Chiranjeevi: నా తమ్ముడిని అలా చూస్తుంటే.. పవన్ కళ్యాణ్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
30 ఏళ్ల క్రితం సీన్ గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 04:30 PM IST
Megastar Chiranjeevi posted an emotional post about his brother Pawan Kalyan
- చిరంజీవి, బాబీ కొత్త సినిమా ప్రారంభం
- ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్
- తమ్ముడిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నూతన చిత్ర ప్రారంభోత్సవం పండగ వాతావరణాన్ని తలపించింది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. “ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది. అది ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా సమయం” అంటూ చిరంజీవి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసిన చిత్రానికి చిరంజీవి క్లాప్ కొట్టగా, ఇప్పుడు చిరంజీవి 158వ సినిమాకు పవన్ క్లాప్ కొట్టడం ఒక అద్భుతమైన కాకతాళీయం.
తన తమ్ముడు సాధించిన ఎదుగుదలపై చిరంజీవి ఎంతో గర్వంగా స్పందించారు. “ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ.. లవ్ యూ కళ్యాణ్” అంటూ చిరంజీవి తన ప్రేమను చాటుకున్నారు. పొలిటికల్ బిజీ షెడ్యూల్‌లోనూ అన్నయ్య సినిమా కోసం పవన్ కళ్యాణ్ రావడం, మెగాస్టార్ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇలా అన్నదమ్ముల బాండింగ్ చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
