స్ ముక్కలు ముక్కలుగా తీసి అతికించినట్టు అనిపిస్తుంది. హీరో – హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ని అక్కడక్కడా సాగదీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సినిమాని బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. తనికెళ్ల భరణి పాత్ర బాగుంటుంది. కొంత కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్‌ అంశాలు.. అన్నిటిని కవర్ చేసారు.

అయితే గుండె కుడివైపు ఉండటం అనే కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పాయింట్ రేర్ గా వచ్చేదే అయినా కథనం బాగానే రాసుకున్నారు. చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సీన్స్ బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

చిరంజీవి పాత్రలో కికు యనమల బాగా నటించాడు. మొదటి సినిమా అయినా డిఫరెంట్‌ షేడ్స్ చూపించి మెప్పించాడు. గుండె కుడివైపు ఉండటం, దాని వల్ల వచ్చే సమస్యలు.. ఆ సీరియస్ సీన్స్ లో కికు చాలా బాగా నటించారు. మను పాత్రలో కశిష్‌ ఖాన్‌ బాగానే నటించింది. ఈశ్వరీరావు ఎమోషనల్ పాత్రని బాగా పండించారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు. కొత్త పాయింట్ తీసుకున్నా రెగ్యులర్ కథనంతో కాస్త థ్రిల్లింగ్ గా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘కికు చిరంజీవి’ హీరోకి గుండె కుడివైపు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.