Sathi Leelavathi : ‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినిమా ఎలా ఉందంటే..
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నుంచి పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ఇది మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. (Sathi Leelavathi)
- Saketh U
- Updated on- May 8, 2026 / 12:51 PM IST
Sathi Leelavathi
Sathi Leelavathi Movie Review : లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సతీ లీలావతి. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్, మొట్టా రాజేంద్రన్, విటివి గణేష్,సప్తగిరి, జాఫర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సతీ లీలావతి సినిమా నేడు మే 8న థియేటర్స్ లోరిలీజయింది.
కథ విషయానికొస్తే..
లీలావతి(లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. తన భర్త రామ్ సేతు(దేవ్ మోహన్) లీలావతి తనకు టైం ఇవ్వట్లేదని విడాకులు తీసుకుందాం, నేను ఇంకో అమ్మాయి నికోలా(మడోన్నా సెబాస్టియన్)ని ఇష్టపడ్డాను అంటాడు. మొదట బాధపడిన లీలావతి తన భర్తని వదులుకోలేక అతన్ని కొట్టి కట్టేసి తమ పెళ్లి, ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అయితే నువ్వే నన్ను ప్రేమించావని మీ నాన్న(నరేష్), బావ(జాఫర్)బెదిరించి నాకు ఇష్టం లేకపోయినా నీతో పెళ్లి చేసారు అనే నిజం చెప్తాడు సేతు.
ఆ షాక్ లో లీలావతి ఉండగా తమ ఇంటికి లీల తండ్రి, బావ, నికోలా, లాయర్(విటివి గణేష్).. ఇలా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. తన భర్తని కట్టేసి ఇంట్లోనే దాచిన లీలావతి వెళ్ళందర్నీ మేనేజ్ చేసి పంపిస్తుంది. కానీ తనతో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని చేయలేదని నిర్మాత(మొట్ట రాజేందర్) లీలావతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. అదే సమయంలో ఓ దొంగ(సప్తగిరి) లీల ఇంట్లో పడతాడు. మరి లీలావతి భర్తని కట్టేసి దాచిన విషయం వీళ్ళందరికీ తెలుస్తుందా? లీలావతిని ఎవరు కాపాడతారు? ఇంట్లో రామ్ సేతుని చూసిన దొంగ ఏం చేస్తాడు? చివరికి రామ్ సేతు లీలతో కలుస్తాడా? లేక నికోలాతో వెళ్ళిపోతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Godari Gattupaina Review : ‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ.. ఆటో డ్రైవర్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవ్వాల్సిందే..
సినిమా విశ్లేషణ..
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నుంచి పెళ్లి, బాబు పుట్టిన తర్వాత ఇది మొదటి సినిమా కావడం, భార్య, భర్తల స్టోరీ కావడం, కామెడీ సినిమా అని చెప్పడం, ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ హాఫ్ లీలావతికి రామ్ సేతు విడాకులు అడగడం, లీల అతన్ని కొట్టి కట్టేయడం, ఒక్కొక్కరు ఇంటికి రావడంతో సాగుతుంది. భార్య – భర్తల మధ్య కొట్టుకోవడం కామెడీగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. కట్టేసిన భర్తని వీళ్ళు కనిపెడతారేమో అని లీలా భయపడే సస్పెన్స్ ని కొంత మెయింటైన్ చేయగలిగారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లీలా – సేతు లవ్ స్టోరీ మరీ సిల్లీగా, సింపుల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో లీల కిడ్నాప్, దొంగ ఎంటర్ అవ్వడం, లీలాని ఎవరు కాపాడతారు?, మధ్యలో భార్య భర్తల ఎమోషన్ తో బాగా సాగదీశారు.
ఎక్కడా క్లారిటీ లేకుండా సినిమా నడుస్తుంటే చివర్లో ఓ రెండు ట్విస్టులు ఇవ్వడం గమనార్హం. కామెడీ కోసం సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్.. ఇలా చాలా మందిని పెట్టుకున్నారు కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఒకటి రెండు సీన్స్ తప్ప ఎక్కడా నవ్వు రాదు. కొన్ని చోట్ల అయితే ఎందుకు ఈ అక్కర్లేని సీన్స్ అనిపిస్తుంది. సినిమా మొదట్లో ఓ చైల్డ్ ఎపిసోడ్ చూపించి చిన్నప్పుడే రామ్ సేతు – లీలావతి కలిసినట్టు చూపిస్తారు కానీ అది సినిమాలో ఎక్కడా లింక్ చేయలేదు. దాంతో ఆ ఎపిసోడ్ ఎందుకు అనిపిస్తుంది.
ఇక భార్య భర్తల రిలేషన్, ఎమోషన్ గురించి చాలా డైలాగ్స్ చెప్పారు కానీ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. మరీ ఇంత వరస్ట్ డైలాగ్స్ ఏంటి అని కొన్ని డైలాగ్స్ అనిపిస్తాయి. అసలు లీలా – సేతు మధ్య ఏ ఎమోషన్ ని పండించకుండానే సేతు ఎలా మారిపోయాడో అర్ధం కాదు. కాసేపు ఏదో టైం పాస్ కి చూడాలనుకుంటే చూడటమే. ఇక కేవలం హీరోయిన్ పాత్ర పేరు తప్ప ఈ సినిమాకు సతీ లీలావతి అని పేరు ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడటం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
లావణ్య త్రిపాఠి భార్య పాత్రలో బాగానే నటించింది. దేవ్ మోహన్ పర్వాలేదనిపించారు. మడోన్నా సెబాస్టియన్ కాసేపు అందంగా కనిపించి మెప్పిస్తుంది. సప్తగిరి, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్.. వీళ్లంతా నవ్వించే ప్రయత్నం చేసారు. నరేష్, పవిత్ర.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అంతగా మెప్పించవు. ఇక డబ్బింగ్ సినిమాకు చాలా మైనస్ అయింది. హీరో, హీరోయిన్స్ మెయిన్ పాత్రల డబ్బింగ్ చాలా వరస్ట్, చాలా చోట్ల లిప్ సింక్ కూడా అవ్వలేదు. ఎడిటింగ్ లో చాలా అక్కర్లేని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ లో షూట్ చేసారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ లాంటి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ తాతినేని సత్య ఇలాంటి సినిమా తీసాడా అని సందేహం రాక మానదు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సతీ లీలావతి’ సినిమా భర్త విడిపోదాం అంటే ఏం చేసి భార్య తన భర్తను మార్చుకుందాం అనుకుంటుంది అని కామెడీగా చెప్పే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
