‘లవ్ అండ్ శుక్లా’.. మధ్యతరగతి జీవితాల జీవన ప్రతిబింబం..

  • Publish Date - December 5, 2020 / 04:07 PM IST

Love And Shukla: మధ్యతరగతి జీవితాల్లో సొంత ఇల్లు, పెళ్లి అనే రెండు అంశాలు ఖర్చుతో పాటు, మరింత బాధ్యతలతో కూడుకున్న విషయాలు కూడా. అట్టపెట్టె లాంటి అద్దె ఇళ్లలో కొత్తగా పెళ్ళైన ఆలుమగల మధ్య ఏకాంతానికి, మాటలకు కూడా హద్దులు, పరిమితులు ఉంటాయి.

బహుశా ప్రేమగా కాస్త దగ్గరకు తీసుకుని మాట్లాడదాం అనుకున్నా ఏ సమయానికి ఎవరు వస్తారో, ఎవరు చూస్తారో, ఏమని ఆటపట్టిస్తారో అన్న భయం, బిడియం వెంటాడుతాయి. మధ్యతరగతి జీవితాల్లో చోటు చేసుకునే ఈ అంశాలనే కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘లవ్ అండ్ శుక్లా’.. డిసెంబర్ 5, 6 తేదీల్లో.. వీకెండ్ స్పెషల్‌గా నెటిజన్స్ ఫ్రీ గా ఈ చిత్రాన్ని చూసేలా పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ అవకాశం కల్పించింది. సినిమా ఎలా ఉంటుందంటే..



కథ :
మను శుక్లా ఓ మధ్యతరగతి ఆటో డ్రైవర్. తన జీవితంలోకి రాబోయే భార్య కోసం ఎన్నో కలలు కంటుంటాడు. ముంబాయి నగరంలో అట్టపెట్టె లాంటి అద్దె ఇంట్లో తన తల్లిదండ్రులతో పాటు జీవనం సాగిస్తుంటాడు. కొత్తగా పెళ్ళైన భార్యతో కాస్త ఏకాంతంగా గడపాలనుకుంటాడు కానీ, ఆ చిన్న ఇంట్లో జంటగా కాసేపు మనసు విప్పి మాట్లాడేందుకు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండదు.

మాటలకే కరువొచ్చినపుడు, సాన్నిహిత్యం అన్నది పూర్తిగా గగనమే. ఎప్పడూ ఇంట్లో అమ్మానాన్నల సీరియల్స్ గోల చికాకు పెట్టిస్తుంది. ఆఖరికి సొంత భార్యనే ఏకాంతం కోసం హోటల్ రూమ్‌‌కి తీసుకువెళ్లవలసిన పరిస్థితి వస్తే, అక్కడేమో పోలీసుల చేతిలో పరాభవం అతడిని తీవ్రంగా కలచివేస్తుంది.


దీనికి తోడు పుట్టింటికి తిరిగి వచ్చిన అక్క ఇంట్లో హడావిడి మరోపక్క. పెళ్లి, ప్రేమ కోసం ఎంతో అర్రులు చాచిన వ్యక్తి కాస్తా ఈ సమస్యల సుడిగుండంలో విసుగు చెంది, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అన్నిటికి ఎలాగైనా ఒక పరిష్కార మార్గం కోసం వెదుకుతాడు. అలా ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనగలిగాడా, లేదా అన్నదే మిగిలిన కథ.

నటీనటులు :
సినిమా చాలా సహజంగా ఉంది. ప్రధాన పాత్రలు సహర్శ్ కుమార్ శుక్లా, తనియా రజ్వాట్, హిమా సింగ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. కొత్తగా పెళ్ళైన భార్య పాత్రలో తనియా రజ్వాట్ పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.


దర్శకుడు :
దర్శకుడు సిద్దార్థ్ సినిమాని చాలా నేచురల్‌గా, నీట్‌గా తీశాడు. అన్నట్లు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మన తెలుగువ్యక్తేనండోయ్. ఇక్కడి కుర్రాడు బాలీవుడ్‌కెళ్లి సినిమా తీసి మెప్పించడం తెలుగు వారందరికీ గర్వకారణం.

ముంబైలో ప్రతి మధ్య తరగతి వ్యక్తి ఎదుర్కొనే సమస్యనే కథాంశంగా తీసుకుని, దానికి ఎమోషన్ యాడ్ చేసి, అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించి ప్రశంసలందుకున్న సిద్దార్థ్, రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామ్యవడం విశేషం. అలాగే కెమెరా కూడా తనే హ్యాండిల్ చేశాడు.


‘లవ్ అండ్ శుక్లా’ మూవీ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు 16వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ 2018 సంవత్సరానికి గానూ అఫీషియల్‌గా సెలెక్ట్ అయింది. అలాగే పలు అవార్డులు, సినీ ప్రియుల రివార్డులు కూడా అందుకుంది.